Monday 31 October 2011

రన్నింగులో నా శక్తి సామర్థ్యాలు నాకు తెలిసిన రోజు

ఇంతకుముందే చెప్పినట్టు నేను చిన్నప్పటినుండి కష్టమైన పనులు చేసి పెరిగి ఉండటం వల్ల, మరియు సహజమైన నా బక్కపలుచని మరియు ఎతైన శరీరాకృతి వల్ల నేను బాగానే పరుగెత్తేవాడ్ని. అయితే నా శరీరం దూరపు పరుగుకు బాగా అనువుగా ఉందని నాకు ట్రైనింగ్ మొదలైన కొద్దినెలలకు  మొదటిసారి తెలిసింది. మాకు వారానికి ఒకసారి యూనిఫారంతో, భుజాన చెక్క తుపాకీతో. వీపుపై 5 కిలోల బరువుతో 3.2 కి.మీ. పరుగు పందెం ఉండేది. వీపుపై 5 కిలోల బరువు కోసం ఇటుక ముక్కలు వేస్కునేవాళ్ళం. పరుగెడుతున్నపుడు అవి వీపుపై ఎగిరెగిరి పడుతూ బాగా నొప్పిగా, ఇబ్బందిగా ఉండేది. అంతకు ముందు కొద్ది వారాలుగా జరుగుతున్న ఆ పరుగులో నేను పాల్గొంటున్నా, ఎపుడూ ఫస్టు రాలేదు. నేను సామర్థ్యం మేరకు బాగానే పరుగెత్తినా చివర్లో స్లోగా పరుగెత్తేవాడ్ని. దానికి ఒక సహేతుకమైన కారణం లేకపోలేదు. అదేమిటంటే--

           మా విభాగంలో, నా పక్కనే మా జిల్లాకు చెంది ఒక గిరిజన ట్రైనీ ఉండే వాడు. అతన్ని మా విభాగం వాళ్ళంతా "మామ" అని పిలిచేవాళ్ళం. ఆటను పొట్టిగా ఉంది, ధృడంగా ఉండేవాడు. అతను NCC -C సర్టిఫికేట్ పొందిన వ్యక్తి. అతను నాతో "మనం బాగా కష్టపడి ట్రైనింగ్ చేస్తే, బాగా మెరిట్ ఉన్నవాళ్ళని "గ్రేహౌండ్స్" లోకి తీస్కుంటారు, మళ్ళీ మనం నక్సల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా మెరిట్ తెచ్చుకోవద్దురా" అని ఎపుడూ నా పక్కనే ఉంటూ హెచ్చరించేవాడు. దాంతో నేను పరుగు పందెం లో స్లోగానే పరుగెత్తే వాడ్ని. మా విభాగంలో బాగా ధృడంగా, బలిష్టంగా ఉండే మెదక్ కు చెందిన ట్రైనీ ఎపుడూ ఫస్టు వస్తుండేవాడు. ఆ విధంగా నేను నా మిత్రుడు "మామ" గాడి సలహాపై నాలో వేగంగా పరుగెత్తే సామర్థ్యం  ఉన్నా  నెమ్మదిగా పరుగెత్తేవాడ్ని. ట్రైనింగ్ సరిగా చేయని బద్దకస్తులని "మకరా" అని పిలిచేవాళ్ళు, కానీ నేను ఆ విధంగా కాదు. "మామ" గాడు మాత్రం నిజంగా "మకరా" లాగానే ప్రవర్తించే వాడు. చిన్నప్పటి నుండి ఒళ్ళు దాచుకోనివ్వని నా తత్త్వం నన్ను అపుడపుడూ హెచ్చరిస్తుండేది.

