![]() |
ఈ సోదరులు మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారే... |
మాకు ట్రైనింగ్ సెంటర్లో 10 కి.మీ. మరియు 3.2 కి.మీ. పరుగు పందెం ఎపుడో నెలన్నరకో లేక రెండు నెలలకో ఒకసారి పెట్టేవారు. అంతే కాక మాకు ఖచ్చితంగా ఇంత టైములోపే పరుగెత్తాలనే నియమం ఉండేది కాదు. కానీ మాకు జిల్లాలో మొదలైన ట్రైనింగులో మాత్రం ఆర్.ఐ.గారు నిర్దేశించిన టైముకు ఏమాత్రం ఆలశ్యంగా పరుగెత్తినా చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్లకి మధ్యాహ్నం మంచి ఎండలో మళ్ళీ 10 కి.మీ. లేదా 3.2 కి.మీ. పరుగెట్టించేవారు. అప్పటివరకు మేము ట్రైనింగ్ సెంటర్లో తండ్రి చాటు బిడ్డల్లా, కోడిపెట్టకింది కోడిపిల్లల్లా ఆడుతూ, పాడుతూ ట్రైనింగ్ చేసిన మాకు, ఆర్.ఐ. గారి వద్ద అంతటి కఠినమైన శిక్షణకు మా శరీరాలు తొందరగా అలవాటు పడలేక పట్టలేనంత ఉక్రోషం ముంచుకొస్తుండేది.
ఒక రోజు 10 కి.మీ. పరుగు పందెంలో మా ట్రైనీలలో కొంతమంది నిర్దేశించిన టైములోపల రాకపోవటంతో, ఆర్.ఐ. గారు వాళ్లకు మధ్యాహ్నం ఎండలో గ్రౌండ్లో పనిష్మెంట్ ఇవ్వమని ఒక హెడ్ కానిస్టేబుల్ (H.C-short form) ను పురమాయించారు. ఆ H.C గారు వాళ్ళందర్నీ గ్రౌండ్లోకి తీస్కెళ్ళి ఆర్.ఐ. గారు చెప్పిన విధంగా పనిష్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టారు. అపుడు మా ట్రైనీలలో ఒకతను ఆ పనిష్మెంట్ తట్టుకోలేక నేను చెయ్యనని మొండికేసి ఆ H.C గారికి ఎదురు తిరిగాడు. ఆ విషయం ఆ H.C గారు ఆర్.ఐ గారి దృష్టికి తీస్కేళ్ళడంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరవాత ఆ ట్రైనీకి ఆర్.ఐ. గారు దగ్గరుండి ఇచ్చిన పనిష్మెంట్ కి, అతని మోకాళ్ళు, మోచేతులు రక్తసిక్తం అయ్యాయి. ఆ ట్రైనీ దాదాపు రెండు రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ దెబ్బకి మా ట్రైనీలు జిల్లా కేంద్రంలో ఆర్.ఐ. గారు శిక్షణ ఇచ్చిన రెండు నెలల్లో ఏనాడూ ట్రైనింగ్ ఇచ్చే సిబ్బంది ఎవరికీ ఎదురుతిరిగే సాహసం చేయలేదని వేరే చెప్పక్కర్లేదు కదండీ...
ఆయన మాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడా అని మాకు అర్థం కాకపోయేది. చివరికి ఒక రోజు S.P. గారు మా దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగినపుడు, ఒక ట్రైనీ ధైర్యం చేసి "ట్రైనింగ్ మరీ కష్టంగా ఉంది సార్" అని చెప్పాడు. దాంతో ఆయన నవ్వి "మాకు IPS ట్రైనింగ్ తర్వాత మేము గ్రే హాండ్స్ ట్రైనింగ్ కు వెళితే, ఈ ఆర్.ఐ. గారే అక్కడ మాకు శిక్షణ ఇచ్చారు. అపుడు ఈయన IPS లు కదా అని మమ్మల్నే కనికరించలేదు, ఇక మిమ్మల్ని వదులుతాడా?" అంటూనే, "ఇపుడు మీరు ఎంత కఠినమైన శిక్షణ తీస్కుంటే రేపు మీరు "మావోయిస్ట్" లను అంత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు" అని చెప్పడంతో ఇక మాకు ఆ ఆర్.ఐ. గారిని భరించక తప్పదని అర్థమైంది. అయితే S.P. గారు చెప్పిన విషయాలు నిజమేనని మేము గ్రహించటానికి ఎక్కువ రోజులేమీ పట్టలేదు.
No comments:
Post a Comment