Monday 26 December 2011

మొదటిసారి కూంబింగ్ కు వెళ్ళే ముందు

చూడటానికి ఠీవీగా ఉందా...
మాకు జిల్లా కేంద్రంలో "మావోయిస్ట్ వ్యతిరేఖ" యుద్ధతంత్రాలపై శిక్షణ అయిపోయిన తర్వాత మమ్మల్నందర్నీ మా జిల్లాలో "మావోయిస్ట్" కార్యకలాపాలపై బలగాలను అజమాయిషీ చేసే పోలీసు అధికారి (officer on special duty-OSD అంటార్లెండి) ఉండే మరో పట్టణానికి తీసుకు వెళ్ళారు. అక్కడ మా శిక్షణార్థులందర్నీ వివిధ జట్లుగా చేసారు. కొన్ని జట్లను హైదరాబాద్ నుండి రప్పించబడిన "గ్రే హౌండ్స్" బలగాలతో, మరి కొన్నింటిని జిల్లాలో అప్పటికే మావోయిస్ట్ వ్యతిరేఖ కార్యకలాపాలలో పని చేస్తున్న "స్పెషల్ పార్టీలు" అనబడే బలగాలతో పాటు జత చేసారు. అంటే మమ్మల్ని మొదటిసారి కూంబింగ్ నిమిత్తం అడవిలోకి పంపుతున్నందున ఆ బలగాలు మాకు రక్షణ కోసం తోడుగా ఉంటాయన్నమాట. 

          అయితే మాకు "గ్రే హౌండ్స్" తో వెళ్ళే జట్లకు ఎక్కువ మరియు కఠినమైన కూంబింగ్ ప్రదేశం ఉంటుందనీ, అంతే కాక వాళ్ళు అడవిలో కూంబింగ్ చేసేటపుడు పోలీసు బలగాలు పాటించాల్సిన నియమ నిభందనల్ని ఏ మాత్రం రాజీపడకుండా పాటిస్తారనీ, అదే జిల్లా స్పెషల్ పార్టీలతో వెళితే కూంబింగ్ సులువుగా ఉంటుందనీ తెలిసింది. అంటే ఉదాహరణకి మాకు కూంబింగ్ లో ఏదైనా కొండ మీదుగా వెళ్ళాల్సి ఉంటే గ్రే హౌండ్స్ బలగాలు అయితే అది ఎంత పెద్ద కొండ అయినా దాన్ని ఎక్కి వెళతాయి, అంతే కాక కూంబింగ్ లో భాగంగా ఇచ్చిన మొత్తం ప్రదేశాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసుకొని కానీ తిరిగిరావు. అదే జిల్లా స్పెషల్ పార్టీలు అయితే కొండ మరీ పెద్దదిగా ఉంటే దాన్ని ఎక్కకుండా చుట్టూ తిరిగి వెళ్ళటమో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా డుమ్మా కొట్టటమో చేస్తాయి. అందుకని మేము మాకు జిల్లా స్పెషల్ పార్టీలతో కూంబింగ్ కు పంపితే బాగు అని కోరుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు (twist అంటారా?) లేకపోలేదు. అదేమిటంటే ఒక వేళ కూంబింగ్ లో మావోయిస్ట్ లు ఎదురుపడి పరస్పర ఎదురు కాల్పులు జరిగినా లేదా వాళ్ళు పథకం ప్రకారం ముందుగా దాడి చేసినా, జిల్లా స్పెషల్ పార్టీ బలగాలతో వెళ్ళేటప్పటి కన్నా, గ్రే హౌండ్స్ బలగాలతో వెళితే మా భద్రతకు ఎక్కువ అవాకాశాలు ఉంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

                  అదృష్టమో, దురదృష్టమో కానీ నేను ఉన్న జట్టుకు మాత్రం గ్రేహౌండ్స్ బలగాలతో వెళ్ళే అవకాశం వచ్చింది. మొత్తం మూడు రాత్రులు, రెండు పగళ్ళు అడవిలో గడుపుతూ మాకు ఇచ్చిన కూంబింగ్ ప్రదేశాన్ని మావోయిస్ట్ ల కోసం వెదికి రావాలని చెప్పారు. మాకు మొదటిసారి కూంబింగ్ కు వెళ్ళటం కాబట్టి, ఏమేమి తెసుకు వెళ్ళాలో కూడా పూర్తిగా తెలీదు. మాకు అన్ని వస్తువులు తీసుకు వెళ్ళటానికి ఒక బ్యాగును ఇచ్చారు. తినటానికి ఏమేం తీసుకు వెళ్ళాలో మాకు తెలీదు కాబట్టి రెండు మూడు రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలు మా అధికారులే ఇచ్చారు. కూంబింగ్ కు వెళ్ళే మూడు రోజులూ స్నానం చేయటమనేది మరిచిపోవాలని, ఎవరైనా కూంబింగ్ నియమావళిని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీస్కుంటామని ఆర్.ఐ. గారు తీవ్రంగా హెచ్చరించారు. అపుడు దాదాపు ఎండాకాలం అయిపోయి, వర్షాకాలం మొదలవటంతో వర్షానికి తడవకుండా ఉండేలా రక్షణ ఏర్పాట్లు కూడా అదనంగా తీసుకెళ్ళాల్సి వచ్చింది. అంతే కాక ప్రతి ఒక్కరు కనీసం 5 లీటర్లు నీరు కూడా తీసుకెళ్ళాలి. మొత్తానికి బ్యాగు బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఏమి తగ్గిద్దామన్నా అన్నీ అవసరమే కదా అని అలాగే ఉంచుకొన్నాము. సరే మొత్తానికి అడవిలోకి మొదటిసారి వెళుతున్నాము కాబట్టి చివరిగా ఓ.యస్.డి. గారు, ఆర్.ఐ. గారు అన్ని రకాల జాగ్రతలు చెప్పి మమ్మల్ని కూంబింగ్ కు పంపించేందుకు సమాయత్తం చేసారు. ఇక మేము అడవిలోకి బయలుదేరటమే తరువాయి మరి... 

(కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా ఉంటుందండీ పోలీసు ఉద్యోగం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Thursday 22 December 2011

నా గెలుపు గాలివాటం కాదని అందరికీ రూడీ ఎలా అయిందంటే!

ఆయుధాలు ఎంత అందంగా ఉన్నాయో కదా, చూడటానికి...
మొత్తానికి జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారి ట్రైనింగ్ కు మేము క్రమంగా అలవాటు పడ్డాము. కానీ మాకు మాత్రం అబస్టకల్స్ ట్రైనింగ్ (అడ్డంకులను అధిగమించటం) అంటే కొద్దిగా భయంగానే ఉండేది. మాకు హైదరాబాద్ ట్రైనింగ్ లో ఉన్న అడ్డంకులన్నీ చాలా చిన్నగా ఉండటమే గాక,  క్రింద పడ్డా దెబ్బలు తగలకుండా క్రింద ఇసుక ఉండేది.  కానీ జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారు ఏర్పాటు చేసిన అడ్డంకులు చాలా భీతిగొలిపేవిగా ఉండేవి. ఎందుకంటే అవి మా జిల్లా పోలీసు ప్రధాన కేంద్రానికి పక్కనే ఉన్న గుట్టల్లో బండ రాళ్ళ మధ్య ఏర్పాటు చేసారు. తాళ్ళపై వేలాడేటపుడు గానీ, ఒక అడ్డంకి నుండి మరో అడ్దంకి చేరేటపుడు గానీ ఏమాత్రం చేతులు లేదా కాళ్ళు పట్టు తప్పినా ఆ రాళ్ళ మీద పడితే తీవ్రమైన దెబ్బలు తగలటం ఖాయం. ఈ ట్రైనింగ్ మొదలైన కొత్తలోనే కొంతమంది క్రింద పడి దెబ్బలు తగిలించుకోవటం, అయినా ఆర్.ఐ. గారు కనికరించకుండా వారికి యధావిధిగా ట్రైనింగ్ చేపించటంతో మాకు ఈ ట్రైనింగ్ అంటే భయం ఏర్పడింది. అయితే మాకు ఈ ట్రైనింగ్ లో హైదరాబాద్ ట్రైనింగ్ లో నేర్పిన ఆయుధాల కంటే అధునాతన ఆయుధాలలో పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చారు. కానీ మాకు జిల్లా కేంద్రంలో కవాతు శిక్షణ అనేది ఏ మాత్రం లేకుండా పూర్తిగా "మావోయిస్ట్ వ్యతిరేఖ" శక్తియుక్తులపై మాత్రమే శిక్షణ ఇచ్చారు.

                 ఆర్.ఐ. గారు గ్రే హాండ్స్ లో పని చేసినందు వల్ల, దాదాపు ఆ ట్రైనింగ్ లో ఉన్న విధివిధానాలనే మాకు జిల్లాకేంద్రంలో అమలు చేయటంతో మాకు ఇన్ని కస్టాలు వచ్చి పడ్డాయి. మేము హైదరాబాద్ లో మాతో పాటు ట్రైనింగ్ చేసిన ఇతర జిల్లాలకు చెందిన ట్రైనీలను వాకబు చేయగా, వాళ్ళందరూ పోలీసు స్టేషన్ లలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిసి మాకు ఇంకా బాధ కలిగింది.  సరే మొత్తానికి క్రిందా, మీదా పడి జిల్లా కేంద్రంలో రెండు నెలల పాటు ఆర్.ఐ. గారి  శిక్షణ పూర్తి చేసుకున్నాము. ఈ శిక్షణ మొత్తం రెండు నెలల కాలంలో నేను మా జిల్లాకేంద్రం కు 15 కి.మీ. లోపే ఉన్న మా ఊరికి నాలుగైదు సార్లు మించి వెళ్లలేదంటే ఎంత తీరికలేని శిక్షణ ఆర్.ఐ. గారు మాకు ఇచ్చారో ఊహించుకోవచ్చేమో...

                  సరే జిల్లా కేంద్రంలో శిక్షణ అయిపోవచ్చింది. దాంతో మాకు ఆ రెండు నెలల్లో ఆర్.ఐ. గారు నేర్పించిన "మావోయిస్ట్ వ్యతిరేఖ" శిక్షణ పై ఒక వ్రాత పరీక్ష పెట్టారు. అందరికీ ఏమో కానీ నాకు మాత్రం వ్రాత పరీక్ష అంటే కొంత ఆందోళన గానే ఉంది. ఎందుకంటే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఫస్టు వచ్చా కాబట్టి ఇపుడు వేరెవరైనా ఈ వ్రాత పరీక్షలో ఫస్టు వస్తే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఏదో గాలివాటంగా ఫస్టు వచ్చానని అంతా అనుకుంటారు కదా!. అందుకే ఎలాగైనా నేను ఫస్టు రావాలనే ఉద్దేశ్యంతో బాగా కష్టపడి చదివాను. నా కష్టానికి తగ్గట్టుగా ఆ వ్రాత పరీక్షలో కూడా నేను ఫస్టు రావటంతో నా మీద ఎవరికైనా కొద్దో గొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ "ముందుంది ముసళ్ళ పండగ" అనేది మాకెవరికీ అపుడు తెలీదు... 

(పోలీసులకు కూడా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయి, కాకపోతే వాటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదం.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 19 December 2011

నిన్న నేనెలా పొరబడ్డానంటే!

అవసరం -కానీ అనర్థం, కాదంటారా?...
నేను పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి నా అనుభవాలను ఒక వరుసక్రమంలో చెపుతూ పోతున్నాను. అయితే ప్రస్తుత నా రోజు వారీ ఉద్యోగంలో భాగంగా నాకు ఎదురయ్యే అనుభవాలు నేను అదే క్రమంలో చెప్పేసరికి కొన్నింటిని నేను మరిచిపోవచ్చు. కాబట్టి మధ్య, మధ్యలో ఆ అనుభవాలు కూడా చెపితే బావుంటుందేమో అని అనిపించి నాకు రెండు రోజుల క్రితం కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. 
  
                 మొన్నటి రోజు పొద్దున్న సుమారు 10 గంటల సమయంలో నేను నా జీపులో దగ్గరలో ఉన్న మా DSP కార్యాలయానికి వెళుతున్నాను. అపుడు నా ముందు ఒక మోటర్ సైకిల్ పై, వెనుక ఒక యూనిఫారంలో ఉన్న వ్యక్తి కూర్చొని ఉండగా, ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు(triple riding) కనిపించింది. ఆ యూనిఫారంలో ఉన్నది ఏ డిపార్టుమెంట్ ఉద్యోగో తెలియదు, కానీ మామూలుగానే మోటర్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకూడదు. మరి ఆ విధంగా యూనిఫారంలో ఉండి ముగ్గురు ప్రయాణిస్తుంటే, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ప్రజల్లో చెడ్డ పేరు కదా. అందుకని నేను ఆ మోటర్ సైకిల్ ని క్రాస్ చేయమని మా డ్రైవర్ కు చెప్పినాను.

