Monday 26 December 2011

మొదటిసారి కూంబింగ్ కు వెళ్ళే ముందు

చూడటానికి ఠీవీగా ఉందా...
మాకు జిల్లా కేంద్రంలో "మావోయిస్ట్ వ్యతిరేఖ" యుద్ధతంత్రాలపై శిక్షణ అయిపోయిన తర్వాత మమ్మల్నందర్నీ మా జిల్లాలో "మావోయిస్ట్" కార్యకలాపాలపై బలగాలను అజమాయిషీ చేసే పోలీసు అధికారి (officer on special duty-OSD అంటార్లెండి) ఉండే మరో పట్టణానికి తీసుకు వెళ్ళారు. అక్కడ మా శిక్షణార్థులందర్నీ వివిధ జట్లుగా చేసారు. కొన్ని జట్లను హైదరాబాద్ నుండి రప్పించబడిన "గ్రే హౌండ్స్" బలగాలతో, మరి కొన్నింటిని జిల్లాలో అప్పటికే మావోయిస్ట్ వ్యతిరేఖ కార్యకలాపాలలో పని చేస్తున్న "స్పెషల్ పార్టీలు" అనబడే బలగాలతో పాటు జత చేసారు. అంటే మమ్మల్ని మొదటిసారి కూంబింగ్ నిమిత్తం అడవిలోకి పంపుతున్నందున ఆ బలగాలు మాకు రక్షణ కోసం తోడుగా ఉంటాయన్నమాట. 

          అయితే మాకు "గ్రే హౌండ్స్" తో వెళ్ళే జట్లకు ఎక్కువ మరియు కఠినమైన కూంబింగ్ ప్రదేశం ఉంటుందనీ, అంతే కాక వాళ్ళు అడవిలో కూంబింగ్ చేసేటపుడు పోలీసు బలగాలు పాటించాల్సిన నియమ నిభందనల్ని ఏ మాత్రం రాజీపడకుండా పాటిస్తారనీ, అదే జిల్లా స్పెషల్ పార్టీలతో వెళితే కూంబింగ్ సులువుగా ఉంటుందనీ తెలిసింది. అంటే ఉదాహరణకి మాకు కూంబింగ్ లో ఏదైనా కొండ మీదుగా వెళ్ళాల్సి ఉంటే గ్రే హౌండ్స్ బలగాలు అయితే అది ఎంత పెద్ద కొండ అయినా దాన్ని ఎక్కి వెళతాయి, అంతే కాక కూంబింగ్ లో భాగంగా ఇచ్చిన మొత్తం ప్రదేశాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసుకొని కానీ తిరిగిరావు. అదే జిల్లా స్పెషల్ పార్టీలు అయితే కొండ మరీ పెద్దదిగా ఉంటే దాన్ని ఎక్కకుండా చుట్టూ తిరిగి వెళ్ళటమో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా డుమ్మా కొట్టటమో చేస్తాయి. అందుకని మేము మాకు జిల్లా స్పెషల్ పార్టీలతో కూంబింగ్ కు పంపితే బాగు అని కోరుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు (twist అంటారా?) లేకపోలేదు. అదేమిటంటే ఒక వేళ కూంబింగ్ లో మావోయిస్ట్ లు ఎదురుపడి పరస్పర ఎదురు కాల్పులు జరిగినా లేదా వాళ్ళు పథకం ప్రకారం ముందుగా దాడి చేసినా, జిల్లా స్పెషల్ పార్టీ బలగాలతో వెళ్ళేటప్పటి కన్నా, గ్రే హౌండ్స్ బలగాలతో వెళితే మా భద్రతకు ఎక్కువ అవాకాశాలు ఉంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

                  అదృష్టమో, దురదృష్టమో కానీ నేను ఉన్న జట్టుకు మాత్రం గ్రేహౌండ్స్ బలగాలతో వెళ్ళే అవకాశం వచ్చింది. మొత్తం మూడు రాత్రులు, రెండు పగళ్ళు అడవిలో గడుపుతూ మాకు ఇచ్చిన కూంబింగ్ ప్రదేశాన్ని మావోయిస్ట్ ల కోసం వెదికి రావాలని చెప్పారు. మాకు మొదటిసారి కూంబింగ్ కు వెళ్ళటం కాబట్టి, ఏమేమి తెసుకు వెళ్ళాలో కూడా పూర్తిగా తెలీదు. మాకు అన్ని వస్తువులు తీసుకు వెళ్ళటానికి ఒక బ్యాగును ఇచ్చారు. తినటానికి ఏమేం తీసుకు వెళ్ళాలో మాకు తెలీదు కాబట్టి రెండు మూడు రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలు మా అధికారులే ఇచ్చారు. కూంబింగ్ కు వెళ్ళే మూడు రోజులూ స్నానం చేయటమనేది మరిచిపోవాలని, ఎవరైనా కూంబింగ్ నియమావళిని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీస్కుంటామని ఆర్.ఐ. గారు తీవ్రంగా హెచ్చరించారు. అపుడు దాదాపు ఎండాకాలం అయిపోయి, వర్షాకాలం మొదలవటంతో వర్షానికి తడవకుండా ఉండేలా రక్షణ ఏర్పాట్లు కూడా అదనంగా తీసుకెళ్ళాల్సి వచ్చింది. అంతే కాక ప్రతి ఒక్కరు కనీసం 5 లీటర్లు నీరు కూడా తీసుకెళ్ళాలి. మొత్తానికి బ్యాగు బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఏమి తగ్గిద్దామన్నా అన్నీ అవసరమే కదా అని అలాగే ఉంచుకొన్నాము. సరే మొత్తానికి అడవిలోకి మొదటిసారి వెళుతున్నాము కాబట్టి చివరిగా ఓ.యస్.డి. గారు, ఆర్.ఐ. గారు అన్ని రకాల జాగ్రతలు చెప్పి మమ్మల్ని కూంబింగ్ కు పంపించేందుకు సమాయత్తం చేసారు. ఇక మేము అడవిలోకి బయలుదేరటమే తరువాయి మరి... 

(కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా ఉంటుందండీ పోలీసు ఉద్యోగం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Thursday 22 December 2011

నా గెలుపు గాలివాటం కాదని అందరికీ రూడీ ఎలా అయిందంటే!

ఆయుధాలు ఎంత అందంగా ఉన్నాయో కదా, చూడటానికి...
మొత్తానికి జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారి ట్రైనింగ్ కు మేము క్రమంగా అలవాటు పడ్డాము. కానీ మాకు మాత్రం అబస్టకల్స్ ట్రైనింగ్ (అడ్డంకులను అధిగమించటం) అంటే కొద్దిగా భయంగానే ఉండేది. మాకు హైదరాబాద్ ట్రైనింగ్ లో ఉన్న అడ్డంకులన్నీ చాలా చిన్నగా ఉండటమే గాక,  క్రింద పడ్డా దెబ్బలు తగలకుండా క్రింద ఇసుక ఉండేది.  కానీ జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారు ఏర్పాటు చేసిన అడ్డంకులు చాలా భీతిగొలిపేవిగా ఉండేవి. ఎందుకంటే అవి మా జిల్లా పోలీసు ప్రధాన కేంద్రానికి పక్కనే ఉన్న గుట్టల్లో బండ రాళ్ళ మధ్య ఏర్పాటు చేసారు. తాళ్ళపై వేలాడేటపుడు గానీ, ఒక అడ్డంకి నుండి మరో అడ్దంకి చేరేటపుడు గానీ ఏమాత్రం చేతులు లేదా కాళ్ళు పట్టు తప్పినా ఆ రాళ్ళ మీద పడితే తీవ్రమైన దెబ్బలు తగలటం ఖాయం. ఈ ట్రైనింగ్ మొదలైన కొత్తలోనే కొంతమంది క్రింద పడి దెబ్బలు తగిలించుకోవటం, అయినా ఆర్.ఐ. గారు కనికరించకుండా వారికి యధావిధిగా ట్రైనింగ్ చేపించటంతో మాకు ఈ ట్రైనింగ్ అంటే భయం ఏర్పడింది. అయితే మాకు ఈ ట్రైనింగ్ లో హైదరాబాద్ ట్రైనింగ్ లో నేర్పిన ఆయుధాల కంటే అధునాతన ఆయుధాలలో పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చారు. కానీ మాకు జిల్లా కేంద్రంలో కవాతు శిక్షణ అనేది ఏ మాత్రం లేకుండా పూర్తిగా "మావోయిస్ట్ వ్యతిరేఖ" శక్తియుక్తులపై మాత్రమే శిక్షణ ఇచ్చారు.

                 ఆర్.ఐ. గారు గ్రే హాండ్స్ లో పని చేసినందు వల్ల, దాదాపు ఆ ట్రైనింగ్ లో ఉన్న విధివిధానాలనే మాకు జిల్లాకేంద్రంలో అమలు చేయటంతో మాకు ఇన్ని కస్టాలు వచ్చి పడ్డాయి. మేము హైదరాబాద్ లో మాతో పాటు ట్రైనింగ్ చేసిన ఇతర జిల్లాలకు చెందిన ట్రైనీలను వాకబు చేయగా, వాళ్ళందరూ పోలీసు స్టేషన్ లలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిసి మాకు ఇంకా బాధ కలిగింది.  సరే మొత్తానికి క్రిందా, మీదా పడి జిల్లా కేంద్రంలో రెండు నెలల పాటు ఆర్.ఐ. గారి  శిక్షణ పూర్తి చేసుకున్నాము. ఈ శిక్షణ మొత్తం రెండు నెలల కాలంలో నేను మా జిల్లాకేంద్రం కు 15 కి.మీ. లోపే ఉన్న మా ఊరికి నాలుగైదు సార్లు మించి వెళ్లలేదంటే ఎంత తీరికలేని శిక్షణ ఆర్.ఐ. గారు మాకు ఇచ్చారో ఊహించుకోవచ్చేమో...

                  సరే జిల్లా కేంద్రంలో శిక్షణ అయిపోవచ్చింది. దాంతో మాకు ఆ రెండు నెలల్లో ఆర్.ఐ. గారు నేర్పించిన "మావోయిస్ట్ వ్యతిరేఖ" శిక్షణ పై ఒక వ్రాత పరీక్ష పెట్టారు. అందరికీ ఏమో కానీ నాకు మాత్రం వ్రాత పరీక్ష అంటే కొంత ఆందోళన గానే ఉంది. ఎందుకంటే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఫస్టు వచ్చా కాబట్టి ఇపుడు వేరెవరైనా ఈ వ్రాత పరీక్షలో ఫస్టు వస్తే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఏదో గాలివాటంగా ఫస్టు వచ్చానని అంతా అనుకుంటారు కదా!. అందుకే ఎలాగైనా నేను ఫస్టు రావాలనే ఉద్దేశ్యంతో బాగా కష్టపడి చదివాను. నా కష్టానికి తగ్గట్టుగా ఆ వ్రాత పరీక్షలో కూడా నేను ఫస్టు రావటంతో నా మీద ఎవరికైనా కొద్దో గొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ "ముందుంది ముసళ్ళ పండగ" అనేది మాకెవరికీ అపుడు తెలీదు... 

