Tuesday 10 January 2012

కూంబింగ్ లో రెండో రోజు

ప్రాణాలకు తెగించి మరీ ఉద్యోగ ధర్మం (పర్వం)

మరుసటి రోజు తెల్లవారు జామున వెలుగు రావటం మొదలు కావటంతోనే అందర్నీ నిద్రలేపారు. మేము మరల నడక మొదలు పెట్టినాము. కొంత దూరం నడవటం తోనే వీపుపైన ఉన్న బరువు మరియు భుజంపైన ఉన్న తుపాకీ రాను రాను మరింత బరువు పెరిగినట్టు అనిపించసాగింది. అపుడు నా చిన్నపుడు మా అమ్మమ్మ చెప్పిన దెయ్యం కథ గుర్తొచ్చింది. అదేమిటంటే "కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోజు మా ఇంటిపక్కన ఒకాయన పొలానికి వెళ్లి రాత్రి చీకటి పడిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడంట. అపుడు ఆయనకి ఒక దయ్యం మేక పిల్ల రూపంలో అరుచుకుంటూ ఎదురయ్యిందంట. అపుడు ఆయన "అరె ఈ సమయంలో ఇది ఒక్కటి ఇక్కడ ఎందుకు ఉందో, ఏదైనా నక్కో, తోడేలో చూస్తే చంపుతాయి కదా" అని జాలి పడి ఆ మేకపిల్లని భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడంట. అయితే రాను రాను భుజాలపై ఉన్న మేక పిల్ల బరువు పెరుగుతున్నట్లు అనిపించసాగిందంట. కొద్దిసేపటికే అది అతను మోయలేనంత బరువు పెరిగిందంట. దాంతో ఆయనకి అనుమానం వచ్చి ఆ మేక పిల్లని భుజాలపై నుండి నేలపై గట్టిగా విసిరేసాడంట. అపుడు ఆ మేక పిల్ల ఆడమనిషి రూపంలో మారిపోయి అతన్ని నానా బూతులూ తిడుతూ మాయమైపోయినదంట. పై కథలో దెయ్యంలా, నా భుజంపై ఉన్న తుపాకీ, వీపుపై ఉన్న బ్యాగు కూడా విపరీతమైన బరువు పెరిగిపోతున్నట్టు అనిపించసాగింది. 

                ఆ బరువును అలాగే భరిస్తూ కొద్దిసేపటికి మేము ఒక వాగు దగ్గరికి చేరుకున్నాం. అక్కడ ముఖాలు శుభ్రం చేస్కొని, కాలకృత్యాలు తీర్చుకోవాలని ఆగాము. తుపాకీ మరియు బ్యాగులను క్రిందికి దించి, ఆ వాగులో దిగి దాన్లో ప్రవహిస్తున్న చల్లని నీళ్ళు చేతితో అందుకోగానే అప్పటి వరకు ఉన్న అలసట పోయి మనసు ప్రశాంతంగా అనిపించింది. అయితే అడవిలో నీళ్ళ దగ్గర కూడా మేము ఎలా ప్రవర్తించాలో మాకు ఒక నియమావళి ఉండటంతో మా విభాగాధిపతి మమ్మల్ని ఆ నీళ్ళని పూర్తిగా ఆస్వాదించనివ్వలేదు. అప్పటివరకు విపరీతమైన చమటలతో పూర్తిగా తడిసిన శరీరం ఆ చల్లని నీళ్ళతో స్నానం చేస్తే ప్రక్షాళన అయి ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటే, మా నియమావళిలో కూంబింగ్ లో స్నానం చేయరాదనే కఠినమైన నియమం ఉందనే విషయం గుర్తొచ్చి ఎవరూ ఆ సాహసం చేయలేదు. తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని మేము మాతో తెచ్చుకున్న తినుబండారాలని అల్ఫాహారంగా తీసుకొని, బాటిళ్ళలో నీళ్ళు నింపుకొని మరల నడక మొదలు పెట్టాము.

               మరల మధ్యాహ్నం వరకు తుపాకీ మరియు బ్యాగుల బరువులను అలాగే భరిస్తూ ఆ ఎగుడు దిగుడు అడవి ప్రదేశంలో నడుచుకుంటూ ముందుకు సాగాము. మధ్యలో మాలో చాలా మంది అదుపుతప్పి క్రిందపడ్డారు, నేను కూడా పడ్డాననుకోండి, కాకపోతే ఎవరికీ దెబ్బలు తగలలేదు. సరే మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర సమయంలో భోజనానికి ఏర్పాట్లు చూడాలని మా విభాగాధిపతి నిశ్చయించాడు. కాని మేము ఎంత వెదికినా చుట్టుప్రక్కల నీళ్ళ జాడ కనపడలా. అలాగే ఓపికగా, ఆకలితో ముందుకు నడుచుకుంటూ వెళుతుండగా మాకు చుట్టూ పొదలు అల్లుకున్న ఒక బావి కనిపించింది. కాని దానికి మెట్లు సరిగా లేవు, పైగా పైనుంచి చూస్తుంటే నీళ్ళు బాగా నల్లగా కనిపిస్తున్నాయి. సరే మొత్తానికి కస్టపడి క్రిందికి దిగి మా దగ్గర ఉన్న పాత్రల్లో ఆ నీళ్ళు పైకి తీసుకు వచ్చినాక, ఆ నీళ్ళు చూసి మేము భయపడ్డాము. అవి చాలా కాలంగా నిల్వ ఉండటం వల్లేమో, పూర్తి పసుపు రంగులో ఉన్నాయి. అయితే చుట్టూ ప్రక్కల ఎక్కడా దరిదాపుల్లో నీరు లభించే అవకాశం లేకపోవటంతో ఆ నీటితోనే వంట చేయటానికి సిద్దపడ్డాము. అప్పుడు ఏమి జరిగిందంటే...

(ప్రజాసేవలో, ఉద్యోగ భాద్యతల నిర్వహణలో అమరులైన ప్రతి పోలీసు అధికారీ చిరస్మరణీయులే)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.



1 comment:

  1. No new posts from quite some time? I was following this from sometime, and suddenly there are no updates. You have readers, keep writing :)

    ReplyDelete