                 నేను ఆ మోటర్ సైకిల్ క్రాస్ చేసి వారిని ఆగమని చెప్పాను. తీరా చూస్తే ముందు మోటర్ సైకిల్ నడుపుతున్నది కూడా ఒక కానిస్టేబులే. మధ్యలో మాత్రం ఒక ప్రైవేటు వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాళ్ళు మా పక్క స్టేషన్ సిబ్బందిగా గుర్తించాను, వాళ్ళు కూడా నన్ను గుర్తు పట్టి నమస్కరించారు. నేను కోపంతో "ఏమయ్యా, ఎంత అవసరం ఉంటే మాత్రం మోటర్ సైకిల్ పై ముగ్గురు, అదీ యునిఫారంలో ఉండి ప్రయాణిస్తారా?", ప్రజలు మన గురించి ఏమనుకుంటారు?, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ఎంత చెడ్డ పేరు" అంటూ కొంచెం ఘాటుగానే వారిని మందలించాను. దానికి వారు చెప్పిన సమాధానం నన్ను కన్విన్సు చేయగలిగినా, బయటనుండి చూసే వాళ్ళు మాత్రం చెడుగానే అనుకుంటారు.

                  ఇంతకూ విషయమేమిటంటే, " ఆ కానిస్టేబుళ్లు పని చేసే స్టేషన్ కు సంబంధించిన ఒక 'హత్య కేసు ముద్దాయి' ఉప-కారాగారంలో రిమాండులో ఉన్నాడు. ఆ కేసులో వాయిదా ఆ రోజు ఉన్నందున ఆ ముద్దాయిని కోర్టులో హాజరుపరచాలి. కోర్టేమో పట్టణంలో ఉండి, ఉప-కారాగారమేమో పట్టణానికి దాదాపు రెండు కి.మీ. దూరంలో ఉంది. అంత తక్కువ దూరానికి సాధారణంగా స్టేషన్లో "వారంటు" (పోలీసులకు RTC బస్సులో చార్జీ లేకుండా ఉపయోగించే ప్రభుత్వ పాస్ లాంటిది) ఇవ్వరు. నడిపించుకు రావటానికి మరీ దగ్గర కూడా కాదు, పైగా 'హత్య కేసు ముద్దాయి' కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటో లేదా బస్సులో ఆ కానిస్టేబుళ్లు తమ స్వంత డబ్బులతో తీసుకు రాలేరు. దానికి గాను ఆ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరి మోటర్ సైకిల్ పై మధ్యలో, ఆ 'హత్య కేసు ముద్దాయి' ని కూర్చోబెట్టుకొని ఉప-కారాగారం నుండి కోర్టుకు తీస్కుని వెళుతున్నారు. ఎంత అవసరం ఉన్నా, చట్టాన్ని అమలు చేసే పోలీసులు మాత్రం దానిని అతిక్రమించటం తప్పే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వేరే డిపార్టుమెంటులో ఉన్నా, వాళ్ళు తప్పు చేసినా ఎవరికీ కనిపించదు. కానీ మాది యునిఫారం ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

                అయితే చట్టాన్ని అమలు చేసేటపుడు మరీ మూర్ఖంగా వాస్తవాల్ని విస్మరించి ప్రవర్తించకూడదని నా అభిప్రాయం. ఉదాహరణకి "నేను ఒక రోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక మోటర్ సైకిల్ పై ముగ్గురు మగ వ్యక్తులు ప్రయాణిస్తూ వస్తుంటే మా సిబ్బంది ఆపి నా దగ్గరకు తీసుకు వచ్చారు.  మధ్యలో ఉన్న వ్యక్తికి అనారోగ్యంగా ఉంటే, సమయానికి ఆటో లేదా బస్సు అందుబాటులో లేక వారు అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని ముగ్గురు మోటర్ సైకిల్ పై వైద్యాలయానికి వస్తున్నామని చెప్పారు. నేను పరిశీలించి వారు చెప్పినట్టుగా ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తికి అనారోగ్యం అని నిర్ధారించుకున్నాక వెంటనే పంపించేసాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా మరీ గుడ్డిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు ఇబ్బందులు పడటమే కాక, పోలీసులకు మానవత్వం లేదని అనుకుంటారని నా అభిప్రాయం. 

(మాట కరకుగా ఉన్నంత మాత్రాన ప్రతి పోలీసు మానవత్వం లేకుండా ఏమీ ఉండడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Friday 16 December 2011

డిపార్టుమెంటులో నేను చూసిన మొదటి కరడుగట్టిన పోలీసు అధికారి

ఈ సోదరులు మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారే...
మేము హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ హోదాల్లోని చాలా మంది పోలీసు అధికారులను చూసినా, ట్రైనీలు ఏదైనా తప్పు చేసినపుడు మాపట్ల వారు మరీ ఎక్కువ కరకుగా ఉండేవారు కాదు. ఎందుకంటే మేము డిపార్టుమెంటుకు, క్రమశిక్షణా వాతావరణానికి కొత్త అనే ఉద్దేశ్యంతో మమ్మల్ని విద్యార్థులుగానే పరిగణించేవారు. అయితే మేము జిల్లా ట్రైనింగులో చూసిన ఆర్.ఐ. గారి లాంటి అధికారిని మాత్రం అంతవరకూ మేము చూడలేదు. ఆయన ముఖంలో మేము నవ్వు చూసిన సందర్భాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆయన ఎపుడూ సీరియస్ గా ఉండేవాడు. ఆయనని చూస్తే దాదాపు జిల్లాకేంద్రంలో ప్రతి ఒక్కరికీ భయం మరియు ఆయనతో మాట్లాడాలంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే సిబ్బంది కూడా జంకేవారంటే అతిశయోక్తి కాదు. ఆయన "మావోయిస్ట్"  లను ఎదుర్కొనే శిక్షణలో ఆరితేరి ఉండటం వల్లో ఏమో కానీ ఆయన మాటతీరు, ప్రవర్తన చాలా కటినంగాను మరియు కరకుగాను ఉండేవి. దాంతో మేమంతా ఆయనను "శాడిస్ట్" అని అనుకునేవాళ్ళం.

                 మాకు ట్రైనింగ్ సెంటర్లో 10 కి.మీ. మరియు 3.2 కి.మీ. పరుగు పందెం ఎపుడో నెలన్నరకో లేక రెండు నెలలకో ఒకసారి పెట్టేవారు. అంతే కాక మాకు ఖచ్చితంగా ఇంత టైములోపే పరుగెత్తాలనే నియమం ఉండేది కాదు. కానీ మాకు జిల్లాలో మొదలైన ట్రైనింగులో మాత్రం ఆర్.ఐ.గారు నిర్దేశించిన టైముకు ఏమాత్రం ఆలశ్యంగా పరుగెత్తినా చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్లకి మధ్యాహ్నం మంచి ఎండలో మళ్ళీ 10 కి.మీ. లేదా 3.2 కి.మీ. పరుగెట్టించేవారు. అప్పటివరకు మేము ట్రైనింగ్ సెంటర్లో తండ్రి చాటు బిడ్డల్లా, కోడిపెట్టకింది కోడిపిల్లల్లా ఆడుతూ, పాడుతూ ట్రైనింగ్ చేసిన మాకు, ఆర్.ఐ. గారి వద్ద అంతటి కఠినమైన శిక్షణకు మా శరీరాలు తొందరగా అలవాటు పడలేక పట్టలేనంత ఉక్రోషం ముంచుకొస్తుండేది. 

                  ఒక రోజు 10 కి.మీ. పరుగు పందెంలో మా ట్రైనీలలో కొంతమంది నిర్దేశించిన టైములోపల రాకపోవటంతో, ఆర్.ఐ. గారు వాళ్లకు మధ్యాహ్నం ఎండలో గ్రౌండ్లో పనిష్మెంట్ ఇవ్వమని ఒక హెడ్ కానిస్టేబుల్ (H.C-short form)   ను పురమాయించారు. ఆ H.C గారు వాళ్ళందర్నీ గ్రౌండ్లోకి తీస్కెళ్ళి  ఆర్.ఐ. గారు చెప్పిన విధంగా పనిష్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టారు. అపుడు మా ట్రైనీలలో ఒకతను ఆ పనిష్మెంట్ తట్టుకోలేక నేను చెయ్యనని మొండికేసి ఆ H.C గారికి ఎదురు తిరిగాడు. ఆ విషయం ఆ H.C గారు ఆర్.ఐ గారి దృష్టికి తీస్కేళ్ళడంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరవాత ఆ ట్రైనీకి ఆర్.ఐ. గారు దగ్గరుండి ఇచ్చిన పనిష్మెంట్ కి, అతని మోకాళ్ళు, మోచేతులు రక్తసిక్తం అయ్యాయి. ఆ ట్రైనీ దాదాపు రెండు రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ దెబ్బకి మా ట్రైనీలు జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారు శిక్షణ ఇచ్చిన రెండు నెలల్లో ఏనాడూ ట్రైనింగ్ ఇచ్చే సిబ్బంది ఎవరికీ ఎదురుతిరిగే సాహసం చేయలేదని వేరే చెప్పక్కర్లేదు కదండీ...

                  ఆయన మాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడా అని మాకు అర్థం కాకపోయేది. చివరికి ఒక రోజు S.P. గారు మా దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగినపుడు, ఒక ట్రైనీ ధైర్యం చేసి "ట్రైనింగ్ మరీ కష్టంగా ఉంది సార్" అని చెప్పాడు. దాంతో ఆయన నవ్వి  "మాకు  IPS ట్రైనింగ్ తర్వాత మేము గ్రే హాండ్స్ ట్రైనింగ్ కు వెళితే, ఈ ఆర్.ఐ. గారే అక్కడ మాకు శిక్షణ ఇచ్చారు. అపుడు ఈయన IPS లు కదా అని మమ్మల్నే కనికరించలేదు, ఇక మిమ్మల్ని వదులుతాడా?" అంటూనే, "ఇపుడు మీరు ఎంత కఠినమైన శిక్షణ తీస్కుంటే రేపు మీరు "మావోయిస్ట్" లను అంత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు" అని చెప్పడంతో ఇక మాకు ఆ ఆర్.ఐ. గారిని భరించక తప్పదని అర్థమైంది. అయితే S.P. గారు చెప్పిన విషయాలు నిజమేనని మేము గ్రహించటానికి ఎక్కువ రోజులేమీ పట్టలేదు.

Tuesday 13 December 2011

పెనంలోంచి పొయ్యిలోకి

చెప్పటం తేలికే, చెయ్యటమే మరి కష్టం!
"రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు" అయింది మా పరిస్థితి. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ నుండి జిల్లాకి వెళ్ళినా వారం రోజుల వరకు మాకు జిల్లాకేంద్రంలోనే ఉంచి ఇంటికి కూడా పంపలేదు. మా ఊరు జిల్లాకేంద్రానికి 15 కి.మీ. దూరం లోపునే ఉన్నా నేను కూడా ఇంటికి వెళ్ళలేని విధంగా మాకు తీవ్రమైన ట్రైనింగ్ మళ్ళీ జిల్లాకేంద్రంలో మొదలైంది. దానికంతటికీ మా జిల్లాకేంద్రంలోఉన్న ఒక సాయుధ విభాగాధిపతియే కారణం. రిజర్వు ఇన్స్పెక్టర్ లేదా ఆర్.ఐ. అనేది అతని అధికార హొదా. అతను గ్రే హౌండ్స్ మొదలైనప్పటినుండి దాదాపు 8 సం.లకు పైగా అక్కడ సేవలందించి జిల్లాకు వచ్చాడు. మేము జిల్లాలో అడుగుపెట్టేనాటికి మా జిల్లాలో "మావోయిస్ట్" కార్యకలాపాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మా ఎస్.పి. గారు మావోయిస్ట్ కార్యకలాపాలలో ఎంతో అనుభవజ్ఞుడైన ఆ ఆర్.ఐ. గారికి మమ్మల్ని "మావోయిస్ట్" లను సమర్ధంగా ఎదుర్కొనేలా మమ్మల్ని సన్నద్ధం చేయమని ఆయనకి పూర్తి స్వేచ్చను ఇచ్చారు. దాంతో మా కష్టాలు మూడింతలు అయ్యాయి.