(పోలీసులకు కూడా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయి, కాకపోతే వాటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదం.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 19 December 2011

నిన్న నేనెలా పొరబడ్డానంటే!

అవసరం -కానీ అనర్థం, కాదంటారా?...
నేను పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి నా అనుభవాలను ఒక వరుసక్రమంలో చెపుతూ పోతున్నాను. అయితే ప్రస్తుత నా రోజు వారీ ఉద్యోగంలో భాగంగా నాకు ఎదురయ్యే అనుభవాలు నేను అదే క్రమంలో చెప్పేసరికి కొన్నింటిని నేను మరిచిపోవచ్చు. కాబట్టి మధ్య, మధ్యలో ఆ అనుభవాలు కూడా చెపితే బావుంటుందేమో అని అనిపించి నాకు రెండు రోజుల క్రితం కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. 
  
                 మొన్నటి రోజు పొద్దున్న సుమారు 10 గంటల సమయంలో నేను నా జీపులో దగ్గరలో ఉన్న మా DSP కార్యాలయానికి వెళుతున్నాను. అపుడు నా ముందు ఒక మోటర్ సైకిల్ పై, వెనుక ఒక యూనిఫారంలో ఉన్న వ్యక్తి కూర్చొని ఉండగా, ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు(triple riding) కనిపించింది. ఆ యూనిఫారంలో ఉన్నది ఏ డిపార్టుమెంట్ ఉద్యోగో తెలియదు, కానీ మామూలుగానే మోటర్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకూడదు. మరి ఆ విధంగా యూనిఫారంలో ఉండి ముగ్గురు ప్రయాణిస్తుంటే, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ప్రజల్లో చెడ్డ పేరు కదా. అందుకని నేను ఆ మోటర్ సైకిల్ ని క్రాస్ చేయమని మా డ్రైవర్ కు చెప్పినాను.

                 నేను ఆ మోటర్ సైకిల్ క్రాస్ చేసి వారిని ఆగమని చెప్పాను. తీరా చూస్తే ముందు మోటర్ సైకిల్ నడుపుతున్నది కూడా ఒక కానిస్టేబులే. మధ్యలో మాత్రం ఒక ప్రైవేటు వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాళ్ళు మా పక్క స్టేషన్ సిబ్బందిగా గుర్తించాను, వాళ్ళు కూడా నన్ను గుర్తు పట్టి నమస్కరించారు. నేను కోపంతో "ఏమయ్యా, ఎంత అవసరం ఉంటే మాత్రం మోటర్ సైకిల్ పై ముగ్గురు, అదీ యునిఫారంలో ఉండి ప్రయాణిస్తారా?", ప్రజలు మన గురించి ఏమనుకుంటారు?, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ఎంత చెడ్డ పేరు" అంటూ కొంచెం ఘాటుగానే వారిని మందలించాను. దానికి వారు చెప్పిన సమాధానం నన్ను కన్విన్సు చేయగలిగినా, బయటనుండి చూసే వాళ్ళు మాత్రం చెడుగానే అనుకుంటారు.

                  ఇంతకూ విషయమేమిటంటే, " ఆ కానిస్టేబుళ్లు పని చేసే స్టేషన్ కు సంబంధించిన ఒక 'హత్య కేసు ముద్దాయి' ఉప-కారాగారంలో రిమాండులో ఉన్నాడు. ఆ కేసులో వాయిదా ఆ రోజు ఉన్నందున ఆ ముద్దాయిని కోర్టులో హాజరుపరచాలి. కోర్టేమో పట్టణంలో ఉండి, ఉప-కారాగారమేమో పట్టణానికి దాదాపు రెండు కి.మీ. దూరంలో ఉంది. అంత తక్కువ దూరానికి సాధారణంగా స్టేషన్లో "వారంటు" (పోలీసులకు RTC బస్సులో చార్జీ లేకుండా ఉపయోగించే ప్రభుత్వ పాస్ లాంటిది) ఇవ్వరు. నడిపించుకు రావటానికి మరీ దగ్గర కూడా కాదు, పైగా 'హత్య కేసు ముద్దాయి' కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటో లేదా బస్సులో ఆ కానిస్టేబుళ్లు తమ స్వంత డబ్బులతో తీసుకు రాలేరు. దానికి గాను ఆ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరి మోటర్ సైకిల్ పై మధ్యలో, ఆ 'హత్య కేసు ముద్దాయి' ని కూర్చోబెట్టుకొని ఉప-కారాగారం నుండి కోర్టుకు తీస్కుని వెళుతున్నారు. ఎంత అవసరం ఉన్నా, చట్టాన్ని అమలు చేసే పోలీసులు మాత్రం దానిని అతిక్రమించటం తప్పే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వేరే డిపార్టుమెంటులో ఉన్నా, వాళ్ళు తప్పు చేసినా ఎవరికీ కనిపించదు. కానీ మాది యునిఫారం ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

