Thursday 5 January 2012

కూంబింగ్ కు బయలుదేరాము.

అడుగు ముందుకు జాగ్రత్తన్నో, మందు పాతర ఉందేమో...
కూంబింగ్ కు వెళ్ళటానికి మొత్తం అన్ని విభాగాలు సాయంత్రంకల్లా సిద్దమయ్యాయి. రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, ఎపుడు బయల్దేరేది తరవాత చెపుతామని చెప్పారు. దాంతో మేము రాత్రి 0900 గంటల కల్లా భోజనం చేసి పడుకున్నాము. నాకు చిన్నప్పటి నుండి నిద్ర అంటే చాలా ఇష్టమే కాక మధ్యలో నిద్ర చెడగొడితే భలే కోప్పడతాను. ఆ రోజు రాత్రి నేను మంచి గాఢ నిద్రలో ఉండగా అర్థరాత్రి సుమారు 1200 గంటల సమయంలో మమ్మల్ని నిద్రలేపారు. కళ్ళు నులుముకుంటూ లేచి చూసేసరికి అందరూ కూంబింగ్ కు వెళ్ళటానికి తయారు అవుతున్నారు. నాకు నిద్రాభంగం అయ్యేసరికి చికాకుగా అనిపించింది. సరే తప్పదు కదా అనుకొని లేచి మాకు ఇచ్చిన బ్యాగును, తుపాకీని తీస్కోని మాకు కేటాయించిన వాహనంలో ఇతర కానిస్టేబుళ్లతో పాటు వెళ్లి కూర్చున్నాను. ఆ వాహనం గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది లెండి. అంతకు ముందు అది బొగ్గు రవాణా చేసి వచ్చిందేమో, దాని నిండా బొగ్గు రేణువులు ఉండి మా దుస్తులు, బ్యాగులు కూడా నల్లగా అయిపోయాయి. మొత్తానికి మొదటిసారి మా కూంబింగ్ కు బయలుదేరాము.

                  దాదాపు రెండు గంటలకు పైగా ప్రయాణం చేసిన తర్వాత మేము మా జిల్లా సరిహద్దు లో ఉన్న అడవి సరిహద్దులోకి చేరుకున్నాము. రహదారి ప్రక్కన మా వాహనాన్ని నిలిపి అందరూ దిగిపోయాక ఆ వాహనం వెళ్ళిపోయింది. మా విభాగానికి గ్రే హౌండ్స్ కు చెందిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి (ఆర్.ఐ.) భాద్యుడు గా (ఇంచార్జ్) ఉన్నాడు. అంటే మేము కూంబింగ్ మొత్తం మూడు రోజులు అతని ఆదేశాల ప్రకారం నడచుకోవాలి అంతే కాక మా యొక్క మంచి చెడ్డలు చూసుకునే భాద్యత కూడా కూడా అతనిదే అన్నమాట. అతను కాక గ్రే హౌండ్స్ కు చెందిన మరో ఎస్.ఐ. స్థాయి అధికారులు ఇద్దరు కూడా ఆర్.ఐ. గారికి సహాయకులుగా మా కూంబింగ్ విభాగంలో ఉన్నారు. మా కూంబింగ్ విభాగంలో జిల్లా కానిస్టేబుల్ ట్రైనీలం 10 మందిమి ఉండగా, గ్రే హౌండ్స్ కు చెందిన 15 మందితో కలిపి మేము మొత్తం సుమారు 25 మందిమి ఉన్నాము.  

                 మేము వాహనంలోంచి దిగిన వెంటనే మా వంటికి మరియు బ్యాగులకు అంటిన బొగ్గు దుమ్మును దులుపుకుని, వెంటనే మా ఆర్.ఐ. గారి ఆదేశాలపై బ్యాగును వీపుపై, తుపాకీని భుజంపై వేసుకుని రహదారి ప్రక్కనే ఉన్న అడవిలోకి నడక ప్రారంభించాము. అయితే మేము వెళ్ళింది అమావాస్య సమయంలో అనుకుంటా, అందుకే మేము దిగిన వెంటనే చిమ్మ చీకటిగా ఉండి కొద్దిసేపు ఏమీ కనిపించలా. కానీ కొద్దిసేపటికి కళ్ళు రాత్రి వాతావరణానికి అలవాటు పడటంతో కొద్దిగా నేలపై ఉన్న రాళ్ళు, ఎగుడు దిగుడులు మరియు చుట్టూ ఉన్న చెట్లు చేమలు మసక మసకగా కనిపించటం ప్రారంభించాయి. నాకు ఒక ప్రక్క ఎటువైపు నుండి, ఎప్పుడు నక్సలైట్లు దాడి చేస్తారో అని భయంగానూ, మరో ప్రక్క అడవిలోకి వెళుతున్నందుకు ఉత్సుకత గానూ ఉంది. నేను ఇంటర్ మీడియట్ చదివేటపుడు మా కాలేజ్ ప్రక్కనే ఉన్న అడవిలోకి పలుమార్లు ఉసిరికాయలు, తునికి కాయలు వంటి అడవిలో దొరికే ఫలాల కోసం వెళ్ళినా అది చిట్టడివి మాత్రమే, కానీ ఇప్పుడు వచ్చింది భయంకరమైన అడవి మృగాలు మరియు మావోయిస్ట్ లు సంచరించే దట్టమైన అడవుల్లోకి. నడక ప్రారంభమైన కొద్దిసేపటికే వీపుపై ఉన్న బ్యాగు మరియు భుజంపై ఉన్న తుపాకీ నెమ్మదిగా బరువుగా అనిపిస్తూ క్రమంగా అది భరించలేని నొప్పిగానూ మారిపోతూ వస్తోంది. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత మా ఆర్.ఐ. గారు ఒక ప్రదేశంలో మా విభాగాన్ని నడక నిలిపి తెల్లవారే వరకు విశ్రాంతి తీసుకుందామని చెప్పటంతో "బ్రతికాంరా దేవుడా" అనుకొని బ్యాగు, తుపాకీలను క్రిందికి దింపినాము. వంతుల వారీగా కొంత మంది పడుకొనగా, కొంతమందిమి కాపలా ఉన్నాము. అయితే నాకు కాపలా ఉన్నపుడు మరియు పడుకున్నపుడు కూడా ఒకరకమైన ఉద్వేగం వల్ల మరియు ఎపుడు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్ర పోలేదు, చూస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. మరుసటి రోజు ఎలా గడిచిందో... 

(మనం చూసే పోలీసు ఉద్యోగం నాణేనికి ఒక వైపు అయితే అడవిలోకి కూంబింగ్ కు వెళ్ళేపోలీసు ఉద్యోగం ప్రజలకు కనిపించని మరో పార్శ్వం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

1 comment:

  1. మీ పోలీస్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగా వున్నాయండి . మాకు తెలీని ఇంకో కోణాన్ని బాగా రాస్తున్నారు .

    ReplyDelete