           మేము హైదరాబాద్ ట్రైనింగులో ఉండగా మాకు ఎప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళం. ఎందుకంటే 24 గంటలు క్రమశిక్షణతో, ఉన్నతాధికార్ల అజమాయిషీలో ఉండటం మరియు శిక్షణ ఎపుడు తప్పుతాయా అని అనిపించేది. అది గమనించిన మా ట్రైనర్ మాతో చాలాసార్లు "మీరు వీలైనంత తొందరగా ట్రైనింగ్ అయిపోతే బావుండు, బయటికి వెళ్లి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులే మీరు సంతోషంగా ఉండేది, ట్రైనింగ్ అయిపోయి మీరు విధులలో చేరితే ఇక మీకు అన్నీ బరువు భాద్యతలు, కష్టాలే" అని అనేవాడు. కానీ మాకు అది వింతగా అనిపించేది, ఎందుకంటే ట్రైనింగ్ అయిపోతే మేము స్వతంత్రంగా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన చెప్పింది మాకు అనుభవంలోకి రావటానికి ఎంతో కాలం పట్టలేదు.

              ఇక మాకు ఆర్.ఐ. గారు  మేము జిల్లాకేంద్రానికి వచ్చిన రెండవ రోజునుండే పూర్తి గ్రే హౌండ్స్ తరహా శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ షెడ్యూలుకు మా శరీరాలు అలవాటు పడటానికి మాకు పదిరోజులు పైనే పట్టింది. ఉదయం 0530 గంటలకే మాకు గ్రౌండ్లో శిక్షణ మొదలయ్యేది. మేము ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న 9 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇంతలా కష్టపడింది లేదు. మాకు వారంలో ప్రతి రోజు పొద్దున్నే, ఒక రోజు 10 కి.మీ. పరుగుపందెం 50 ని.లలో పరుగెత్తటం, తరవాతి రోజు అడ్డంకులను అధిగమించటం, మరుసటి రోజు 3.2 కి.మీ. పరుగును వీపుపై 5 కిలోల బరువుతో, చేతిలో తుపాకీతో మరియు కాళ్ళకు స్పోర్ట్స్ బూట్లు కాకుండా "జంగిల్ షూ" అనబడే ప్రత్యేక తరహా బూట్లు వేస్కుని 17 ని.లలో పరుగెత్తటం, ఒక రోజు తుపాకీ పేల్చటంలో శిక్షణ ఇలా ఒక వరుస క్రమంలో 6 రోజులూ ఏదో ఒక శిక్షణ ఉండేది. మాకు రోజులో ఉదయం అల్ఫాహారానికి, స్నానాదికాలకు కలిపి ఒక గంట, మధ్యాహ్నం భోజనానికి గంటన్నర, విరామాలతో రాత్రి 7 గంటల వరకు అలుపెరగని శిక్షణ ఇచ్చేవారు.

              ట్రైనింగ్ సెంటర్లో మా 9 నెలల శిక్షణ కాలంలో నాతో సహా చాలా మంది ట్రైనీలు ఏదో ఒక సందర్భంలో ట్రైనర్లకో, ఇతర సిబ్బందికో ఎదురు తిరగటం లేదా ఏదో ఒక విషయంలో గొడవ పడటమో జరిగాయి. కానీ  మాకు జిల్లాకేంద్రంలో ఆర్.ఐ. గారి వద్ద శిక్షణ మొదలైన వారంలోనే జరిగిన ఒక సంఘటన వల్ల, మేము ఆయన వద్ద తీసుకున్న రెండు నెలల్లో ఏ ఒక్క ట్రైనీ కూడా ట్రైనింగ్ ఇచ్చే సిబ్బందికి ఎదురు తిరగాలని ఆలోచించే సాహసం కూడా చేయలేకపోయారు. 
(ఇపుడు పోలీసు వ్యవస్థలో చాలా మంచి పోలీసు అధికారులు ఉన్నారు, కాబట్టి త్వరలోనే మనం ఇంకా మెరుగైన పోలీసింగ్ చూడగలమని నా అభిప్రాయం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Wednesday 7 December 2011

పట్టరాని ఆనందం కలిగిన రోజు


చాలా బావుంది కదా...
నేను ట్రైనింగులో ఫస్టు వచ్చానన్న విషయం మా ఇంట్లో చెప్పగానే మా అమ్మా, నాన్న ఎంతో సంతోషించారు. "పాసింగ్ అవుట్ పరేడ్" కు ప్రతి ట్రైనీ తల్లితండ్రులు రావచ్చని చెప్పటంతో నేను మా అమ్మా, నాన్నను కూడా ఆ రోజున రమ్మని చెప్పాను. మా "పాసింగ్ అవుట్ పరేడ్" జరిగిన రోజున పొద్దునే ఉదయం 0630 గంటల కల్లా అల్ఫాహారం సేవించి మేము పూర్తి స్థాయిలో తయారై గ్రౌండ్ కు వెళ్ళాము. నన్ను పోలీసు యునిఫారంలో, అది కూడా "పాసింగ్ అవుట్ పరేడ్" సందర్భంగా మేము వేసుకున్న "సెరిమోనియల్ డ్రెస్" లో మొదటిసారి చూసి నా తల్లితండ్రులు చాలా  సంతోషించారు.

                  మా "పాసింగ్ అవుట్ పరేడ్" కు ముఖ్య అతిధిగా అప్పటి రాష్ట్ర "హొం శాఖ" అమాత్యులు వచ్చారు. మేము ఉదయం 0630 గంటలకు గ్రౌండ్ కు వెళ్లితే, ముఖ్య అతిధి వచ్చి పరేడ్ మొదలయ్యేసరికి దాదాపు 0830 గంటలు అయింది. ఎండాకాలం పొద్దున్న కావటంతో మాకు కాళ్ళు లాగటం, కొంతమందికి కళ్ళు తిరగటం మొదలైన సమస్యలు మొదలయ్యాయి. అందుకే ట్రైనీలు వీటన్నిటికి తట్టుకునేలా "పాసింగ్ అవుట్ పరేడ్" కోసం తీవ్రమైన ప్రాక్టీసు చేపిస్తారు. మొత్తానికి ముఖ్య అతిధి రాకతో మా "పాసింగ్ అవుట్ పరేడ్" మొదలైంది. మొదట "పరేడ్ కమాండర్" వెళ్లి ముఖ్య అతిధికి గౌరవవందనం చేయటం మరియు పరేడ్ ను మొదలు పెట్టటానికి అనుమతి కోరటంతో పరేడ్ మొదలు అయింది.

ఈ ఫోటో నాది కాదులెండి, బావుందని పెట్టా...
                   పరేడ్ లో భాగంగా ముందు "పరేడ్ కమాండర్" నడుస్తుండగా, వెనక మొత్తం పరేడ్ లో ఉన్న విభాగాలు అన్నీ ఒక్కొక్కటిగా "స్క్వాడ్ కమాండర్ల" నేతృత్వంలో స్టేజ్ పై ఉన్న ముఖ్య అతిధి ముందు నుంచి కవాతు చేస్తూ వెళుతూ ఆయనకు "గౌరవవందనం" సమర్పించాలి. నాది మొత్తం పది విభాగాలలో మధ్యలో అనగా అయిదవ విభాగం. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు చేసే కవాతు కి అందరూ చప్పట్లతో అభినందించేవారు. మా "పాసింగ్ అవుట్ పరేడ్" వ్యాఖ్యానం కోసం ఒక మహిళా రేడియో వ్యాఖ్యాతను తీసుకు వచ్చారు. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు ఆమె ఆ "స్క్వాడ్ కమాండర్" పేరు చెపుతూ మరియు ఒకవేళ అతని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే చెప్పేది. నా విభాగం వంతు వచ్చినపుడు కొంత టెన్షన్ గా ఉన్నా నేను సరిగానే కమాండ్స్ ఇస్తూ "గౌరవ వందనం" సమర్పించాము. అపుడు ఆ వ్యాఖ్యాత నా పేరు చెపుతూ, నేను ట్రైనింగులో "బెస్ట్ ఆల్ రౌండర్ మరియు బెస్ట్ ఇండోర్ ట్రైనీ" అని చెప్పటంతో చప్పట్లు మరింతగా మోగటం నాకు ఉత్తేజాన్ని కలిగించింది. 

                మొత్తం అన్ని విభాగాలు "గౌరవ వందనం"సమర్పించి మరల తమ తమ స్థానాల్లోకి వచ్చి చేరిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారు మా ట్రైనింగ్ గురించి ఒక రిపోర్ట్ చదవటం, తదుపరి ముఖ్య అతిధి మాట్లాడటం జరిగాయి.  అనంతరం మాతో మా ముందు జాతీయ పతాకం చేబూని కొంతమంది మా ట్రైనీలు కవాతు చేస్తూ వెళుతుండగా, మా ట్రైనీలందరితో ప్రమాణం చేపించారు. తదుపరి ట్రైనింగులో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి  ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందించే కార్యక్రమం మొదలైంది. "బెస్ట్ ఇండోర్ మరియు బెస్ట్ ఆల్ రౌండర్" గా రెండు బహుమతులను  అప్పటి "హొం మంత్రి" చేతుల మీదుగా, వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అందుకుంటున్నపుడు నాకు మాటల్లో చెప్పలేని ఆనందం కలగగా, జనాల్లో ఉండి  ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నా తల్లితండ్రులు ఆనందం వర్ణనాతీతం. నాకు రెండు బహుమతులకు రెండు పేద్ద కప్పులు అంటే 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే కపిల్ దేవ్ కు ఇచ్చారే అంత పెద్ద కప్పులు  ఇచ్చారు. మొత్తం "పాసింగ్ అవుట్ పరేడ్" అయిపోయిన తర్వాత నాతో పాటు బహుమతులు వచ్చిన మరో ట్రైనీతో పాటు మా ప్రిన్సిపాల్ గారు ఫోటోలు దిగాము. మా తల్లితండ్రులు, నేను నాకు వచ్చిన బహుమతులతో మా ప్రిన్సిపాల్ గారితో దిగిన ఫోటో నా జీవితంలో ఎపుడూ కళ్ళముందే గుర్తొస్తుంది. ఇక నాకు వచ్చిన పేద్ద కప్పులతో ఎంతమంది ఫోటోలు దిగారో. 
ప్రతి పోలీసు అధికారి ఈ ప్రమాణం చేసాకే ఉద్యోగం మొదలెడతాడు
                 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని నేరుగా ఇంటికి పంపకుండా మా జిల్లా పోలీసు కేంద్రానికే పంపారు. నేను రెండు రోజుల తర్వాత గానీ ఇంటికి వెళ్ళలేదు. ట్రైనింగ్ సెంటర్ ను వదిలి వెళ్ళేటపుడు చాలా బాధ కలిగింది. అయితే నాకు వచ్చిన రెండు పెద్ద కప్పులు చెరోకటి పట్టుకొని మా అమ్మానాన్న మా ఉరిలో బస్సు దిగి మా ఇంటికి నడిచి వెళ్తుంటే అడగని వారే లేరని నేను ఇంటికెళ్ళాక వాళ్ళు చెపుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ట్రైనింగ్ అయిపోయి జిల్లాకి వెళ్ళినా మా కష్టాలు తీరలేదు. ఎలాగంటే..

(పోలీసు ఉద్యోగంలోని సాధక భాదకాలను మీ బందువులో లేక స్నేహితులో ఎవరైనా పోలీసుగా ఉంటే, వారికి ఎలాంటి బేషజాలు లేకుంటే ఇంకా హృద్యంగా వివరించగలరు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 5 December 2011

పాసింగ్ అవుట్ పరేడ్ లో నా కష్టాలు

ఆపాదమస్తకం బాగుండాలి మరి!
పోలీసు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేసే "పాసింగ్ అవుట్ పరేడ్" లో మొత్తం కవాతును మా ట్రైనీలలో ఎవరైతే "బెస్ట్ ఆల్ రౌండర్" గా ఫస్టు వస్తారో వాళ్ళు చేపించాల్సి వస్తుంది. అతనిని "పరేడ్ కమాండర్" అని పిలుస్తారు. కానీ ప్రాక్టీసు దాదాపు పూర్తి అయిపోయే సమయానికి కానీ మా పరీక్షల ఫలితాలు రాలేదు. అప్పటివరకు మా జిల్లాకే చెందిన ఒక ట్రైనీని "పరేడ్ కమాండర్" గా ప్రాక్టీసు చేపించారు. ఎందుకంటే అతను ఆర్మీలో పని చేసి తదుపరి "ఎక్స్ -సర్వీసుమెన్" కోటాలో తిరిగి కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. సడెన్ గా నేను "బెస్ట్ ఆల్ రౌండర్" గా ఫస్టు రావటంతో ఏమి చేయాలో మా అధికారులకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అప్పటివరకు "పాసింగ్ అవుట్ పరేడ్" ప్రాక్టీసు చేయలేదు మరియు కనీసం చూడలేదు. అలాంటి నన్ను "పరేడ్ కమాండర్"గా నియమించటం సమస్య అవుతుంది. 