          కొద్ది నెలల తర్వాత ఒక రోజు మాకు 3.2 కి.మీ. పరుగు పందెం పెట్టారు. ఆ రోజు "మామ" గాడు ఆరోగ్యం బాగాలేక రూములోనే ఉన్నాడు. పరుగు మొదలయ్యాక నేను వేగంగానే పరుగెత్తాను. ఎపుడూ ఫస్టు వచ్చే మెదక్ ట్రైనీతో పాటు నేనూ వేగంగా పరుగెత్తి, చివర్లో అతన్ని క్రాస్ చేసి ఫస్టు వచ్చాను. దాంతో అందరూ "ఎపుడూ వెనక ఉండే వీడు ఈ రోజు ఫస్టు ఎలా వచ్చాడా అని'' ఆశ్చర్యపోయారు. నాకూ నా పూర్తి సామర్థ్యం అపుడే తెలిసింది. కానీ ఆ ఆనందం కొద్దిసేపే, ఎందుకంటే రూముకు రాగానే "మామ" గాడు "ఏరా గ్రేహౌండ్స్ కు వెళ్ళాలని ఉందా? ఈ రోజు రన్నింగ్ లో ఫస్టు వచ్చావంట!" అని బెదిరించాడు. దాంతో మళ్ళీ ఎపుడూ ఆవేశపడి వేగంగా పరుగెత్తకూడదని నిర్ణయించుకున్నాను. అయితే "మామ" గాడు చెప్పినట్టే  నేను పరుగు చివరి వరకు ముందు ఉన్నా, చివర్లో "మామ" గాడితో పాటు వెనకే వచ్చేవాడ్ని. వాడు చెప్పినట్టే ట్రైనింగ్ అయ్యాక మెదక్ ట్రైనీ గ్రేహౌండ్స్  కు సెలెక్ట్ కావటం, నేను సెలెక్ట్ కాకపోవటంతో వాడు చెప్పింది నా మంచికేనేమో అనిపించింది. అయితే "మామ" గాడు నన్ను ట్రైనింగ్ లో ఇంకా ఏ విధంగా ప్రభావితం చేసాడో, నాకు మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది మళ్ళీ చూద్దాం. 

(పోలీసు కూడా మనలానే ఒక మనిషి, మనలోనుండే అతను పోలీసుగా ఎంపికై భాద్యతలు నిర్వహిస్తున్నాడు అంతే)
----నేను ఒక క్రమంలో నా అనుభవాలన్నీ చెబుదామని అనుకుంటున్నా, ప్రత్యేకంగా ఏదైనా విషయంలో  నా సలహాలు లేదా నా స్పందన కావాలంటే policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.


Saturday 29 October 2011

ట్రైనింగ్ లో దినచర్య




రోజూ పొద్దున్నే 05:45 కల్లా షేవింగ్ చేస్కుని, నీటుగా డ్రెస్ వేస్కుని గౌండ్ లో ఉండాలి. మేము 04:30 కే అలారం పెట్టుకుని లేచేవాళ్ళం. ఎందుకంటే అందరికి సరిపడా స్నానపుగదులు ఉండేవి కావు, కాబట్టి అపుడు లేస్తే కానీ రెడీ అవలేం. 06:00 గంటలకు ట్రైనింగ్ మొదలు అవుతుంది. మేము వైట్ షార్ట్, వైట్ టీషర్ట్ మరియు వైట్ షూతో గ్రౌండ్ కు వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే ఎంత ఫ్రెష్ గా వెళ్తామో బ్రేక్ఫాస్ట్ కు వచ్చేసరికి అంత అలసిపోయి ఉండేవాళ్ళం. మా విభాగం లో వారానికి ఒకర్ని లీడర్ గా ఉంచేవాళ్ళు. ఎందుకంటే అందరికీ విభాగాన్ని లీడ్ చేసే అవకాశం కోసం. పొద్దున్నే అందరం గ్రౌండ్ లో విభాగాలవారీగా నిలుచోగానే అన్ని విభాగాల లీడర్లు అందరు వచ్చారా లేదా అని చెక్ చేస్కొని ట్రైనింగ్ ఇంచార్జ్ కు రిపోర్ట్ ఇచ్చేవారు. అపుడు మా ట్రైనర్ అందర్నీ చెక్ చేసి అందరూ షేవింగ్ సరిగా చేస్కున్నారా లేదా, డ్రెస్ నీటుగా ఉందా లేదా అని తనిఖీ చేసేవారు. ఎవరైనా గడ్డం సరిగా చేస్కోకపోతే ఆ రోజు అతనికి పనిష్మెంట్ ఇచ్చేవారు. అంటే ఎక్కువ రౌండ్లు పరుగెత్తటం, లేదా అందరికీ రెస్ట్ టైములో అతన్ని పరుగెత్తించటం వంటి పనిష్మెంట్లు ఉండేవి. 