                అయితే చట్టాన్ని అమలు చేసేటపుడు మరీ మూర్ఖంగా వాస్తవాల్ని విస్మరించి ప్రవర్తించకూడదని నా అభిప్రాయం. ఉదాహరణకి "నేను ఒక రోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక మోటర్ సైకిల్ పై ముగ్గురు మగ వ్యక్తులు ప్రయాణిస్తూ వస్తుంటే మా సిబ్బంది ఆపి నా దగ్గరకు తీసుకు వచ్చారు.  మధ్యలో ఉన్న వ్యక్తికి అనారోగ్యంగా ఉంటే, సమయానికి ఆటో లేదా బస్సు అందుబాటులో లేక వారు అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని ముగ్గురు మోటర్ సైకిల్ పై వైద్యాలయానికి వస్తున్నామని చెప్పారు. నేను పరిశీలించి వారు చెప్పినట్టుగా ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తికి అనారోగ్యం అని నిర్ధారించుకున్నాక వెంటనే పంపించేసాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా మరీ గుడ్డిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు ఇబ్బందులు పడటమే కాక, పోలీసులకు మానవత్వం లేదని అనుకుంటారని నా అభిప్రాయం. 

(మాట కరకుగా ఉన్నంత మాత్రాన ప్రతి పోలీసు మానవత్వం లేకుండా ఏమీ ఉండడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Friday 16 December 2011

డిపార్టుమెంటులో నేను చూసిన మొదటి కరడుగట్టిన పోలీసు అధికారి

ఈ సోదరులు మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారే...
మేము హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ హోదాల్లోని చాలా మంది పోలీసు అధికారులను చూసినా, ట్రైనీలు ఏదైనా తప్పు చేసినపుడు మాపట్ల వారు మరీ ఎక్కువ కరకుగా ఉండేవారు కాదు. ఎందుకంటే మేము డిపార్టుమెంటుకు, క్రమశిక్షణా వాతావరణానికి కొత్త అనే ఉద్దేశ్యంతో మమ్మల్ని విద్యార్థులుగానే పరిగణించేవారు. అయితే మేము జిల్లా ట్రైనింగులో చూసిన ఆర్.ఐ. గారి లాంటి అధికారిని మాత్రం అంతవరకూ మేము చూడలేదు. ఆయన ముఖంలో మేము నవ్వు చూసిన సందర్భాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆయన ఎపుడూ సీరియస్ గా ఉండేవాడు. ఆయనని చూస్తే దాదాపు జిల్లాకేంద్రంలో ప్రతి ఒక్కరికీ భయం మరియు ఆయనతో మాట్లాడాలంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే సిబ్బంది కూడా జంకేవారంటే అతిశయోక్తి కాదు. ఆయన "మావోయిస్ట్"  లను ఎదుర్కొనే శిక్షణలో ఆరితేరి ఉండటం వల్లో ఏమో కానీ ఆయన మాటతీరు, ప్రవర్తన చాలా కటినంగాను మరియు కరకుగాను ఉండేవి. దాంతో మేమంతా ఆయనను "శాడిస్ట్" అని అనుకునేవాళ్ళం.

                 మాకు ట్రైనింగ్ సెంటర్లో 10 కి.మీ. మరియు 3.2 కి.మీ. పరుగు పందెం ఎపుడో నెలన్నరకో లేక రెండు నెలలకో ఒకసారి పెట్టేవారు. అంతే కాక మాకు ఖచ్చితంగా ఇంత టైములోపే పరుగెత్తాలనే నియమం ఉండేది కాదు. కానీ మాకు జిల్లాలో మొదలైన ట్రైనింగులో మాత్రం ఆర్.ఐ.గారు నిర్దేశించిన టైముకు ఏమాత్రం ఆలశ్యంగా పరుగెత్తినా చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్లకి మధ్యాహ్నం మంచి ఎండలో మళ్ళీ 10 కి.మీ. లేదా 3.2 కి.మీ. పరుగెట్టించేవారు. అప్పటివరకు మేము ట్రైనింగ్ సెంటర్లో తండ్రి చాటు బిడ్డల్లా, కోడిపెట్టకింది కోడిపిల్లల్లా ఆడుతూ, పాడుతూ ట్రైనింగ్ చేసిన మాకు, ఆర్.ఐ. గారి వద్ద అంతటి కఠినమైన శిక్షణకు మా శరీరాలు తొందరగా అలవాటు పడలేక పట్టలేనంత ఉక్రోషం ముంచుకొస్తుండేది. 