                 "పరేడ్ కమాండర్"గా ఏ మాత్రం ప్రాక్టీసు లేని నన్ను నియమిస్తే, నేను సరిగా కమాండ్స్ ఇవ్వక మొత్తం పరేడ్ అభాసుపాలు అవుతుంది. అలాగని "బెస్ట్ ఆల్ రౌండర్" అయిన నన్ను పరేడ్ లో లేకుండా కానీ, పరేడ్ లో ఒక మామూలు ట్రైనీగా ఉంచటానికి కుదరదు. సరే పోలీసు అధికారులంతా ఆలోచించి మొత్తానికి నన్ను "పాసింగ్ అవుట్ పరేడ్" లో ఉండే మొత్తం పది విభాగాలలో మధ్యలో ఉండే విభాగానికి (స్క్వాడ్ అంటారు) నన్ను "స్క్వాడ్ కమాండర్" గా నియమించారు. 

                  ఇక చూడండి నా కష్టాలు, "పాసింగ్ అవుట్ పరేడ్" కు వారం రోజులు గడువు మాత్రమే ఉంది. ప్రాక్టీసు చేసే సిబ్బంది అంతా బాగా చేస్తుంటే నాకు నేను ఏమి చేయాలో, ఏమి కమాండ్స్ ఇవ్వాలో భోదపడేదే కాదు. దాంతో నాకు మరియు మా ప్రాక్టీసు చేపించే అధికారులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. దాంతో ఎంతో అనుభవం ఉన్న మా అవుట్ డోర్ ట్రైనింగ్ అధికారి ఒక పరిష్కారం కనుక్కున్నారు. అదేమిటంటే, నేను నేతృత్వం వహిస్తున్న విభాగానికి అప్పటివరకు "స్క్వాడ్ కమాండర్" గా ఉన్న ట్రైనీని మా విభాగంలో నా వెనకే ఉండేలా నియమించారు. దాంతో అతను ప్రతి కమాండ్ ను వెనక నుండి నాకు ముందే చెప్పటంతో, నేను దాన్ని అనుసరించి కమాండ్స్ చెపుతూ ప్రాక్టీసు ఇబ్బంది లేకుండా చేయగలిగాను. మొత్తానికి మిగిలిన ఆ వారం రోజుల ప్రాక్టీసులోనే "స్క్వాడ్ కమాండర్"గా నా కమాండ్స్ మొత్తం నేర్చుకొని "పాసింగ్ అవుట్ పరేడ్" కు సిద్దమవటంతో మా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

                 ఆ ప్రాక్టీసు చేసిన వారం రోజులు నేను ప్రతి రోజు సాయంత్రం గ్రౌండ్ నుండి రూముకు రాగానే మామగాడ్ని తిడుతుండేవాడ్ని. వాడు నవ్వుతూ "నాకేం తెలుసురా? నువ్వు ఫస్టు వస్తావని, అయినా నేను వద్దురా అంటున్నా వినకుండా ఫస్టు వచ్చావు, రేపు గ్రే హౌండ్స్ కు నిన్ను సెలెక్ట్ చేస్తే కానీ నీకు అర్థం కాదులే" అని అంటుండేవాడు. మేము ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లోనే మా ట్రైనింగ్ సెంటర్ కు గ్రే హౌండ్స్ సిబ్బంది వచ్చి, ఎవరైతే గ్రే హౌండ్స్ విభాగంలో పని చేయటానికి ఇష్టం ఉన్నారో వారినే సెలెక్ట్ చేయటంతో నేను గ్రే హౌండ్స్ కు వెళ్ళకుండా బయటపడ్డందుకు ఆనందించాను. ఇంతలో "పాసింగ్ అవుట్ పరేడ్" జరిగే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏమి జరిగిందంటే...

(రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిపై బలప్రయోగం (ఫిజికల్ ఫోర్సు ఉపయోగించే) చేసే అధికారం ఒక్క పోలీసులకు మాత్రమే, అది కూడా శాంతిభద్రతల పరిరక్షకే ఇచ్చారు.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Wednesday 30 November 2011

ఎంత పని చేసావు మామా?

ఈ కష్టాలు తప్పించుకోవాలనే...

సరే మొత్తానికి నేను మామగాడి సలహాపై "పాసింగ్ అవుట్ పరేడ్" ప్రాక్టీసు నుండి  విజయవంతంగా తప్పించుకోగలిగాను. ఇక నేను, మామగాడు ఇంకా ప్రాక్టీసుకు ఎంపిక కాని మరికొందరు మా విభాగానికి చెందిన వారందరం కలిసి "పాసింగ్ అవుట్ పరేడ్" గ్రౌండ్ ను ఎగుడు దిగుడులు లేకుండా చదును చేయటం లాంటి పనులు చేస్తూ కాలం గడిపేస్తుండే వాళ్ళం. ఇక ట్రైనీలు నిలబడే ప్రదేశానికి మంచి ఎర్రమట్టి కావాలని మేము సిటీకి దూరంగా "నాగార్జున సాగర్-శ్రీశైలం" రోడ్డులో పొలాల్లోకి వెళ్లి మా ట్రైనింగ్ సెంటర్ ట్రక్ లో తీస్కుని వస్తుందే వాళ్ళం. మేము గ్రౌండ్ లోకి వెళ్లి ఎర్రటి ఎండలో మా ఇతర ట్రైనీలు ప్రాక్టీసు చేస్తుండే చూసి "మనం అదృష్టవంతులం, ఈ భాధలు తప్పించుకున్నాం రా" అని సంబర పడేవాళ్ళం. 

                 ఒక ప్రక్క "పాసింగ్ అవుట్ పరేడ్" ప్రాక్టీసు,  మరో ప్రక్క మా పనులు ఇలా జరుగుతూ ఉండగానే సుమారు 15 రోజులు గడిచాయి. ఒక రోజు ఆకస్మాత్తుగా మా పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను ఆ రోజు గ్రౌండ్లో పని చేసి వచ్చి బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాను. ఇంతలో మా విభాగంలోని అనంతపూర్ కు చెందిన ట్రైనీ ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి "పరీక్షల ఫలితాలు వచ్చాయి, నువ్వు వ్రాత పరీక్షలో ఫస్టు వచ్చావు మరియు ఓవరాల్ గా (ఇండోర్ అండ్ అవుట్ డోర్ విభాగాలు రెండింటికి కలిపి) ఆ'ల్ రౌండర్' ఫస్టు వచ్చావు" అని నన్ను పైకి ఎత్తుకున్నాడు. నాకు కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఆ రోజు ఫలితాలు వస్తాయని కూడా ఎవరికీ తెలీదు.

                   నేను ఫస్టు వచ్చానని తెలియగానే మా విభాగం ట్రైనర్, మా విభాగంలో ఉన్న అన్ని జిల్లాలకు చెందిన ట్రైనీలు మరియు ట్రైనింగులో ఇతర విభాగాలలో ఉన్న మా జిల్లాకు చెందిన ట్రైనీలు అందరూ చాలా సంతోషించారు. నేను వ్రాత పరీక్షలో ఫస్టు రావటం ఎవరు ఎలా ఫీల్ అయ్యారో కానీ నేను ఆల్ రౌండర్ గా ఫస్టు రావటం ఒకరికి మాత్రం అసూయను కలిగించింది. ఆయన ఎవరంటే మా ట్రైనింగులో మొదటి విభాగానికి ట్రైనర్ అయిన ASI స్థాయి అధికారి. మిగిలిన విభాలన్నింటికి హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి ట్రైనర్ అయితే అతను మాత్రమే మొదటి విభాగానికి ట్రైనర్ గా ఉండేవాడు. ఆయన నిజంగా చాలా మంచి కవాతు చేస్తారు మరియు మంచి ట్రైనర్ కూడా. ఆయన విభాగంలో అంతకుముందే APSP కానిస్టేబుల్ గా పని చేసి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన ఒక ట్రైనీ ఉండేవాడు. ఆ ASI గారికి ఆ ట్రైనీ ఆల్ రౌండర్ అవుతాడని లేదా కనీసం అవుట్ డోర్ విభాగంలో అయినా ఫస్టు వస్తాడని గట్టి నమ్మకం. కానీ అనూహ్యంగా నేను ఫస్టు రావటం ఆయనకు ఏమాత్రం రుచించలేదు. ఒక రోజు సాయంత్రం ఆయన త్రాగి వచ్చి నేరుగా నాతో "నువ్వెలా ఆల్ రౌండర్ గా ఫస్టు వచ్చావ్ రా?" అని అనడం ఆయన అసూయకు పరాకాష్ట.

              ప్రిన్సిపాల్ గారు మాత్రం నన్ను పిలిచి మనస్పూర్తిగా అభినందించారు. బహుశా ఆయన అంత నిజాయితీగా పరీక్షలు జరిపించి ఉండకపోతే నేను ఫస్టు వచ్చి ఉండేవాడని కాదేమో. నేను ఫస్టు రావటం మాత్రం మా "పాసింగ్ అవుట్ పరేడ్" నిర్వహణ చూస్తున్న అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. ఎలాగంటే...
(ప్రతి చిన్నదానికీ పోలీసులను విమర్శించకుండా ఇంకా మంచి పోలీసింగ్ కొరకు విలువైన సలహాలు ఇస్తే మంచిదేమో...)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 28 November 2011

మళ్ళీ మామగాడు రంగప్రవేశం

ఈ ప్రాక్టీసు కొన్ని వందల సార్లు చేయాలి మరి...
మొత్తానికి పరీక్షలు అన్నీ ప్రశాంతంగా అయిపోయాయి. ఇక మనకి పని ఏమి ఉండదు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండొచ్చు అనుకునేలోగా "మామగాడు" నన్ను మరోమారు హెచ్చరించాడు. ప్రతి పోలీసు ట్రైనింగు అయిపోయాక "పాసింగ్ అవుట్ పెరేడ్" అని జరుగుతుంది, దీన్ని మనం అపుడపుడూ టివిలో చూస్తుంటాము. అనగా ట్రైనింగ్ అయిపోయిన సందర్భంగా ట్రైనీలందరూ కలిసి చేసే కవాతు, మరియు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ట్రైనీలకు బహుమతులు ప్రదానం చేస్తారన్నమాట. ఈ బహుమతులు అందించటానికి మరియు కవాతు గౌరవ వందనం స్వీకరించటానికి ఎవరో ఒక ముఖ్య అతిధి వస్తారు.

                  అయితే ఈ "పాసింగ్ అవుట్ పెరేడ్" కవాతు కోసం కనీసం 15 రోజులనుండి నెల రోజుల వరకు తీవ్రమైన ప్రాక్టీసు ఉంటుంది. మామగాడికి NCC అనుభవం ఉండటం వల్ల వాడికి ఈ ప్రాక్టీసు గురించి ముందే తెలుసు కాబట్టి వాడు నన్ను హెచ్చరించాడు. మా "పాసింగ్ అవుట్ పెరేడ్" ఏప్రిల్ నెలలో జరిగింది కాబట్టి అపుడు ఎండలు బాగానే ఉన్నాయి. మామగాడు నాతో "రేయ్, "పాసింగ్ అవుట్ పెరేడ్" అంటే రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా కష్టపెట్టి ప్రాక్టీసు చేయిస్తారు, ఈ ఎండలలో మనకి అంత కష్టపడటం అవసరమా?" అని హెచ్చరించాడు. నాకూ వాడు చెప్పింది నిజమే అని అనిపించింది. 

                 "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు కోసం మొత్తం అందరు ట్రైనీలను తీసుకోరు. మొత్తం మా ట్రైనింగులో 500 మంది పైగా ట్రైనీలు ఉంటే, ఈ ప్రాక్టీసు కోసం 10 విభాగాలు అనగా 10 * 30 = 300 మంది ట్రైనీలను మాత్రమే తీసుకుంటారు. అందుకని మిగిలిన దాదాపు 200 మంది ట్రైనీలను గ్రౌండ్ ను చదునుగా చేయటం, పరిసరాలను శుభ్రం చేయించటం వంటి వేరే పనులు చేపించేవారు. అందుకని మామగాడు "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసులోకి ఎంపిక కాకుండా ఉందామని పథకం వేసాడు.