             కొద్దిరోజులకు అంతా బయపడి నీటుగానే తయారై వచ్చేవాళ్ళు. గడ్డం వచ్చిన కొత్తలో ఇంకా పూర్తిగా రాలేదే అని బాధపడితే, ట్రైనింగ్ లో ఎందుకు గడ్డం వచ్చిందా అని అనుకున్న రోజులు ఎన్నో. గడ్డం పూర్తిగా రాకుండా ఉన్నా, పిల్లి గడ్డం వాళ్ళు ఉన్నా "నీపని బావుందిరా" అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే చలికాలంలో చర్మం బిగుసుకుపోయి గడ్డం సరిగా తెగదు. కొద్దిగా చేతికి గడ్డం గరుకుగా తగిలినా ట్రైనర్ ఒప్పుకునేవాడు కాదు. దాంతో గడ్డం గట్టిగా గీయటం వల్ల చర్మం గరుకుగా తయారై మంటగా ఉండేది. 0600  గం.నుండి  0730 గం.వరకు ఫిజికల్ ట్రైనింగ్ అనగా రన్నింగ్ మరియు ఇతర శారీరఖ వ్యాయామం ఉండేవి. తరవాత  0900 గం. వరకు డ్రిల్ అనగా  యూనిఫారంతో చేసే కవాతు చేసేవాళ్ళం. తరవాత 1030 గం.వరకు బ్రేక్ఫాస్ట్ కోసం వదిలే వాళ్ళు. తరవాత  0100  గం. వరకు క్లాసులు ఉండేవి. క్లాసులో చట్టాలు, పోలీసు మాన్యువల్ భోదించేవారు. 

             లంచ్ తరవాత మళ్ళీ 0230  గం. నుండి డ్రిల్ ఉండేది. ఈ టైములో పరుగెత్తటం మాత్రం బాగా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే లంచ్ చేసాక పొద్దున్న అలసిన శరీరం కొద్దిగా రెస్టు తీస్కోగానే వెంటనే పరుగెత్తటం భలే కష్టంగా ఉండేది. అది కొద్దిసేపే లెండి చమట పట్టటం మొదలు పెట్టగానే అన్నీ సర్డుకునేవి. ఆ విధంగా  0600 గం.వరకు డ్రిల్ చేపించి వదిలేసేవారు. రాత్రి  0900 గం.కు రోల్ కాల్ అనగా అటెన్డన్సు ఉండేది. ఈ విధంగా పొద్దున్న నుండి రాత్రి వరకు దినచర్య ఉంటుండేది. ఒక్కోరోజు ఒక్కో విభాగానికి మధ్యాహ్నం డ్రిల్ లేకుండా ఫాటిగ్ అని పరిసరాలు శుబ్రపరచటం అనగా మొక్కలు పీకటం, చెట్లు నరకటం మొదలైనవి ఉండేవి. ఆ రోజు డ్రిల్ లేకపోతే చాలా హ్యాపీగా ఉండేది. 

(డాక్టర్ వద్దకు వెళ్ళినపుడు మనం మన జబ్బు గురించి అన్ని వివరాలు చెప్పకుండా దాస్తే ఎలా మన జబ్బు నయం కాదో, అలాగే పోలీసుల వద్ద నిజాలు కాకుండా అబద్దాలు చెపితే కూడా సరైన న్యాయం పొందలేము)
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.

Friday 28 October 2011

ట్రైనింగ్ మొదలైంది.

నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసి అమ్మా,నాన్న మరియు బంధువులు సంతోషించారు. ట్రైనింగ్ కు వెళ్ళే ముందు అమ్మ నవ్వుతూ "నువ్వు చిన్నపటినుండి ఎవరి మాటా వినకుండా నీకు తోచిందే చేస్తావు. ఇపుడు పోలీసు డిపార్టుమెంటులో పై అధికారి చెప్పిందే తప్పకుండా చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు కానీ నీకు తెలిసిరాదులే" అన్నది. నేను నవ్వి, ఆ మాటను సరిగా పట్టించుకోలేదు. అమ్మ ఆ మాట ఎందుకు అన్నదంటే, నేను చిన్నప్పటి నుండి కూడా నన్ను ఎవరైనా ఇలాగే చేయమని వత్తిడి చేస్తే అస్సలు నచ్చదు, దానికి విరుద్ధంగా చేసేవాడిని. నేను ఇంటర్లో హాస్టల్ లో ఉన్నపుడు ఒకసారి రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళినందుకు , మా ప్రిన్సిపాల్ కొడితే "నీకు మమ్మల్ని కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు" అని ఎదిరించాను. నా కోపానికి ఆయన బిత్తరపోయి మమ్మల్ని వదిలేసాడు నన్ను ఒక జులాయి అనుకున్నాడు. కానీ ఇంటర్ రిజల్ట్స్ లో నేను కాలేజ్ ఫస్టు వచ్చి TC తీస్కోటానికి వెళ్ళినపుడు నన్ను చూసి  "వీడా మన కాలేజ్ ఫస్టు వచ్చింది" అని ఆశ్చర్యపోయాడు. 

           సరే ట్రైనింగ్ కు వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆ రోజు మా జిల్లాలో సెలెక్ట్ అయిన అందరినీ ఒక RTC బస్సులో హైదరాబాదులోని ట్రైనింగ్ సెంటర్ కు తీస్కుని వెళ్ళారు. అక్కడ మొత్తం 10 జిల్లాల నుండి వచ్చిన ట్రైనీస్ అందరూ ఉన్నారు. మొత్తం సుమారు 550 మంది  వరకు ఉన్నాము, అందరికీ సరిపోను బిల్డింగ్స్ అక్కడ లేవు. అందుకని సగం మందికి టెంటులు వేసి, ఒక్కో టెంటులో ఇద్దరికి బెడ్స్ వేసారు. లక్కీగా నాకు రూములోనే విడిది దొరికింది. ఎందుకంటే చలి కాలంలో టెంటులో ఉండాలంటే ఛాలా కష్టం. మాకు ట్రైనింగ్ సెంటర్ కు పోయిన తెల్లవారే పోలీసు కటింగ్ చేయించారు, దాంతో బయటికి వెళ్ళాలంటే కొద్ది రోజులవరకు సిగ్గుగా అనిపించేది. ట్రైనింగ్ కు వెళ్ళిన తెల్లవారే చెప్పిన రూల్సు, పాటించాల్సిన టైమింగ్ గురించి విన్నాక ఒక్కసారి భయం మొదలైంది. మొత్తం వచ్చిన అన్ని జిల్లాల వాళ్ళందరినీ కలిపి ఒక్కో విభాగానికి 30 మంది చొప్పున సౌలభ్యం కోసం ఏర్పాటు చేసారు. 