                  ఒక రోజు 10 కి.మీ. పరుగు పందెంలో మా ట్రైనీలలో కొంతమంది నిర్దేశించిన టైములోపల రాకపోవటంతో, ఆర్.ఐ. గారు వాళ్లకు మధ్యాహ్నం ఎండలో గ్రౌండ్లో పనిష్మెంట్ ఇవ్వమని ఒక హెడ్ కానిస్టేబుల్ (H.C-short form)   ను పురమాయించారు. ఆ H.C గారు వాళ్ళందర్నీ గ్రౌండ్లోకి తీస్కెళ్ళి  ఆర్.ఐ. గారు చెప్పిన విధంగా పనిష్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టారు. అపుడు మా ట్రైనీలలో ఒకతను ఆ పనిష్మెంట్ తట్టుకోలేక నేను చెయ్యనని మొండికేసి ఆ H.C గారికి ఎదురు తిరిగాడు. ఆ విషయం ఆ H.C గారు ఆర్.ఐ గారి దృష్టికి తీస్కేళ్ళడంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరవాత ఆ ట్రైనీకి ఆర్.ఐ. గారు దగ్గరుండి ఇచ్చిన పనిష్మెంట్ కి, అతని మోకాళ్ళు, మోచేతులు రక్తసిక్తం అయ్యాయి. ఆ ట్రైనీ దాదాపు రెండు రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ దెబ్బకి మా ట్రైనీలు జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారు శిక్షణ ఇచ్చిన రెండు నెలల్లో ఏనాడూ ట్రైనింగ్ ఇచ్చే సిబ్బంది ఎవరికీ ఎదురుతిరిగే సాహసం చేయలేదని వేరే చెప్పక్కర్లేదు కదండీ...

                  ఆయన మాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడా అని మాకు అర్థం కాకపోయేది. చివరికి ఒక రోజు S.P. గారు మా దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగినపుడు, ఒక ట్రైనీ ధైర్యం చేసి "ట్రైనింగ్ మరీ కష్టంగా ఉంది సార్" అని చెప్పాడు. దాంతో ఆయన నవ్వి  "మాకు  IPS ట్రైనింగ్ తర్వాత మేము గ్రే హాండ్స్ ట్రైనింగ్ కు వెళితే, ఈ ఆర్.ఐ. గారే అక్కడ మాకు శిక్షణ ఇచ్చారు. అపుడు ఈయన IPS లు కదా అని మమ్మల్నే కనికరించలేదు, ఇక మిమ్మల్ని వదులుతాడా?" అంటూనే, "ఇపుడు మీరు ఎంత కఠినమైన శిక్షణ తీస్కుంటే రేపు మీరు "మావోయిస్ట్" లను అంత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు" అని చెప్పడంతో ఇక మాకు ఆ ఆర్.ఐ. గారిని భరించక తప్పదని అర్థమైంది. అయితే S.P. గారు చెప్పిన విషయాలు నిజమేనని మేము గ్రహించటానికి ఎక్కువ రోజులేమీ పట్టలేదు.

Tuesday 13 December 2011

పెనంలోంచి పొయ్యిలోకి

చెప్పటం తేలికే, చెయ్యటమే మరి కష్టం!
"రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు" అయింది మా పరిస్థితి. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ నుండి జిల్లాకి వెళ్ళినా వారం రోజుల వరకు మాకు జిల్లాకేంద్రంలోనే ఉంచి ఇంటికి కూడా పంపలేదు. మా ఊరు జిల్లాకేంద్రానికి 15 కి.మీ. దూరం లోపునే ఉన్నా నేను కూడా ఇంటికి వెళ్ళలేని విధంగా మాకు తీవ్రమైన ట్రైనింగ్ మళ్ళీ జిల్లాకేంద్రంలో మొదలైంది. దానికంతటికీ మా జిల్లాకేంద్రంలోఉన్న ఒక సాయుధ విభాగాధిపతియే కారణం. రిజర్వు ఇన్స్పెక్టర్ లేదా ఆర్.ఐ. అనేది అతని అధికార హొదా. అతను గ్రే హౌండ్స్ మొదలైనప్పటినుండి దాదాపు 8 సం.లకు పైగా అక్కడ సేవలందించి జిల్లాకు వచ్చాడు. మేము జిల్లాలో అడుగుపెట్టేనాటికి మా జిల్లాలో "మావోయిస్ట్" కార్యకలాపాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మా ఎస్.పి. గారు మావోయిస్ట్ కార్యకలాపాలలో ఎంతో అనుభవజ్ఞుడైన ఆ ఆర్.ఐ. గారికి మమ్మల్ని "మావోయిస్ట్" లను సమర్ధంగా ఎదుర్కొనేలా మమ్మల్ని సన్నద్ధం చేయమని ఆయనకి పూర్తి స్వేచ్చను ఇచ్చారు. దాంతో మా కష్టాలు మూడింతలు అయ్యాయి.

           మేము హైదరాబాద్ ట్రైనింగులో ఉండగా మాకు ఎప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళం. ఎందుకంటే 24 గంటలు క్రమశిక్షణతో, ఉన్నతాధికార్ల అజమాయిషీలో ఉండటం మరియు శిక్షణ ఎపుడు తప్పుతాయా అని అనిపించేది. అది గమనించిన మా ట్రైనర్ మాతో చాలాసార్లు "మీరు వీలైనంత తొందరగా ట్రైనింగ్ అయిపోతే బావుండు, బయటికి వెళ్లి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులే మీరు సంతోషంగా ఉండేది, ట్రైనింగ్ అయిపోయి మీరు విధులలో చేరితే ఇక మీకు అన్నీ బరువు భాద్యతలు, కష్టాలే" అని అనేవాడు. కానీ మాకు అది వింతగా అనిపించేది, ఎందుకంటే ట్రైనింగ్ అయిపోతే మేము స్వతంత్రంగా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన చెప్పింది మాకు అనుభవంలోకి రావటానికి ఎంతో కాలం పట్టలేదు.