           పరీక్షలు అయిపోయిన తర్వాత  ఒక రోజు మా ట్రైనర్ మా విభాగంలోంచి "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు కోసం కొంతమందిని ఎంపిక చేసాడు. మామగాడు ఎత్తు తక్కువగా ఉంటాడు కాబట్టి, వాడు బాగానే కవాతు చేయగలిగినా మా ట్రైనర్ వాడ్ని పక్కకు తీసేసాడు. వాడు బయటికి వెళ్లి నావేపు చూసి నవ్వుతూ "నువ్వూ రా! రా!" అన్నాడు చిన్నగా. నాకు మా ట్రైనర్ కు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నేను ఎత్తుగా ఉండటం మరియు నా మీద మా ట్రైనర్ కు మంచి అభిప్రాయం ఉండటంతో నన్ను ఎంపిక చేసాడు. వెంటనే మామగాడు నా ప్రక్కకు వచ్చి "కాలునొప్పి" అని చెప్పి బయటికి వచ్చేయరా!' అని సలహా ఇచ్చాడు. నేను చిన్నగా మా ట్రైనర్ దగ్గరకు వెళ్లి నాకు కాలు నొప్పిగా ఉంది సార్, నేను ప్రాక్టీసు చేయలేను అని చెప్పాను. ఆయన నావేపు కోపంగా చూసి "అదేం కుదరదు చేయగలిగే వాడూ చేయకుండా తప్పించుకుంటే ఎలా?" అని అన్నాడు. నేను అమాయకంగా ముఖం పెట్టి లేదు సార్ నిజంగానే కాలు బెణికింది, అని అబద్దం చెప్పి మొత్తానికి "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు నుంచి తప్పించుకోగలిగాను. కానీ ఈ ప్రాక్టీసు తప్పించుకొని నేను ఏం కోల్పోయానో నాకు తర్వాత గానీ తెలియలేదు...  

(ప్రజలతో సత్సంబందాలు నెరపనిదే ఏ పోలీసు అధికారీ విజయవంతం కాలేడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Friday 25 November 2011

పరీక్షలు మొదలయ్యాయి.

పరీక్షలు జీవితాంతం తప్పవు కదా?....

మాకు ట్రైనింగ్ మొత్తం కాలం 9 నెలల్లో, 8 నెలల కల్లా కవాతు, ఫిజికల్ మరియు వ్రాత పరీక్షల సిలబస్ పూర్తి చేయించారు మా ప్రిన్సిపాల్ గారు. మాకు మొదట వ్రాత పరీక్షలు నిర్వహించి తదుపరి అవుట్ డోర్ పరీక్షలు నిర్వహించారు. మాకు ట్రైనింగ్ లో ఎవరైనా వ్రాత పరిక్షలలో గానీ లేదా అవుట్ డోర్ పరీక్షలలో గానీ ఫెయిల్ అయితే మరో మూడు నెలలు అదనంగా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో నేను భయపడి నిజాయితీగా కష్టపడి చదవటం మొదలుపెట్టాను. ఈ పరీక్షలు జరిగినన్ని రోజులు మంచిగా చదివి రాయకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతామో అని ఎంత టెన్షన్ పడ్డామో. మొత్తానికి వ్రాతపరీక్షలు బాగా కష్టపడి చదివి వ్రాసాను మరియు ఫెయిల్ కానులే అనే ధైర్యం మాత్రం ఉండేది. అయితే పోలీసు మాన్యువల్ మరియు  ఇంకా వివిధ చట్టాలు కొత్తగా నేర్చుకుంటున్న సబ్జెక్టులు కాబట్టి కొంత టెన్షన్ ఉండేది. వ్రాతపరీక్షలను మా ప్రిన్సిపాల్ గారు చాలా స్ట్రిక్టుగా మరియు నిజాయితీగా జరిపించారు. మామూలుగా అవుట్ డోర్ పరీక్షలకు మాత్రమే వేరే ట్రైనింగ్ కాలేజ్ నుండి "ఇన్విజిలేటర్లు" వచ్చే విధానాన్ని మా ప్రిన్సిపాల్ గారు ఇండోర్ పరీక్షలకు కూడా అమలు చేపించారు.

                వ్రాతపరీక్షలు అయిపోయిన కొద్దిరోజులకు మాకు అవుట్ డోర్ పరీక్షలు అనగా "కవాతు, శారీరక్ష సామర్ధ్యం, తుపాకీ గురి మొదలైన పరీక్షలు" మొదలయ్యాయి. దీన్లో భాగంగా మేము కవాతును మా ట్రైనర్  మాకు ఎలా చేయిస్తాడో, అలా ప్రతి ఒక్కరు ఒకరి తరవాత ఒకరు బయట నిలబడి "కమాండ్స్" చెపుతూ మొత్తం విభాగం చేత కవాతు చేపించాల్సి ఉంటుంది. మా ట్రైనర్ మాకు ఆవిధంగా ముందే నేర్పించినా, మాకు బయటి నుండి "ఇన్విజిలేటర్లు"వచ్చినందున వారి ముందు కవాతును చేపించటం భయంగానే ఉండేది. బయట నిలబడి మిగిలిన విభాగం చేత "కమాండ్స్" ఇస్తూ కవాతు చేపించేటపుడు మరియు విభాగంలో ఉండి కవాతు చేసేటపుడు కూడా మా సామర్ధ్యాన్ని పరీక్షించి మార్కులు వేసేవారు. 

                   నాకు మిగిలిన విషయాల్లో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు గానీ, లాఠీ డ్రిల్ కమాండ్స్ ఇచ్చేటపుడు మాత్రం కొంచెం తడబడ్డాను. దాంతో నేను ఎక్కడ ఫెయిల్ చేస్తారో అని భయపడ్డాను. కానీ నాలాగా చాలామంది తడబడటంతో నేను ఫెయిల్ కానని ధైర్యం కలిగింది. శారీరఖ సామర్ధ్య పరీక్షలు, అడ్డంకులను అధిగమించటంలోను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలిగాను. అయితే ఫైరింగులో ప్రతి ప్రాక్టీసులోను మంచి ప్రతిభ కనపరచిన నేను ఫైనల్ టెస్టులో 25 మార్కులకు గాను, 18 మార్కులు మాత్రమే సాధించటం నన్ను అసంతృప్తికి గురి చేసింది. ఓవరాల్ గా నేను మొత్తం పరీక్షలు సంతృప్తిగానే వ్రాసానని నమ్మకం కలిగింది. అయితే చిన్నప్పటి నుండి నాకు ఏ పరీక్షలోనైనా  నేనే ఫస్టు రావాలనే కోరిక బలంగా ఉంటుండేది. కానీ క్రొత్త ప్రత్యర్థులు, క్రొత్త వాతావరణం, క్రొత్త సిలబస్ కావటం మరియు ఉద్యోగ సంబంధ పరీక్షలు కాబట్టి నేను కేవలం పాస్ అయ్యి బయటపడితే చాలనే ధోరణిలోనే చదివాను. కానీ తప్పకుండా ఫెయిల్ కాకూడదు అనే ధృఢ నిశ్చయంతో చదివి పరీక్షలు వ్రాయటంతో నాకు లభించిన ఫలితం నన్ను ఆశ్చర్య పరిచినా, మిగిలిన వాళ్ళను మాత్రం దిగ్బ్రమకు గురి చేసిందనేది వాస్తవం.

(మంచి పనులు చేసే పోలీసు అధికారులకు ప్రజలు తోడ్పాటును ఇవ్వటం మరి కొంత మంది పోలీసు అధికారులకు ప్రేరణ అవుతుంది)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Monday 21 November 2011

ఇంకా ఏమేం నేర్పారంటే?

తుపాకీని తప్పుగా పట్టుకున్నావేమో బ్రదర్...
మాకు ట్రైనింగులో సాధారణంగా ఉండే దేహధారుడ్య, కవాతు, తుపాకీ పేల్చటం, అడ్డంకులను అధిగమించటం, లాఠీ డ్రిల్ వంటి శారీరఖ శిక్షణతో పాటు మరికొన్ని విషయాలు కూడా నేర్పించారు. అందులో కరాటే గురించి ఇదివరకే చెప్పాను. అయితే మేము ట్రైనింగులో చేరేటప్పటికి మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన శాంతిభద్రతల సమస్య "నక్సలిజం", కాబట్టి మాకు "వామపక్ష తీవ్రవాదం" మీద కూడా శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు, వారి చర్యలు ఏ విధంగా ఉంటాయి, మరియు రాష్ట్రంలో జరిగిన ముఖ్యమైన నక్సలైట్ల హింసాత్మక చర్యలు గురించి చెప్పేవారు. వాటిలో కొన్ని ప్రధాన సంఘటనలు మా సొంత జిల్లాలో కూడా జరిగినట్లు తెలియటంతో నాకు నిజంగా భయం వేసింది. కానీ నాకు మా జిల్లా స్వరూపం కూడా పూర్తిగా తెలియదు, అసలు జిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, జిల్లా సరిహద్దుల గురించి కూడా అవగాహన లేదు. ఎందుకంటే మా ఊరు జిల్లాకు ఒక మూలన, పూర్తి మైదాన ప్రాంతంలో ఉండి, నక్సలైట్ల కార్యకలాపాలకు, అడవికి సుదూరంగా ఉంటుంది. ట్రైనింగులో నక్సలైట్ల ఎత్తుగడలు, పోలీసుల వ్యూహాల గురించి చెబుతుంటే "దొంగా-పోలీసు" ఆటలాగా వినటానికి ఆసక్తిగా ఉన్నా, మనసులోపల భయం కలుగుతుండేది.

                 "అగ్నిప్రమాదాలు" సంభవించినపుడు పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి కూడా మాకు శిక్షణ ఇచ్చారు. దాంట్లో భాగంగా మా ట్రైనింగ్ సెంటర్ కు అగ్నిమాపక సిబ్బంది తమ శకటం ను తీసుకొని వచ్చి గ్రౌండ్ మధ్యలో పెద్ద మంటను వేసి దానిని ఎలా ఆర్పుతారో, శకటం లో నుండి నీటిని ఎలా ఉపయోగిస్తారో ప్రయోగాత్మకంగా చూపించారు. అంతే కాక ఇంకా తాము మంటలను ఆర్పటానికి ఉపయోగించే, కార్బన్ డయాక్సైడ్ సిలిండర్, నురగ సిలిండర్ మొదలైన ఇతర సామాగ్రి గురించి కూడా వివరించారు.

                 ఇవే కాక ట్రైనింగులో ఇంకా "ప్రథమ చికిత్స" గురించి కూడా నేర్పించారు. ఏదైనా విషపురుగు కుట్టినపుడు ఏమి చేయాలి, ఆపస్మారక స్థితి లోకి వ్యక్తి వెళ్ళినపుడు ఏమి చేయాలి, మంటల్లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా కాపాడాలి, నీటిలో పడిన వ్యక్తిని కాపాడిన వెంటనే ఏమి చేయాలి, కరంటు షాకుకు గురైన మనిషిని ఎలా కాపాడాలి వంటి మొదలైన విషయాలు నేర్పించారు. అంతే కాక ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరమైతే "రక్తదానం" చేయాలని, రక్తదానం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తెలియజేసారు. 
                 
                 నా పోలీసు జీవితంలో మొదటిసారి 'అక్టోబర్ 21' "పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం"లో మా ట్రైనింగు సెంటర్ నందు పాల్గొన్నాను. ఆ రోజు మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. అందులో మాట్లాడిన వివిధ వక్తలు పోలీసులో ఉద్యోగ భాద్యతల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉమేష్ చంద్ర, K.S.వ్యాస్ వంటి ప్రముఖమైన పోలీసు అధికార్ల గురించి చెబుతున్నపుడు నిజంగా చాలా ఉత్తేజం కలిగింది. అందుకే ఏనాడూ రక్తదానం చేయని నేను 'అక్టోబర్ 21' "పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం" సందర్భంగా రక్తదానం చేసాను.

                 ట్రైనింగులో ఒకసారి మమ్మల్ని గ్రేహౌండ్స్ సెంటర్ కు తీస్కెళ్ళారు. అక్కడ ట్రైనీలకు ఇస్తున్న శిక్షణ చూసి నిజంగా భయం వేసింది. "బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ ఈ ట్రైనింగ్ నేను చేయను బాబోయ్" అనిపించేలా ఉన్నాయా శిక్షణా పద్దతులు. కానీ అదే "గ్రేహౌండ్స్" ట్రైనింగ్ నేను రెండు సార్లు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మరోసారి మమ్మల్నిSI మరియు DSP లకు శిక్షణ ఇచ్చే "అప్పా" అని పిలవబడే  "ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమి" కు చూపించటానికి తీస్కేళ్ళారు. అక్కడి వాతావరణం, శిక్షణా విధానాలు, సౌకర్యాలు చూసిన తర్వాత నాకు SI కావాలని అంతకుముందు ఉన్న కోరిక మనసులో ఇంకా బలపడింది.