            మా విభాగానికి ఒక ముస్లిం హెడ్ కానిస్టేబుల్ ను ట్రైనర్ గా నియమించారు. ఆయన ఛాలా స్ట్రిక్ట్ మరియు మంచివాడు. రోజూ క్రమం తప్పకుండా నమాజ్ చదివే మనిషి. కొద్దిరోజులకే ఆయన మాలో అందర్నీ తనకు అనుకూలంగా మలుచుకొని, మొత్తం అందర్నీ కంట్రోల్ లోకి తీస్కుని వచ్చాడు. ఎందుకంటే అప్పటి వరకు మేము సాధారణ జీవితంలో ఉండి ఒకేసారి డిసిప్లిన్ జీవితంకు మారటం చాలా కష్టం. మొత్తం ట్రైనింగ్ లోనే మా ట్రైనర్ అంటే అందరికీ గౌరవం, భయం కూడా. ట్రైనింగ్ లో మాకు అపుడు Rs 1500 /- భత్యం ఇచ్చేవారు. భోజనం, ధోబి, మంగలి వాళ్లకి పోను ఏమీ మిగిలేవి కావు. భోజనం కూడా ఏమంత బాగా ఉండేది కాదు. కొద్దిరోజులకే మా 30 మందిలో అందరం బాగా కలిసి పోయాం. మా విభాగంలో ఒక ముసలాయన ఉండేవాడు. అతనితో పాటు మరో 10 మంది ఎపుడో సెలెక్ట్ అయితే కొద్దిరోజుల తర్వాత ఏదో కారణం చేత వాళ్ళని తీసేశారు. దాంతో వాళ్ళు కోర్టులో సం.ల తరబడి పోరాడి రిటైర్మెంట్ కు 5 లేదా 6 సం.ల ముందు కోర్టు ఆదేశాలతో ట్రైనింగ్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చామన్న మాటేగానీ మమ్మల్ని బయటికి వదిలేవారు కాదు. ట్రైనింగ్ సెంటర్ పరిసరాలు బాగానే ఉన్నా మేము బందీ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుండేది. 
(పోలీసు వ్యవస్థ మహోన్నతమైనది, సమాజంలో ఉన్నట్టే కొందరు చెడ్డవాళ్ళు ఈ వ్యవస్థలో ఉండొచ్చు. వాళ్ళు చేసే తప్పులకు మొత్తం వ్యవస్థను నిందించకండి.)

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.

Thursday 27 October 2011

వ్రాత పరీక్షకు ట్రైనింగ్ కు మద్య ఏం జరిగిందంటే?

దేహధారుడ్య పరీక్షలు అయ్యాక వ్రాత పరీక్షకు నెల రోజులు సమయం ఇచ్చారు. అప్పటికి నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కాలేదు. నేను చిన్నపటినుండి లెక్కల్లో వీక్, అందుకని ఎక్కువగా మెంటల్ అబిలిటి, రీజనింగ్, కోడింగ్ -డీకోడింగ్ మీద బాగా శ్రద్ధ పెట్టి బాగా సిద్దం అయ్యాను. పరీక్ష రోజున ఓపికగా, శ్రద్ధతో బిట్స్ సాల్వ్ చేసి సెలెక్ట్ అవుతాననే నమ్మకంతో బయటికి వచ్చాను. తర్వాత నేను దాని గురించి మర్చిపోయి డిగ్రీ చదువు మీద దృష్టి పెట్టాను. కానీ ఈలోపు ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఇంకా పెరిగాయి. దాంతో నాకు రూము రెంటు కట్టటం కూడా కష్టమైపోయింది. నేను నా ఫ్రెండ్ కు విషయం చెప్పి మరో ఫ్రెండ్ ను కలుపుకొని ఇంకా రెంటు తక్కువ ఉన్న రూముకు కాలేజీకి దూరమైనా మారినాము. 

         మేము రూము మారిన రోజే నాకు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చిన విషయం తెలిసింది. వెంటనే నేను పోలీసు హెడ్ క్వార్టర్ కు వెళ్లి రిజల్ట్ బోర్డు మీద నా నంబర్ కోసం వెతికాను. నా నంబర్ కనిపించింది, కానీ నమ్మకం కుదరక పక్కకు వెళ్ళి 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటనే రూముకు వెళ్ళి ఫ్రెండ్స్ కు స్వీట్ ఇచ్చి, వాళ్ళకు రూము ఖాళీ చేస్తానని షాకింగ్ న్యూస్ చెప్పాను. ఎలాగూ మరో నెలలో డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఉండమని వాళ్ళు అన్నారు, కానీ ఇంట్లో పరిస్తితి వల్ల ఉండలేనని చెప్పాను. రూము రెంటు వాళ్ళు కడతామని చెప్పినా వాళ్ళను ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక మరో ఫ్రెండ్ ను వాళ్ళ రూములో జాయిన్ చేసి నేను ఇంటికి వెళ్ళాను. 