              ఇక మాకు ఆర్.ఐ. గారు  మేము జిల్లాకేంద్రానికి వచ్చిన రెండవ రోజునుండే పూర్తి గ్రే హౌండ్స్ తరహా శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ షెడ్యూలుకు మా శరీరాలు అలవాటు పడటానికి మాకు పదిరోజులు పైనే పట్టింది. ఉదయం 0530 గంటలకే మాకు గ్రౌండ్లో శిక్షణ మొదలయ్యేది. మేము ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న 9 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇంతలా కష్టపడింది లేదు. మాకు వారంలో ప్రతి రోజు పొద్దున్నే, ఒక రోజు 10 కి.మీ. పరుగుపందెం 50 ని.లలో పరుగెత్తటం, తరవాతి రోజు అడ్డంకులను అధిగమించటం, మరుసటి రోజు 3.2 కి.మీ. పరుగును వీపుపై 5 కిలోల బరువుతో, చేతిలో తుపాకీతో మరియు కాళ్ళకు స్పోర్ట్స్ బూట్లు కాకుండా "జంగిల్ షూ" అనబడే ప్రత్యేక తరహా బూట్లు వేస్కుని 17 ని.లలో పరుగెత్తటం, ఒక రోజు తుపాకీ పేల్చటంలో శిక్షణ ఇలా ఒక వరుస క్రమంలో 6 రోజులూ ఏదో ఒక శిక్షణ ఉండేది. మాకు రోజులో ఉదయం అల్ఫాహారానికి, స్నానాదికాలకు కలిపి ఒక గంట, మధ్యాహ్నం భోజనానికి గంటన్నర, విరామాలతో రాత్రి 7 గంటల వరకు అలుపెరగని శిక్షణ ఇచ్చేవారు.

              ట్రైనింగ్ సెంటర్లో మా 9 నెలల శిక్షణ కాలంలో నాతో సహా చాలా మంది ట్రైనీలు ఏదో ఒక సందర్భంలో ట్రైనర్లకో, ఇతర సిబ్బందికో ఎదురు తిరగటం లేదా ఏదో ఒక విషయంలో గొడవ పడటమో జరిగాయి. కానీ  మాకు జిల్లాకేంద్రంలో ఆర్.ఐ. గారి వద్ద శిక్షణ మొదలైన వారంలోనే జరిగిన ఒక సంఘటన వల్ల, మేము ఆయన వద్ద తీసుకున్న రెండు నెలల్లో ఏ ఒక్క ట్రైనీ కూడా ట్రైనింగ్ ఇచ్చే సిబ్బందికి ఎదురు తిరగాలని ఆలోచించే సాహసం కూడా చేయలేకపోయారు. 
(ఇపుడు పోలీసు వ్యవస్థలో చాలా మంచి పోలీసు అధికారులు ఉన్నారు, కాబట్టి త్వరలోనే మనం ఇంకా మెరుగైన పోలీసింగ్ చూడగలమని నా అభిప్రాయం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Wednesday 7 December 2011

పట్టరాని ఆనందం కలిగిన రోజు


చాలా బావుంది కదా...
నేను ట్రైనింగులో ఫస్టు వచ్చానన్న విషయం మా ఇంట్లో చెప్పగానే మా అమ్మా, నాన్న ఎంతో సంతోషించారు. "పాసింగ్ అవుట్ పరేడ్" కు ప్రతి ట్రైనీ తల్లితండ్రులు రావచ్చని చెప్పటంతో నేను మా అమ్మా, నాన్నను కూడా ఆ రోజున రమ్మని చెప్పాను. మా "పాసింగ్ అవుట్ పరేడ్" జరిగిన రోజున పొద్దునే ఉదయం 0630 గంటల కల్లా అల్ఫాహారం సేవించి మేము పూర్తి స్థాయిలో తయారై గ్రౌండ్ కు వెళ్ళాము. నన్ను పోలీసు యునిఫారంలో, అది కూడా "పాసింగ్ అవుట్ పరేడ్" సందర్భంగా మేము వేసుకున్న "సెరిమోనియల్ డ్రెస్" లో మొదటిసారి చూసి నా తల్లితండ్రులు చాలా  సంతోషించారు.

                  మా "పాసింగ్ అవుట్ పరేడ్" కు ముఖ్య అతిధిగా అప్పటి రాష్ట్ర "హొం శాఖ" అమాత్యులు వచ్చారు. మేము ఉదయం 0630 గంటలకు గ్రౌండ్ కు వెళ్లితే, ముఖ్య అతిధి వచ్చి పరేడ్ మొదలయ్యేసరికి దాదాపు 0830 గంటలు అయింది. ఎండాకాలం పొద్దున్న కావటంతో మాకు కాళ్ళు లాగటం, కొంతమందికి కళ్ళు తిరగటం మొదలైన సమస్యలు మొదలయ్యాయి. అందుకే ట్రైనీలు వీటన్నిటికి తట్టుకునేలా "పాసింగ్ అవుట్ పరేడ్" కోసం తీవ్రమైన ప్రాక్టీసు చేపిస్తారు. మొత్తానికి ముఖ్య అతిధి రాకతో మా "పాసింగ్ అవుట్ పరేడ్" మొదలైంది. మొదట "పరేడ్ కమాండర్" వెళ్లి ముఖ్య అతిధికి గౌరవవందనం చేయటం మరియు పరేడ్ ను మొదలు పెట్టటానికి అనుమతి కోరటంతో పరేడ్ మొదలు అయింది.