(ఎవరైనా పోలీసులు పని వత్తిడిలో మీ సమస్య సరిగా పట్టించుకోకపోతే నిరాశ చెందకండి, పై అధికారిని కలిస్తే తప్పక మీకు న్యాయం జరుగుతుంది)
 ----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Thursday 17 November 2011

ట్రైనింగులో కరాటే మరియు కోతికొమ్మచ్చి

మాకు ట్రైనింగులో కొద్దిరోజుల పాటు కరాటే నేర్పించే వారు. మొత్తం నలుగురు కరాటే నేర్పే సిబ్బంది వచ్చేవారు. కరాటే క్లాసు ఉన్న రోజు మాకు డ్రిల్ ఉండేది కాదు కాబట్టి మాకు కరాటే క్లాసు ఉందంటే ఆ రోజు సంతోషంగా ఉండేది.  అంతే కాక కరాటే నేర్పే సిబ్బంది బయటి వాళ్ళు కాబట్టి మాపట్ల మా ట్రైనర్ లేదా పోలీసు అధికారుల్లా కఠినంగా ఉండేవాళ్ళు కాదు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి నేర్పాల్సి రావటమో, మరేదో కారణమో కానీ మాకు కరాటే నేర్పే సిబ్బంది పూర్తి అంకితభావంతో నేర్పుతున్నట్టు అనిపించేది కాదు. మాకు కూడా ఏదో కవాతు తప్పించుకున్నామన్న ఆనందమే కానీ నిబద్దతతో నేర్చుకుందామనే ఆలోచన ఉండేది కాదు. 

                  మాకు ట్రైనింగు లో "అబస్టికల్స్ ట్రైనింగ్" (అడ్డంకులను అధిగమించుట) అని ఉండేది. అంటే తాళ్ళు పట్టుకుని ఎక్కడం, ఏదైనా అడ్డంకిని దూకి అధిగమించటం, గాలిలో తాళ్లపై పాకుతూ వెళ్ళటం వంటివి అన్నమాట. నేను చిన్నప్పటి నుండి "కోతి బ్యాచ్" కాబట్టి నాకు అవి చాలా సరదాగా ఉండేవి. "కోతి బ్యాచ్" అంటే మరేం లేదు లెండి మా ఊరి మామిడి తోటల్లో "కోతికొమ్మచ్చి" ఆటలు ఆడేటపుడు అంత ఎత్తు నుండి అమాంతం దూకటం, ముళ్లు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా చెట్టు ఎక్కి గుబ్బకాయలు (కొన్ని జిల్లాల్లో చీమచింత కాయలు అంటారేమో) కోసుకోవటం, చేలలో ఉన్న బావి ప్రక్కనే ఉండే మోటర్ గది పైనుండి నీళ్ళలో గభాలున దూకటం, తాటి చెట్టును వట్టి చేతులతో ఎక్కి దాని మట్టకి ఉండే రంపపు పళ్ళతో తాటి గెలలను ఓపికగా కోయటం వంటి మొదలైన అంశాలలో నాకు భాగానే ప్రావీణ్యం ఉందిలెండి. ఇవన్నీ చేసి వచ్చాక సాయంత్రం అమ్మా, నాన్నచేసే బడితెపూజ కూడా ఉండేదిలెండి. 

                  అందుకే నేను కొంచెం "అతివిశ్వాసం" తోనే "అబస్టికల్స్ ట్రైనింగ్" ను చేసేవాడ్ని. అయితే ఈ ట్రైనింగులో తమాషా ఏమిటంటే ఎవరైనా ట్రైనీ ఒకసారి ఏదైనా అడ్డంకిని అదిగమించేటపుడు ఎదురు దెబ్బ తగిలిందంటే ఆత్మవిశ్వాసం కోల్పోవడమే కాక మరోసారి చేసేటపుడు ఫెయిల్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తన ఎత్తున్న గోడను దాటగల ట్రైనీ, ఏదైనా కారణం చేత ఒకసారి దాటలేకపోతే తరవాత ప్రతిసారి ఇబ్బంది పడటం జరుగుతుంది. అదేమాదిరిగా, ట్రైనింగులో చాల రోజులపాటు ఈ ట్రైనింగ్ అంతా బాగా చేసిన నేను, ఒకరోజు మాత్రం "హార్స్" అని పిలువబడే అడ్డంకిని అదిగమించేటపుడు మోకాలు దానికి తగిలి క్రింద పడిపోవటంతో చాలా రోజులపాటు దాన్ని అదిగమించేటపుడు భయపడేవాడిని అనేది వాస్తవం.  

(పోలీసులకు ఎవరి మీదా వ్యక్తిగత రాగ,ద్వేషాలు ఉండవు. ఎందుకంటే ఏ పోలీసు అధికారీ సాధారణంగా తన స్థానిక ప్రదేశంలో ఉద్యోగం చేయడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Wednesday 16 November 2011

"వెనక బెంచీ బ్యాచ్" లో నేనెలా చేరానంటే!

ఇది మా క్లాసు కాదు లెండి.
ముందే చెప్పినట్టు నా ట్రైనింగ్ మొత్తమ్మీద కూడా మామగాడు నన్ను  చాలా విషయాల్లో ప్రభావితం చేసాడు. నాకు అంతకు ముందు పోలీసు వ్యవస్థ మీద ఎలాంటి అవగాహన లేకపోవటం, వాడికి NCC పూర్వ అనుభవం ఉండటం వల్ల నేను వాడి మాటలకు విలువ ఇచ్చేవాడిని. మా ట్రైనింగులో మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గోదావరి, అనంతపురం, మరియు కడప జిల్లాలకు చెందినా ట్రైనీలు ఉండేవారు. అయితే మామగాడు మా జిల్లావాసి కావటం, నా విభాగం లోనే ఉండటంతో నేను వాడి మాటలతో బాగా ప్రభావం అయ్యాను. వాడు ట్రైనింగ్ మొత్తమ్మీద ఒక్కరోజు కూడా తన పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది లేకపోగా, నన్ను కూడా ప్రతి క్షణం హెచ్చరిస్తుండే వాడు.

                   నా విద్యార్థి దశలో నేను ఎపుడూ వెనుక బెంచీలో కూర్చున్నది లేదు, క్లాసు ఫస్టు రావటంలో రాజీ పడింది లేదు. అలాంటి నేను మామగాడి మాటలతో ట్రైనింగులో క్లాసులకు వెళ్ళినపుడు వెనుక బెంచీలోనే కూర్చోవటానికి అలవాటు పడ్డాను. వెనుక బెంచీలో కూర్చొని, పాఠాలు చెప్పే లెక్చరర్ (SI or CI స్థాయి అధికారి లెండి) కనుసన్నలలో నుండి దూరమవటంతో క్రమంగా నేను పాఠాల మీద శ్రద్ధ తగ్గించుకోవటం మొదలైంది. అంతే కాకుండా పొద్దున్న విపరీతంగా అలసిన శరీరం అల్ఫాహారం తిని క్లాసులకు రాగానే వెనుక బెంచీలో ఉండటం వల్ల విశ్రాంతి కోరుకోవటంతో క్రమంగా క్లాసులలో నిద్రపోవటం అలవాటైంది. అయితే మేము నిద్రపోయేటపుడు మాత్రం, మాకు మా వెనక బెంచీలో కూర్చున్నా నిద్రపోని వ్యక్తిని లెక్చరర్ మా వైపు వస్తే లేపమని కాపలా ఉండమనేవాళ్ళం. ఎందుకంటే క్లాసులో నిద్రపోయామని లెక్చరర్ ఫిర్యాదు చేస్తే గ్రౌండ్లో తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది మరి.

                  మా లెక్చరర్ లలో ఒక చాదస్తపు ముసలాయన(SI  స్థాయి అధికారి) ఉండేవాడు. ఆయన క్లాసుకు వస్తేనే,  వెనక బెంచీలో కూర్చొనే వాళ్ళను ముందు బెంచీల్లోకి, ముందు బెంచీల్లో వాళ్ళని వెనక బెంచీల్లోకి కూర్చోమనేవాడు. దాంతో ఆయన క్లాసు ఉందంటే మేము మామగాడి  సలహాపై, ముందే లేచిపోయి మధ్య బెంచీల్లో కూర్చునేవాళ్ళం. మిగతా లెక్చరర్ల క్లాసుల్లో మాత్రం మేము వెనక బెంచీల్లోనే కూర్చోవటం వల్ల, మేము  మామగాడి ప్రభావంతో "వెనక బెంచీ బ్యాచ్" గానే గుర్తింపు పొందాము. అయితే నేను వెనక బెంచీల్లో కూర్చున్నా నాకు పోలీసు మాన్యువల్, చట్టాలు మరియు మాకు పాఠాలు చెప్పే పోలీసు అధికారుల అనుభవాలు కొత్తగా మరియు ఆసక్తిగానే ఉండి పడుకోకుండా ఉన్నపుడు మాత్రం పూర్తి శ్రద్దతోనే వినేవాడిని. ఎపుడూ వెనక బెంచీలో కూర్చొని నిద్రపోయే ట్రైనీ, ట్రైనింగులోనే వ్రాత మరియు ఓవరాల్ గా ఫస్టు వస్తే షాక్ కదూ... (వెయిట్ అండ్ రీడ్) 

(నేరం జరుగున్న విషయం తెలిసీ మనం నిర్లిప్తత ప్రదర్శిస్తే, ఒక్కోసారి దానికి మనం కూడా బలి కావచ్చు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Tuesday 15 November 2011

పోలీసు కటింగ్ తో నేను ఇంటికెళ్ళినపుడు!

ట్రైనింగ్ మొదలైన కొద్దిరోజులకు మా డిగ్రీ ఫైనలియర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. దేవుడి దయ వల్ల నేను ఫెయిలవుతానని భయపడిన పేపర్ కూడా పాస్ అయ్యి, మొత్తమ్మీద మొదటి తరగతిలో ఉత్తీర్ణున్నయ్యాను. తర్వాత కొద్దిరోజులకు మాకు దసరా సెలవులకు ఇంటికి పంపించారు. నాకు ఇంటికి వెళ్తున్నానన్న ఆనందం ఒకవైపు ఉన్నా మరో ప్రక్క నా పోలీసు కటింగ్ తో వెళ్ళాలంటే కొంత సిగ్గుగానే అనిపించేది. ట్రైనింగ్ సెంటర్లో మంగలి వాళ్ళు తక్కువమంది ఉండటం, ట్రైనీలు వందల సంఖ్యలో ఉండటం వల్ల ఒక్కో మంగలి దాదాపు వందమంది వరకు కటింగ్ చేయాల్సి వచ్చేది. అందుకని మేము తల అతని చేతిలో పెట్టటమే ఆలశ్యం అన్నట్లు బరబరా జుట్టు క్రింది భాగం నుండి పై వరకు రెండు అంగుళాల వెడల్పుతో మిషన్ తో అంట కత్తెర వేసేవాడు. మాకు ట్రైనింగుకు వచ్చిన కొత్తలో పోలీసు కటింగుతో బయటికి వెళ్ళాలంటే సిగ్గు అనిపించినా క్రమంగా అలవాటు అయిపోయింది. కానీ మొదటిసారి ఊరికి వెళ్ళాలంటే కొంచెం బిడియంగానే ఉండేది. అయితే నా కటింగ్ నాకు ఏమీ అనిపించకపోయినా కొంతమంది ఇతర ట్రైనీల కటింగ్ చూస్తే వింతగా ఉండి తమాషాగా అనిపించేది.
    
                 నేను హైదరాబాదులో బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. పొద్దున్నే లేచి ఇంట్లోంచి బయటికి వచ్చేసరికి మా వీధిలో వాళ్ళు "ఎపుడొచ్చినావు ____ (నా పేరు)? బాగా బక్కగా అయినావే" అంటూ పలకరిస్తున్నా వాళ్ళ చూపులు నా తలవేపే ఉండటం మాత్రం నేను గమనిస్తూనే ఉన్నా. కొంతమంది ఆడవాళ్ళు నా తలవేపు చూసి పక్కకు తిరిగి నవ్వుకోవటం, పిల్లలు నా వేపు చూస్తూ నవ్వటం చూసి కొంత సిగ్గు అనిపించింది. రెండు మూడు రోజుల వరకు నేను కొంత సిగ్గు పడినా క్రమంగా నాకు మరియు మా ఊరివాళ్ళకు కూడా నా పోలీసు కటింగ్ అలవాటైపోయింది. ట్రైనింగ్ లో ఒకసారి లాంగ్ రన్ నిమిత్తం మమ్మల్ని బయటికి దిల్ సుఖ్ నగర్ వైపు తీస్కేళ్లినపుడు నా డిగ్రీ క్లాస్ మేట్ ఒకమ్మాయి కనపడితే ఆమెకు కనపడకుండా తప్పించుకున్న విషయం కూడా గుర్తుంది.

             ట్రైనింగ్ కు వచ్చిన కొత్తలో పోలీసు కటింగ్ తో తెలిసిన వారికి కనిపించాలంటే  కొంత సిగ్గు పడినా, ప్రస్తుతం ఏ మాత్రం కొంచెం జుట్టు పెరిగినా వెంటనే అంట కత్తెర వేయించుకునే విధంగా మారిపోయాను. పొద్దున్న నుండి రాత్రి వరకు తలలోంచి చెమటలు కారేలా కష్టపడే ట్రైనింగులో నిజంగా జుట్టు ఆ విధంగా కత్తిరించక పోతే చాలా చిరాకుగా ఉంటుంది. తలంతా చెమటలు పట్టినా జుట్టు తక్కువగా ఉండటం వల్ల చల్లగా ఉండేది. కాబట్టే ట్రైనింగులో జుట్టు అంట కత్తెర వేయిస్తారు. ఇపుడు డ్యూటీలో కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు తలపై టోపీ పెట్టుకుని ఉండాలంటే జుట్టు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పోలీసు కటింగ్ అనేది యువతకు కూడా ఫ్యాషన్ అయిపోయిందనుకోండి.