                 ఇంటి దగ్గరే ఉంటూ ఉద్యోగం వచ్చిన ఆనందంలో డిగ్రీ ఎగ్జామ్స్ కు సరిగా చదవక నా స్టూడెంట్ లైఫ్ లో  ఫస్ట్ టైము టెన్షన్ తో ఎక్షామ్ కు వెళ్ళాను. అయితే అతిశయోక్తి  అనుకోనంటే నా గురించి చిన్న విషయం -నేను చిన్నప్పటి నుండి క్లాసులో ఎ-గ్రేడు స్టుడెంటునే మరియు క్లాసులో వినటం, మళ్ళీ ఎక్షామ్ ముందు చదవటం తప్ప మిగతా రోజులంతా ఫుల్ ఎంజాయ్ చేసేవాడ్ని. అందువల్ల నేను సరిగా చదవకపోయినా పాస్ అయ్యే విధంగానే ఎగ్జామ్స్ వ్రాసినాను. కానీ ఒక పేపర్ మాత్రం పాస్ కానేమో అని కొంచెం డవుట్ గానే ఉండేది. డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందే నేను ట్రైనింగ్ కు వెళ్ళాను.

(నేను నా గురించి కొన్ని వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నన్ను నా పోలీసు అనే ఇమేజ్ ను వదిలేసి ముందు నన్ను ఒక వ్యక్తిగా, నా మనసును అర్థం చేస్కుంటే నేను చెప్పే విషయాలు మీరు నా కోణంలోంచి చూస్తారని).

----- ట్రైనింగ్ వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 

                                                                                      --కృతజ్ఞతలతో.

Wednesday 26 October 2011

సెలక్షన్ లో నా అనుభవాలు!


అప్లికేషను ఇచ్చాక, ఒకరోజు 5 కి.మీ. పరుగు పందెం ఉంటుందని ఆ రోజు పొద్దున్నే స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు రమ్మని చెప్పారు. పోలీసు సెలక్షన్లలో 5 కి.మీ. పరుగు పందెంను 25 ని.లలో పూర్తి చేయాలనే నిభందన ఆ సం.నుండే ప్రవేశపెట్టారు. నేను చిన్నప్పటినుండి క్లాస్ మరియు లైబ్రరీ తప్ప గ్రౌండ్ కి దూరంగా ఉండేవాడ్ని. కాకపోతే చిన్నప్పటి నుండి కష్టం తెలిసిన శరీరం కాబట్టి బాగా యాక్టివ్ గానే ఉండేవాడ్ని. అయినా 5 కి.మీ.ను, 25 ని.లలో పరుగెత్తాలంటే భయంగా అనిపించింది. అందుకే పొద్దున్నే లేచి మా కాలేజీ గ్రౌండ్లో ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసాను. దాదాపుగా 25 ని.లలో పూర్తి చేసే స్థాయికి వచ్చాను. నాకు రన్నింగ్ మీద కనీస అవగాహన కూడా లేదు, ఎందుకంటే టెస్టు రోజు అందరూ స్పోర్ట్స్ షూ వేస్కుని వస్తే నేను మా బందువు ఒకాయనవి మామూలు రోజూ వేస్కునే షూ వేస్కుని వెళ్లాను. పరుగు మొదలు పెట్టాక కానీ వాటి విషయం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అవి నేలకు తగిలినప్పుడల్లా పెద్ద శబ్దం చేస్తుండడం కాక, నా మోకాలిపై తీవ్ర వత్తిడి మొదలైంది. పొద్దున్న రమ్మని చెపితే ఏమీ తినకుండా వెళ్ళాను, బాగా ఎండపడిన తర్వాత టెస్టు పెట్టారు. 