ఈ ఫోటో నాది కాదులెండి, బావుందని పెట్టా...
                   పరేడ్ లో భాగంగా ముందు "పరేడ్ కమాండర్" నడుస్తుండగా, వెనక మొత్తం పరేడ్ లో ఉన్న విభాగాలు అన్నీ ఒక్కొక్కటిగా "స్క్వాడ్ కమాండర్ల" నేతృత్వంలో స్టేజ్ పై ఉన్న ముఖ్య అతిధి ముందు నుంచి కవాతు చేస్తూ వెళుతూ ఆయనకు "గౌరవవందనం" సమర్పించాలి. నాది మొత్తం పది విభాగాలలో మధ్యలో అనగా అయిదవ విభాగం. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు చేసే కవాతు కి అందరూ చప్పట్లతో అభినందించేవారు. మా "పాసింగ్ అవుట్ పరేడ్" వ్యాఖ్యానం కోసం ఒక మహిళా రేడియో వ్యాఖ్యాతను తీసుకు వచ్చారు. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు ఆమె ఆ "స్క్వాడ్ కమాండర్" పేరు చెపుతూ మరియు ఒకవేళ అతని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే చెప్పేది. నా విభాగం వంతు వచ్చినపుడు కొంత టెన్షన్ గా ఉన్నా నేను సరిగానే కమాండ్స్ ఇస్తూ "గౌరవ వందనం" సమర్పించాము. అపుడు ఆ వ్యాఖ్యాత నా పేరు చెపుతూ, నేను ట్రైనింగులో "బెస్ట్ ఆల్ రౌండర్ మరియు బెస్ట్ ఇండోర్ ట్రైనీ" అని చెప్పటంతో చప్పట్లు మరింతగా మోగటం నాకు ఉత్తేజాన్ని కలిగించింది. 

                మొత్తం అన్ని విభాగాలు "గౌరవ వందనం"సమర్పించి మరల తమ తమ స్థానాల్లోకి వచ్చి చేరిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారు మా ట్రైనింగ్ గురించి ఒక రిపోర్ట్ చదవటం, తదుపరి ముఖ్య అతిధి మాట్లాడటం జరిగాయి.  అనంతరం మాతో మా ముందు జాతీయ పతాకం చేబూని కొంతమంది మా ట్రైనీలు కవాతు చేస్తూ వెళుతుండగా, మా ట్రైనీలందరితో ప్రమాణం చేపించారు. తదుపరి ట్రైనింగులో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి  ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందించే కార్యక్రమం మొదలైంది. "బెస్ట్ ఇండోర్ మరియు బెస్ట్ ఆల్ రౌండర్" గా రెండు బహుమతులను  అప్పటి "హొం మంత్రి" చేతుల మీదుగా, వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అందుకుంటున్నపుడు నాకు మాటల్లో చెప్పలేని ఆనందం కలగగా, జనాల్లో ఉండి  ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నా తల్లితండ్రులు ఆనందం వర్ణనాతీతం. నాకు రెండు బహుమతులకు రెండు పేద్ద కప్పులు అంటే 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే కపిల్ దేవ్ కు ఇచ్చారే అంత పెద్ద కప్పులు  ఇచ్చారు. మొత్తం "పాసింగ్ అవుట్ పరేడ్" అయిపోయిన తర్వాత నాతో పాటు బహుమతులు వచ్చిన మరో ట్రైనీతో పాటు మా ప్రిన్సిపాల్ గారు ఫోటోలు దిగాము. మా తల్లితండ్రులు, నేను నాకు వచ్చిన బహుమతులతో మా ప్రిన్సిపాల్ గారితో దిగిన ఫోటో నా జీవితంలో ఎపుడూ కళ్ళముందే గుర్తొస్తుంది. ఇక నాకు వచ్చిన పేద్ద కప్పులతో ఎంతమంది ఫోటోలు దిగారో. 
ప్రతి పోలీసు అధికారి ఈ ప్రమాణం చేసాకే ఉద్యోగం మొదలెడతాడు
                 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని నేరుగా ఇంటికి పంపకుండా మా జిల్లా పోలీసు కేంద్రానికే పంపారు. నేను రెండు రోజుల తర్వాత గానీ ఇంటికి వెళ్ళలేదు. ట్రైనింగ్ సెంటర్ ను వదిలి వెళ్ళేటపుడు చాలా బాధ కలిగింది. అయితే నాకు వచ్చిన రెండు పెద్ద కప్పులు చెరోకటి పట్టుకొని మా అమ్మానాన్న మా ఉరిలో బస్సు దిగి మా ఇంటికి నడిచి వెళ్తుంటే అడగని వారే లేరని నేను ఇంటికెళ్ళాక వాళ్ళు చెపుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ట్రైనింగ్ అయిపోయి జిల్లాకి వెళ్ళినా మా కష్టాలు తీరలేదు. ఎలాగంటే..