(పోలీసు అధికారులు కూడా ఒక్కోసారి తప్పుచేయకున్నా ఇబ్బందులు పడవచ్చు, సహృదయంతో అర్థం చేస్కోండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

Sunday 13 November 2011

నా మొదటి ఫైరింగ్ ప్రాక్టీసు అనుభవాలు

తుపాకీ చేతిలో ఉంటే ఆయుధం. ఒక్కోసారి అదే శత్రువు కూడా కావచ్చు
మాకు ఆర్మ్స్డ్ డ్రిల్ నేర్పిస్తూనే మరో ప్రక్క మాకు తుపాకీని భాగాలుగా విడదీయటం మరియు బిగించటంను నేర్పిస్తుండేవారు. తుపాకీలో ఏ భాగాన్ని ఏమని పిలుస్తారు, ఏ భాగం ఏ పని చేస్తుంది మరియు తుపాకీని ఏ విధంగా ఉపయోగిస్తారు మొదలైన విషయాలు వివరించేవారు. తుపాకీని ఎంత తక్కువ సమయంలో భాగాలుగా విడదీసి, మళ్ళీ బిగిస్తారో అని ట్రైనీల మధ్య పోటీ పెట్టేవారు. తుపాకీని ఉపయోగించేటపుడు అది ఏ ఏ కారణాల వల్ల మొరాయిస్తుంది, తిరిగి ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలి అనేది కూడా నేర్పేవారు. ఫైరింగ్ ఎలా చేయాలో చాలా కఠినమైన ప్రాక్టీసు చేపించేవారు. ఎందుకంటే ఫైరింగ్ లో భాగంగా గుండు(రౌండ్ or బుల్లెట్) అనుకున్న చోట మనం ఫైర్ చేయగలగాలంటే అకుంఠితమైన ఏకాగ్రత, దీక్ష మరియు చాలా ఓపిక అవసరం. అందుకే ఏకాగ్రత మరియు ఓపిక పెరగటం కోసం తీవ్రమైన ప్రాక్టీసు ఉండేది. 

              బయట గ్రౌండ్ లోనే కాకుండా సిమ్యులేటర్ రూము నందు కూడా ఫైరింగ్ ప్రాక్టీసు చేపించేవారు. శారీరఖంగా మంచి బలిస్టుడైనంత  మాత్రాన అతను మంచి ఫైరర్ కానవసరం లేదు. ఎందుకంటే తుపాకీని అనుకున్న చోట కాల్చాలంటే పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉండాలి. అయితే మాకు శిక్షణలో చెప్పిన దాని ప్రకారం తుపాకీ ఫైరింగులో ప్రాథమిక సూత్రం ఏమిటంటే "తుపాకీకి మిత్రులు, నీవాళ్ళు లేదా నావాళ్ళు అని ఉండదు, ఏ మాత్రం పొరబాటు చేసినా నీ తుపాకీనే నీప్రాణం తీయొచ్చు".

                 కొద్దిరోజులకు మాకు ఫైరింగ్ ప్రాక్టీసు చేసే గ్రౌండ్ కు తీసుకు వెళ్ళారు. అది చుట్టూ కొండలు ఉండి, ఒక వేళ ప్రమాదవశాత్తూ  ఎవరైనా ప్రజలు ఆ పరిసరాల్లోకి వచ్చినా ప్రమాదం కలుగకుండా ఉంది. ఒకవేళ ప్రజలు ఎవరైనా వచ్చినా ముందే గుర్తించి హెచ్చరించేలా కొంతమందిని చుట్టుపక్కల కాపలాగా ఉంచారు. మొదటిసారి కాబట్టి మాకు తుపాకీలలో క్రింది తరగతికి చెందిన దానితో ఫైరింగ్ చేపించారు. ప్రతి ఒక్క ట్రైనీకి ఐదు రౌండ్లు కాల్చటానికి అనుమతి ఇచ్చారు. నా ముందు వాళ్ళు వెళ్లి ఫైరింగ్ చేస్తుంటే నా వంతు ఎపుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసాను. అయితే మాకు ట్రైనింగ్ లో "మీరు తుపాకీని భుజంపై ఆశ్రద్దగా పట్టుకుంటే ఫైర్ చేసిన తర్వాత అది వెనక్కి వచ్చి మీ కాలర్ బోన్ ను గుద్దుకొని ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉందని" హెచ్చరించారు. అందువల్ల ఫైరింగ్ చేయాలంటే కొంచెం భయంగా కూడా ఉండేది. అయితే మాకు ముందుగా 50 మీ. దూరం నుండి చెక్కతో తయారు చేసిన 4/4 మీ. లక్ష్యం మీద ప్రాక్టీసు చేపించారు. నా వంతు వచ్చినపుడు వెళ్లి నేలపై పడుకొని తుపాకీని భుజంపై తీసుకోగానే చాలా ఆందోళనగా అనిపించింది. కానీ అది క్రింది తరగతి తుపాకీ అయినందున కాల్చిన తర్వాత పెద్దగా భుజం పై వత్తిడి కలిగించలేదు మరియు పెద్దగా శబ్ధం కూడా చేయలేదు.
                
              అయిదు రౌండ్లు పది సెకన్లలోపలే అయిపోవటంతో కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం. అయితే ఉద్యోగంలో (జీవితంలో) మొదటిసారి ఫైరింగులో ఐదు రౌండ్లకు, 25 మార్కులకు గాను 20 మార్కులు తెచ్చుకోగలిగాను. మరియు మొదటిసారి నిజమైన తుపాకీని కాల్చిన అనుభవం చాలా సంతోషాన్ని కలిగించింది. 

(పోలీసులు శాంతిభద్రతలు కాపాడేటపుడు జరిగే పొరబాట్లతో డిపార్టుమెంటును అపార్థం చేస్కోకండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      

Thursday 10 November 2011

ట్రైనింగ్ సెంటర్ లో అలరించిన సినీ తారల సందడి.


మా ట్రైనింగ్ మొదలైన కొద్ది నెలలకు మాకు "లాఠీ డ్రిల్" మొదలైంది. అంటే మనం తరచుగా వార్తల్లో వినే "లాఠీ చార్జ్" కు సంబందించినది. ఈ డ్రిల్ లో భాగంగా మాకు శాంతిభద్రతలను కాపాడుటలో భాగంగా "లాఠీ చార్జ్" చేయవలసిన అత్యవసర పరిస్తితులలో ఏ విధమైన పద్దతులను అనుసరించాలి, చట్టంలో మరియు పోలీసు మాన్యువల్ నందు "లాఠీ చార్జ్"  కు సంబంధించి నిర్దేశించిన పద్దతులను తెలియజేసేవారు. మేము "లాఠీ డ్రిల్" ను నేర్చుకునే రోజుల్లోనే మా ట్రైనింగ్ సెంటర్ కు విప్లవ సినిమాలు తీసే R.నారాయణమూర్తి తన సినిమా షూటింగ్ నిమిత్తం (సినిమా పేరు గుర్తులేదు) వచ్చాడు. 
   
             అప్పటికి నేను నేరుగా ఏ సినిమా నటుడిని చూడలేదు, అందుకని ఆయన్ని చూడగానే కొత్త అనుభూతి కలిగింది. ఎందుకంటే అప్పటికి "చీమలదండు" , "దండోరా"  "ఎర్రసైన్యం" వంటి ప్రజాదరణ పొందిన ఆయన చిత్రాలు చూసి ఉండటం వల్ల ఆయన సినిమా షూటింగ్ అనగానే అందరమూ ఆసక్తిగానే ఉన్నాము. మా "లాఠీ డ్రిల్" బాక్ గ్రౌండ్ లో కనిపించేలా ఆయన ఒక పాట చిత్రీకరించారు. పాట చిత్రీకరణలో భాగంగా ఆయన హావభావాలు చూసి నాకు భలే ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఎదురుగా తనకు కోపం వచ్చే ఎలాంటి దృశ్యం లేకుండానే "రక్త నాళాలు చిట్లిపోతాయేమో అనిపించేంత కోపాన్ని, ఆవేశంతో ముఖం జేవురించినట్లు" హావభావాలు ప్రదర్శిస్తుంటే వింతగా ఉండేది. కానీ కట్ అనగానే ఆ ఆవేశాన్నంతా వదిలేసి మామూలుగా నవ్వు ముఖం పెట్టేవారు. దాదాపు నాలుగైదు రోజులపాటు పాట చిత్రీకరణ జరిగింది.

            తరువాత కొన్ని చిన్న చిన్న సినిమాల చిత్రీకరణ మా ట్రైనింగ్ సెంటర్ మరియు దాని ప్రక్కనే ఉన్న "పోలీసు శునకాల శిక్షణా కేంద్రం" (ట్రైనింగ్ ఫర్ పోలీసు డాగ్స్) నందు జరిగాయి. అయితే కొద్దిరోజులకు మా ట్రైనింగ్ సెంటర్ కు సినీ నటి మరియు తెలుగు చిత్రసీమ అగ్రహీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున గారి భార్య అమల గారు "బ్లూ క్రాస్" సొసైటీ తరపున వచ్చారు. ఆమె మా ట్రైనీలందరినీ సమావేశపరిచి "జంతువుల పట్ల కారుణ్యం కలిగి ఉండాలని మరియు జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం  కఠినంగా  వ్యవహరించాలని కోరారు. మాకు ఆమె చెప్పేది ఏమీ బుర్రకి ఎక్కకపోయినా సినిమా హీరోయిన్ ను దగ్గరి నుండి చూసామని ఆనందపడ్డాము. 

                  తరవాత డ్యూటీ లో భాగంగా వెంకటేష్, జు.ఎన్టీయార్, మొదలైన  ఎంతో మంది పెద్ద హీరోల చిత్రాల షూటింగ్ లకు ఎన్నింటికో దగ్గరుండి రక్షణ కల్పించిన నాకు, మొదటిసారి చూసిన R.నారాయణమూర్తి సినిమా షూటింగ్ అంత అనుభూతి కలగలేదు.
(పోలీసు-ప్రజా సంబందాలు మెరుగైనపుడే ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు దొరుకుతాయి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.


----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      

Wednesday 9 November 2011

తొలిసారిగా నేను తుపాకీ చేతపట్టిన క్షణాలు

మనకి కనిపించే ఈ అందమైన డ్రిల్ వెనక కఠోరమైన ప్రాక్టీసు ఉంటుంది.
ట్రైనింగ్ కు వెళ్ళినప్పటినుండే నాకు "తుపాకీని ఎపుడు చూస్తానా! ఎపుడు చేతిలోకి తీస్కుంటానా!  ఎపుడు ఫైర్ చేస్తానా!" అని ఉత్సుకతగా ఉండేది. అయితే వెళ్ళిన కొద్దిరోజులకి మాకు 3.2 కి.మీ. పరుగు పందెంలో చెక్క తుపాకీ చేతికి ఇచ్చినపుడు తాత్కాలిక ఆనందం కలిగినా నిజమైన తుపాకీని పట్టుకోవాలని మనసు ఆరాటపడుతుండేది. నాకే కాదు మాలో చాలా మందికి అదే ఆత్రుత ఉండేది. అందుకే కొంతమంది ధైర్యం చేసి మా ట్రైనర్ ను "మాకు తుపాకీ ఎపుడు చేతికి ఇస్తారు సార్? ఫైరింగ్ ఎపుడు చేపిస్తారు?" అని అడిగారు. దానికి ఆయన నవ్వి "------ రాగానే సంబరం కాదు" అని ఒక మోటు సామెత చెప్పి, 'ఇపుడేమో ఎపుడు చేతికి తుపాకీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు, మీకు చేతికి ఇచ్చాక ఎపుడు ఇది మమ్మల్ని వదిలి పెడుతుందా అని అనుకుంటారు' అని అన్నాడు. ఎంతోమంది మాలాంటి వాళ్ళని చూసిన అనుభవంతో ఆయన చెప్పిన మాటలు అపుడు మాకు అర్థం కాలేదు.
      