             సగం పరుగు పూర్తి అయ్యేసరికి నేను ఆయాసం ఆపుకోలేకపోయి, ఆగిపోదామని అనుకున్నాను. కానీ ఎలాగైనా సెలెక్ట్ కావాలనే నా ఆశయం, అపుడు ఇంట్లో పరిస్థితులు నన్ను లక్ష్యం వైపు నడిపించాయి. మొత్తానికి ఎలాగోలా టైంలోపలే చేరుకున్నాను. 5 కి.మీ. పరుగు పందెంను 25 ని.లలో పూర్తి చేయటానికి అంత కష్టపడిన నేను, తర్వాత ట్రైనింగ్ లో 10 కి.మీ. పరుగు పందెంను 37 ని.ల 53 సెకన్లలో (మా ట్రైనింగ్ లో నాదే బెస్ట్ టైమింగ్) పూర్తి చేయగలగటం కొసమెరుపు. పరుగుపందెం అయిపోయేసరికి నేను పూర్తి నిస్సత్తువగా అయిపోయాను. ఎందుకంటే ఆహారం, షూ  మొదలైన  విషయాలలో కనీస జాగ్రత్తలు పాటించకపోవటం. తర్వాత 100 మీ, 800 మీ, లాంగ్ జంప్, షాట్ పుట్, హై జంప్ లలో మంచి మెరిట్ సాధించి, వ్రాతపరీక్షకు సెలెక్ట్ అయ్యాను.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. (సమయాబావం వల్ల ఎక్కువగా, సవివరంగా వ్రాయలేకపోతున్నాను, ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చెప్పినచో సరిచేసుకోగలను.)
                                                                                      --కృతజ్ఞతలతో.

Tuesday 25 October 2011

నేనెలా డిపార్టుమెంటులోకి వచ్చానంటే?

నేను మొదట డిపార్టుమెంటులో కానిస్టేబుల్ గా చేరి మరుసటి సం. SI గా సెలెక్ట్ అయినాను. అసలు నేను డిపార్టుమెంటులోకి ఎలా వచ్చానో చెబుతాను. అవి నేను డిగ్రీ చివరి సం. చదువుతున్న రోజులు. మేము కావటానికి సమాజంలో ఉన్నత కులంగా చెప్పబడే కులానికి చెంది ఉన్నా, ఆర్థికంగా పేదవారిమే. నేను, నా ఫ్రెండ్ రూములో ఉంటూ చదువుకునేవారం. అపుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో నాకు రూము రెంటు కట్టాలన్నా నాన్నకు కష్టంగా ఉండేది. అదే సమయంలో నేను అద్దెకు ఉండే మా ఇంటి ఓనరు, తన కొడుక్కి కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లికేషను తీస్కుని వచ్చాడు. కానీ ఆ అబ్బాయి ఎత్తు సరిపోను లేనందున ఆ అప్లికేషను మాకు ఇచ్చాడు. నా ఫ్రెండ్ కూడా ఎత్తు సరిగా లేనందున అతను వద్దనడంతో నేను అప్లై చేసినాను. ఆ విధంగా నాకు కానిస్టేబుల్ ఉద్యోగాలు పడిన విషయం తెలీకుండానే అప్లికేషను నా చేతికి వచ్చి అప్లై చేసినాను. అంతా విధి లిఖితం అంటే ఇదేనేమో. ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యేవరకు పోలీసు డిపార్టుమెంటు అంటే నాకు ఏ మాత్రం అవగాహన లేదు. 

              అప్లికేషను తీస్కుని  బెరుకుగా పోలీసు హెడ్  క్వార్టర్ కు వెళ్లాను. అప్లికేషను ఇచ్చేటపుడు అక్కడ తీస్కునే ఆయన "నువ్వు APSP  కానిస్టేబుల్ కు వెళ్తావా? సివిల్ కానిస్టేబుల్ కు వెళ్తావా" అని అడిగారు? నాకు రెంటికి ఉన్న తేడా తెలీక ఆయన ఏమి అడిగాడో అర్థం కాలేదు. అపుడు ఆయనే "స్టేషన్ డ్యూటీ చేసే ఉద్యోగం కావాలా? అడవుల్లో తిరిగే ఉద్యోగం కావాలా?" అని విసుక్కుంటూ మోటుగా అడిగాడు. అపుడు అసలే నక్సల్స్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది. అందుకని సివిల్ ఉద్యోగమే కావాలని చెప్పాను. కానీ నేను డిపార్టుమెంటు లోకి వచ్చాక సుమారు 8 సం.లు కూంబింగ్ డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ క్షణం నేను ఊహించలేదు అనుకోండి. ఆ విధంగా పోలీసు డిపార్టుమెంటు అంటే ఏమీ తెలీకుండానే నేను కానిస్టేబుల్ సెలక్షన్ కు వెళ్లాను.