(పోలీసు ఉద్యోగంలోని సాధక భాదకాలను మీ బందువులో లేక స్నేహితులో ఎవరైనా పోలీసుగా ఉంటే, వారికి ఎలాంటి బేషజాలు లేకుంటే ఇంకా హృద్యంగా వివరించగలరు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 5 December 2011

పాసింగ్ అవుట్ పరేడ్ లో నా కష్టాలు

ఆపాదమస్తకం బాగుండాలి మరి!
పోలీసు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేసే "పాసింగ్ అవుట్ పరేడ్" లో మొత్తం కవాతును మా ట్రైనీలలో ఎవరైతే "బెస్ట్ ఆల్ రౌండర్" గా ఫస్టు వస్తారో వాళ్ళు చేపించాల్సి వస్తుంది. అతనిని "పరేడ్ కమాండర్" అని పిలుస్తారు. కానీ ప్రాక్టీసు దాదాపు పూర్తి అయిపోయే సమయానికి కానీ మా పరీక్షల ఫలితాలు రాలేదు. అప్పటివరకు మా జిల్లాకే చెందిన ఒక ట్రైనీని "పరేడ్ కమాండర్" గా ప్రాక్టీసు చేపించారు. ఎందుకంటే అతను ఆర్మీలో పని చేసి తదుపరి "ఎక్స్ -సర్వీసుమెన్" కోటాలో తిరిగి కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. సడెన్ గా నేను "బెస్ట్ ఆల్ రౌండర్" గా ఫస్టు రావటంతో ఏమి చేయాలో మా అధికారులకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అప్పటివరకు "పాసింగ్ అవుట్ పరేడ్" ప్రాక్టీసు చేయలేదు మరియు కనీసం చూడలేదు. అలాంటి నన్ను "పరేడ్ కమాండర్"గా నియమించటం సమస్య అవుతుంది. 

                 "పరేడ్ కమాండర్"గా ఏ మాత్రం ప్రాక్టీసు లేని నన్ను నియమిస్తే, నేను సరిగా కమాండ్స్ ఇవ్వక మొత్తం పరేడ్ అభాసుపాలు అవుతుంది. అలాగని "బెస్ట్ ఆల్ రౌండర్" అయిన నన్ను పరేడ్ లో లేకుండా కానీ, పరేడ్ లో ఒక మామూలు ట్రైనీగా ఉంచటానికి కుదరదు. సరే పోలీసు అధికారులంతా ఆలోచించి మొత్తానికి నన్ను "పాసింగ్ అవుట్ పరేడ్" లో ఉండే మొత్తం పది విభాగాలలో మధ్యలో ఉండే విభాగానికి (స్క్వాడ్ అంటారు) నన్ను "స్క్వాడ్ కమాండర్" గా నియమించారు. 

                  ఇక చూడండి నా కష్టాలు, "పాసింగ్ అవుట్ పరేడ్" కు వారం రోజులు గడువు మాత్రమే ఉంది. ప్రాక్టీసు చేసే సిబ్బంది అంతా బాగా చేస్తుంటే నాకు నేను ఏమి చేయాలో, ఏమి కమాండ్స్ ఇవ్వాలో భోదపడేదే కాదు. దాంతో నాకు మరియు మా ప్రాక్టీసు చేపించే అధికారులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. దాంతో ఎంతో అనుభవం ఉన్న మా అవుట్ డోర్ ట్రైనింగ్ అధికారి ఒక పరిష్కారం కనుక్కున్నారు. అదేమిటంటే, నేను నేతృత్వం వహిస్తున్న విభాగానికి అప్పటివరకు "స్క్వాడ్ కమాండర్" గా ఉన్న ట్రైనీని మా విభాగంలో నా వెనకే ఉండేలా నియమించారు. దాంతో అతను ప్రతి కమాండ్ ను వెనక నుండి నాకు ముందే చెప్పటంతో, నేను దాన్ని అనుసరించి కమాండ్స్ చెపుతూ ప్రాక్టీసు ఇబ్బంది లేకుండా చేయగలిగాను. మొత్తానికి మిగిలిన ఆ వారం రోజుల ప్రాక్టీసులోనే "స్క్వాడ్ కమాండర్"గా నా కమాండ్స్ మొత్తం నేర్చుకొని "పాసింగ్ అవుట్ పరేడ్" కు సిద్దమవటంతో మా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

                 ఆ ప్రాక్టీసు చేసిన వారం రోజులు నేను ప్రతి రోజు సాయంత్రం గ్రౌండ్ నుండి రూముకు రాగానే మామగాడ్ని తిడుతుండేవాడ్ని. వాడు నవ్వుతూ "నాకేం తెలుసురా? నువ్వు ఫస్టు వస్తావని, అయినా నేను వద్దురా అంటున్నా వినకుండా ఫస్టు వచ్చావు, రేపు గ్రే హౌండ్స్ కు నిన్ను సెలెక్ట్ చేస్తే కానీ నీకు అర్థం కాదులే" అని అంటుండేవాడు. మేము ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లోనే మా ట్రైనింగ్ సెంటర్ కు గ్రే హౌండ్స్ సిబ్బంది వచ్చి, ఎవరైతే గ్రే హౌండ్స్ విభాగంలో పని చేయటానికి ఇష్టం ఉన్నారో వారినే సెలెక్ట్ చేయటంతో నేను గ్రే హౌండ్స్ కు వెళ్ళకుండా బయటపడ్డందుకు ఆనందించాను. ఇంతలో "పాసింగ్ అవుట్ పరేడ్" జరిగే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏమి జరిగిందంటే...

(రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిపై బలప్రయోగం (ఫిజికల్ ఫోర్సు ఉపయోగించే) చేసే అధికారం ఒక్క పోలీసులకు మాత్రమే, అది కూడా శాంతిభద్రతల పరిరక్షకే ఇచ్చారు.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.