                    కొద్దిరోజుల తర్వాత మాకు "ఆర్మ్స్ డ్రిల్" అనగా తుపాకీతో చేసే డ్రిల్ మొదలైంది. తొలిసారి తుపాకీని చేతిలోకి తీస్కున్నాక , ఏదో తెలియని ఆనందం మనసుని ఆవహించింది. కొద్దిరోజుల వరకు ఆ అనుభూతి మనసులో అలాగే ఉండిపోయింది. అయితే రోజూ పొద్దున్నే నేరుగా గ్రౌండ్ కి వెళ్ళే మేము "ఆర్మ్స్ డ్రిల్" మొదలైన రోజునుండి, ఆయుధాగారానికి వెళ్ళి తుపాకీ తీస్కోని వెళ్ళటానికి 15 నుండి 20 నిమిషాలు ముందుగా బయలుదేరాల్సి వచ్చేది.  డ్రిల్ అయిపోయిన తర్వాత ఆయుధాగారానికి వెళ్ళి తుపాకీ డిపాజిట్ చేసి  వెళ్ళటానికి మరో 15 నుండి 20 నిమిషాలు సమయం తీస్కునేది. దాంతో మా రెస్ట్ సమయం కొంచెం తగ్గిపోయింది. ఇక మాకు "ఆర్మ్స్ డ్రిల్" లో భాగంగా డ్రిల్ లో ఎక్కువ సమయం తుపాకీ  మా భుజం పైనే ఉండేది. దాంతో కొద్దిరోజుల వరకు భుజం మరియు చేతులు తీవ్రంగా నొప్పి పెడుతుండేవి. ఎపుడు భుజం మీద నుండి తుపాకీని క్రిందకు  దింపుతామా అని మేము ఎదురు చూస్తుండే వాళ్ళం. కానీ మా ట్రైనర్ మాకు అలవాటు  కావాలని ఎక్కువ సమయం భుజం పైనే తుపాకీని ఉంచేవాడు.  అపుడు కానీ మాకు మా ట్రైనర్ ఎందుకు మమ్మల్ని తుపాకీ కోసం తొందర పడొద్దని చెప్పాడో అర్థం కాలేదు. 
   
             కొద్దిరోజులకి మాకు తుపాకీని భుజంపై మోయటం అలవాటైపాయింది. దాంతో మళ్ళీ మాలో కొందరు "మాకు ఫైరింగ్ ప్రాక్టీసు ఎపుడు చేపిస్తారు సార్?" అని అడగటం మొదలు పెట్టారు. అపుడు మా ట్రైనర్ "నేను మీరు తుపాకీ అడిగిన రోజే చెప్పా తొందరపడొద్దని, మళ్ళీ మీకు అదే తొందర" అని సున్నితంగా హెచ్చరించాడు. తర్వాత మాకు తుపాకీతో ఫైరింగ్ చేపించటానికి చాలా కటినమైన ప్రాక్టీసు చేపించేవారు. ఆ ప్రాక్టీసు ఎంత కటినంగా ఉన్నా మాకు మాత్రం ఎపుడు ఆ తుపాకీతో ఫైరింగ్ చేస్తామా అని చాలా ఆసక్తిగా ఉండేది. ట్రైనీలు ఎవరైనా తుపాకీ క్రింద పడేయటం లేదా తుపాకీ పట్ల ఏ విధంగా అయినా ఏమాత్రం అశ్రద్ధ చూపినా చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి.  డ్రిల్ కు ముందు మరియు తర్వాత తుపాకీని శుబ్రంగా తుడవాలి. అందుకే తుపాకీ చేతిలోకి తీస్కున్న తర్వాతగానీ దాని పట్ల మా భాద్యతలు, ప్రవర్తించాల్సిన విధానం తెలిసి వచ్చింది. ఎందుకంటే తుపాకీతో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన మరియు మన తోటివారి ప్రాణాలకే ప్రమాదం. 

(పోలీసుల సేవలను ప్రజలు గుర్తించినపుడే వారు పడే కష్టానికి సార్థకత చేకూరుతుంది.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      

Monday 7 November 2011

పోలీసు ఉద్యోగం వరమా శాపమా?

పోలీసు ఉద్యోగం గురించి దాదాపు సమాజంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే పోలీసులు బాగా కరకుగా ఉంటారు, చెడ్డవాళ్ళు. అదే సమయంలో పోలీసు ఉద్యోగం చాలా కష్టమైన డ్యూటీ అని కూడా దాదాపు ప్రజలందిరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యోగం తెచ్చుకోవటమే కష్టమైతే, దాదాపు సంవత్సరం పాటు కఠినమైన శిక్షణ తీసుకోవాలి. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి, మన అభిప్రాయం చెప్పటానికి, అమలు పరచటానికి వీలు ఉండదు. ఎదురు మాట్లాడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎప్పుడు ఏ రూపంలో తీవ్రవాద, ఉగ్రవాద వంటి అసాంఘిక శక్తులు విరుచుకుపదతాయో, ప్రాణాలను బలిగొంటాయో తెలియదు. ఎప్పుడూ విధి నిర్వహణలో రాజకీయ, సామాజిక మరియు ఇతర రూపాల్లో తీవ్రమైన వత్తిళ్ళు. మిగిలిన ఉద్యోగాల్లా ఒక వేళా పాళా ఉండవు, 24 గంటలూ విధులు నిర్వహించాలి. పండుగలు, పెళ్ళిళ్ళు ఇంకా ఇతర శుభకార్యాల సమయంలో కూడా బందువుల ఇండ్లకు వెళ్ళటానికి వీలు దొరకదు. ఇంత కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నా చాలీ చాలని జీతాలు, సమాజంలో సరైన గుర్తింపు లేకపోవటం. ఇలాంటి పరిస్తితులలో పోలీసు ఉద్యోగికి పిల్లను ఇవ్వాలన్నాఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. మరి ఇంతటి తీవ్రమైన పరిస్తితులలో చేస్తున్న పోలీసు ఉద్యోగం వరమా ? శాపమా?...

             మాకు ట్రైనింగ్ లో ఏదో ఒక సందర్భంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పోలీసు ఉద్యోగం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అపుడు మా ట్రైనీ ఒకతను "పోయిన జన్మలో పాపాలు చేసిన వాళ్ళు, దానికి శిక్ష అనుభవించటానికి ఈ జన్మలో పోలీసుగా ఎంపికవుతారని" సరదాగా చెప్పాడు. అపుడు దైవభక్తి మెండుగా ఉన్న ఆయన మాతో  "పోలీసు ఉద్యోగం గురించి సమాజంలో చాలా దురభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం చేసే ఉద్యోగాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి, నీకు భ్రుతిని కల్పిస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించు" అని. అంతే కాకుండా "పోలీసు ఉద్యోగం చాలా పవిత్రమైన ఉద్యోగం, మనం దేవుని దూతలం" అని అన్నాడు. మాకు అర్థం కాలేదు, అపుడు ఆయన మళ్ళీ ఇలా చెప్పాడు. " మనిషికి కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అయితే ధర్మం అంతో ఇంతో ఉన్న కాలాల్లో దేవుడు ప్రత్యక్షంగా వచ్చి దీనార్తులను కాపాడేవాడు. కానీ పాపాలు పెరిగిపోయిన నేటి కలికాలంలో మనుషులు కష్ట కాలాల్లో ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్తిస్తుంటారు, అయితే దేవుడు ప్రత్యక్షమై వాళ్ళని కాపాడినట్టు మనం ఎపుడూ వినలేదు. దేవుడికి తాను వచ్చేందుకు ఇష్టం లేదు కనుక తన ప్రతినిధులుగా కష్టం వస్తే ప్రజలను ఆదుకోమని "పోలీసులను" నియమించాడు అని చెప్పాడు. 
                
         ఆ అధికారి చెప్పింది వాస్తవ దూరంగా ఉన్నా ప్రజలకు తాము కష్టాల్లో ఉన్నపుడు మొదట గుర్తుకు వచ్చేది మాత్రం పోలీసు అనేది నిజమే కదా. ఉదాహరణకు మనం చెన్నై కు ఏదో పని మీద వెళ్ళాం, అక్కడ మనకంటే  బలాడ్యుడైన ఒక వ్యక్తి అకారణంగా మనతో గొడవ పెట్టుకొని మనల్ని కొడుతున్నాడనుకోండి. అపుడు ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా  స్థానిక పోలీసు మనల్ని తప్పక ఆదుకుంటాడు అనేది వాస్తవం. కాబట్టి "ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఈ పోలీసు ఉద్యోగం నిజంగా  వరమే".

(పోలీసు ప్రజలకు మిత్రుడు, పోలీసు వ్యవస్తను ప్రేమించండి, పోలీసుల సాధక, భాదకాలను అర్థం చేస్కొండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      
 

Saturday 5 November 2011

డిపార్టుమెంటులో నేను చూసిన మొదటి మంచి వ్యక్తి

కొద్దిరోజులకు మాకు ప్రిన్సిపాల్ మారిపోయి క్రొత్త అధికారి వచ్చాడు. ఆయన SI గా డిపార్టుమెంటులోకి వచ్చి అపుడు SP స్థాయి అధికారిగా మా ట్రైనింగ్ సెంటర్ కు వచ్చాడు. వచ్చిన వెంటనే మా ట్రైనీలు అందర్నీ సమావేశపరిచి మాకు ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ట్రైనీలకు ఏదైనా అవసరం ఉంటే తాను అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే మేము ఎవరమూ ఆయన చెప్పిన  మాటలు నమ్మలేదు. ఎందుకంటే అంతకుముందు మేము ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ మా సమస్యల గురించి పట్టించుకోలేదు.  అందుకే  ట్రైనీలు ఎవరూ ధైర్యం చేసి  మా సమస్యల గురించి చెప్పలేదు.
 
        అయితే ఆయన తాను మాటల మనిషి కాదు, చేతల మనిషినని తన చేతల ద్వారా నిరూపించాడు. ఆయన చెప్పిన తరవాతి రోజు రాత్రి మా ట్రైనింగ్ సెంటర్ పరిసరాలలో కొంతమంది బయటి వ్యక్తులు  అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే, మా ట్రైనీ ఒకతను గుర్తించి వెంటనే మా ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసాడు.  దాదాపు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆయన  తన భద్రతా సిబ్బందితో వచ్చి మా ట్రైనీల సహాయంతో వారిని పట్టుకొని  స్థానిక  పోలీసులకు అప్పగించాడు. దాంతో మా ట్రైనీలందరికీ ఆయన మీద నమ్మకం కలిగి, మా సమస్యలన్నీ ఒక్కోటి ఆయన దృష్టికి వెళ్ళసాగాయి.
      
  ఆయన వచ్చిన తర్వాత మా ట్రైనింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఆయన మాకు ట్రైనింగ్ లో అనవసరమైన అంశాలను తొలగించి, ప్రస్తుత సమాజానికి అవసరమైన విధంగా మా ట్రైనింగ్ ఉండేలా మార్పులు, చేర్పులు చేయించాడు. మెస్సును పూర్తిగా మార్పులు చేసి, మా ట్రైనీలలో   ఒకర్ని మెస్సును రోజూ దగ్గరుండి చూస్కునేలా నియమించాడు. దాంతో మా మెస్సు బాగా మెరుగుపడింది. ట్రైనింగ్ సెంటర్ లోని ప్రతి సిబ్బంది పూర్తి భాద్యతగా ఉండేలా మరియు మేము కూడా భాద్యతగా ట్రైనింగ్ చేసేలా ఆయన మార్చివేశాడు. మేము అప్పటివరకు ఇంటికి వెళ్ళలేదని తెలుసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఇంటికి వెళ్ళే అవకాశం కల్పించాడు. పోలీసు డిపార్టుమెంటులో ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారని  అని నాకు మొదటిసారి తెలిసింది. మా ట్రైనీలు ఎవరూ ఆయన్ని జీవితాంతం మర్చిపోరేమో, మరీ ముఖ్యంగా నేను అయితే ఆయన్ని జీవితాంతం మర్చిపోలేను అన్నది నా మనసులోని మాట.   

      అయితే నేను ఇంత మంచిగా ఆయన గురించి చెప్తున్నానని, నేను ఆయన నుండి ప్రత్యేకమైన సహాయం ఏమీ పొందలేదు లెండి. కారణం  మాత్రం తర్వాత వచ్చే టపాల్లో నేను చెప్పకుండానే మీకు అర్థం అవుతుందిలెండి. 

       నేను చెప్పిన ఆ మంచి మనిషి మాత్రం ప్రస్తుతం రిటైర్ అయి కూడా, రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలూ కష్టించి పని చేస్తున్న మన రాష్ట్ర పోలీసు సిబ్బంది "ఆరోగ్యానికి 'భద్రత'ను" కల్పించే మహొత్తరమైన   కార్యాన్ని అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. 

(పోలీసుల నుండి పూర్తి భాద్యతాయుతమైన సేవలు పొందటం ప్రజల హక్కు, అదే సమయంలో పోలీసులకు సహకరించటం కూడా భాద్యతగల పౌరుల విధి)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.