-----సెలక్షన్లో నా అనుభవాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 24 October 2011

నా గురించి కొంచెం చెప్పుకోవాలిగా?

పోలీసు అమరవీరులకు జోహార్లు.
నేను డిగ్రీ పూర్తి అయ్యి అవ్వకముందే పోలీసు డిపార్టుమెంటు గురించి ఏమీ తెలియకుండానే కేవలం ఉద్యోగం కోసమే ఈ డిపార్టుమెంటులో జాయిన్ అయినాను. నా దృష్టిలో ఎవరైనా సమాజానికి సేవ చేద్దామని పోలీసు ఉద్యోగం ఎంచుకున్నాను అని అంటే అది వాళ్ళను మరియు వినేవాల్లను మోసం చేస్తున్నట్టే. 1 శాతం మంది అలా ఉన్నా చాలా గొప్పే. తెలిసి తెలిసి ఎవడైనా ముళ్ళ బాటలో పయనించాలి అనుకుంటాడా? కాబట్టి బ్రతకటానికి ఇదీ ఒక ఉద్యోగం అంతే. అయితే ఉద్యోగాన్ని నిబద్దతతో, వృత్తిని సీరియస్గా తీస్కుని పని చేసే వాళ్ళు పోలీసు డిపార్టుమెంటులో కానిస్టేబులు  స్తాయి నుండి పెద్ద అధికారుల వరకు చాలామందే ఉన్నారు. నా దృష్టిలో దేశాన్ని కాపాడే జవాను ముందు అందరికన్నా గౌరవించదగ్గవాడు. తరవాత ఆ స్తానం పోలీసుదే అని నా అభిప్రాయం.

                   నేను పోలీసు వ్యవస్థలో ఉన్నందుకు గర్విస్తున్నాను. మంచి చెడు ఎక్కడైనా ఉంటాయి. పోలీసు వ్యవస్థ అందుకు మినహాయింపు కాదు, కానీ యూనిఫారం ఉద్యోగం కనుక చిన్న తప్పు కూడా అందరికి తెలిసిపోతుంది. కాబట్టి పోలీసు వ్యవస్థలోని చెడును కాకుండా మంచిని చూడటానికి ప్రయత్నం చేయండి. నా డిపార్టుమెంటును నేను పొగుడుకోవటం లేదు, దేశభద్రతకు జవాను త్యాగంలానే, అంతర్గత భద్రతకు పోలీసు త్యాగం కూడా అంతే విలువైనది. త్వరలోనే పూర్తిస్తాయిలో పోస్ట్ చేస్తాను, మరియు కొంచెం పని వత్తిడిలో ఉన్నందున సరిగా వ్రాయలేదు.
                                                                       
                                                                                --కృతజ్ఞతలతో.

Saturday 22 October 2011

ఇది ఒక పోలీసు అధికారి బ్లాగు

పోలిస్

అందరికి నమస్కారం,

నేను పోలీసు ఉద్యోగిగా గత పది సంవత్సరాలుగా పని చేయుచున్నాను. నాకు ఈ కాలంలో ఎదురైన అనుభవాలు, నాయొక్క భావాలు నలుగురితో పంచుకుందామని నేను ఈ బ్లాగును ప్రారంభిస్తున్నాను. త్వరలోనే ఈ బ్లాగు ద్వారా పూర్తిస్తాయిలో మీకు కలుస్తాను.

                                                  --కృతజ్ఞతలతో.