Monday 19 December 2011

నిన్న నేనెలా పొరబడ్డానంటే!

అవసరం -కానీ అనర్థం, కాదంటారా?...
నేను పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి నా అనుభవాలను ఒక వరుసక్రమంలో చెపుతూ పోతున్నాను. అయితే ప్రస్తుత నా రోజు వారీ ఉద్యోగంలో భాగంగా నాకు ఎదురయ్యే అనుభవాలు నేను అదే క్రమంలో చెప్పేసరికి కొన్నింటిని నేను మరిచిపోవచ్చు. కాబట్టి మధ్య, మధ్యలో ఆ అనుభవాలు కూడా చెపితే బావుంటుందేమో అని అనిపించి నాకు రెండు రోజుల క్రితం కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. 
  
                 మొన్నటి రోజు పొద్దున్న సుమారు 10 గంటల సమయంలో నేను నా జీపులో దగ్గరలో ఉన్న మా DSP కార్యాలయానికి వెళుతున్నాను. అపుడు నా ముందు ఒక మోటర్ సైకిల్ పై, వెనుక ఒక యూనిఫారంలో ఉన్న వ్యక్తి కూర్చొని ఉండగా, ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు(triple riding) కనిపించింది. ఆ యూనిఫారంలో ఉన్నది ఏ డిపార్టుమెంట్ ఉద్యోగో తెలియదు, కానీ మామూలుగానే మోటర్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకూడదు. మరి ఆ విధంగా యూనిఫారంలో ఉండి ముగ్గురు ప్రయాణిస్తుంటే, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ప్రజల్లో చెడ్డ పేరు కదా. అందుకని నేను ఆ మోటర్ సైకిల్ ని క్రాస్ చేయమని మా డ్రైవర్ కు చెప్పినాను.

                 నేను ఆ మోటర్ సైకిల్ క్రాస్ చేసి వారిని ఆగమని చెప్పాను. తీరా చూస్తే ముందు మోటర్ సైకిల్ నడుపుతున్నది కూడా ఒక కానిస్టేబులే. మధ్యలో మాత్రం ఒక ప్రైవేటు వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాళ్ళు మా పక్క స్టేషన్ సిబ్బందిగా గుర్తించాను, వాళ్ళు కూడా నన్ను గుర్తు పట్టి నమస్కరించారు. నేను కోపంతో "ఏమయ్యా, ఎంత అవసరం ఉంటే మాత్రం మోటర్ సైకిల్ పై ముగ్గురు, అదీ యునిఫారంలో ఉండి ప్రయాణిస్తారా?", ప్రజలు మన గురించి ఏమనుకుంటారు?, ఎవరైనా విలేఖరి చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తే ఎంత చెడ్డ పేరు" అంటూ కొంచెం ఘాటుగానే వారిని మందలించాను. దానికి వారు చెప్పిన సమాధానం నన్ను కన్విన్సు చేయగలిగినా, బయటనుండి చూసే వాళ్ళు మాత్రం చెడుగానే అనుకుంటారు.

                  ఇంతకూ విషయమేమిటంటే, " ఆ కానిస్టేబుళ్లు పని చేసే స్టేషన్ కు సంబంధించిన ఒక 'హత్య కేసు ముద్దాయి' ఉప-కారాగారంలో రిమాండులో ఉన్నాడు. ఆ కేసులో వాయిదా ఆ రోజు ఉన్నందున ఆ ముద్దాయిని కోర్టులో హాజరుపరచాలి. కోర్టేమో పట్టణంలో ఉండి, ఉప-కారాగారమేమో పట్టణానికి దాదాపు రెండు కి.మీ. దూరంలో ఉంది. అంత తక్కువ దూరానికి సాధారణంగా స్టేషన్లో "వారంటు" (పోలీసులకు RTC బస్సులో చార్జీ లేకుండా ఉపయోగించే ప్రభుత్వ పాస్ లాంటిది) ఇవ్వరు. నడిపించుకు రావటానికి మరీ దగ్గర కూడా కాదు, పైగా 'హత్య కేసు ముద్దాయి' కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటో లేదా బస్సులో ఆ కానిస్టేబుళ్లు తమ స్వంత డబ్బులతో తీసుకు రాలేరు. దానికి గాను ఆ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరి మోటర్ సైకిల్ పై మధ్యలో, ఆ 'హత్య కేసు ముద్దాయి' ని కూర్చోబెట్టుకొని ఉప-కారాగారం నుండి కోర్టుకు తీస్కుని వెళుతున్నారు. ఎంత అవసరం ఉన్నా, చట్టాన్ని అమలు చేసే పోలీసులు మాత్రం దానిని అతిక్రమించటం తప్పే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వేరే డిపార్టుమెంటులో ఉన్నా, వాళ్ళు తప్పు చేసినా ఎవరికీ కనిపించదు. కానీ మాది యునిఫారం ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

                అయితే చట్టాన్ని అమలు చేసేటపుడు మరీ మూర్ఖంగా వాస్తవాల్ని విస్మరించి ప్రవర్తించకూడదని నా అభిప్రాయం. ఉదాహరణకి "నేను ఒక రోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక మోటర్ సైకిల్ పై ముగ్గురు మగ వ్యక్తులు ప్రయాణిస్తూ వస్తుంటే మా సిబ్బంది ఆపి నా దగ్గరకు తీసుకు వచ్చారు.  మధ్యలో ఉన్న వ్యక్తికి అనారోగ్యంగా ఉంటే, సమయానికి ఆటో లేదా బస్సు అందుబాటులో లేక వారు అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని ముగ్గురు మోటర్ సైకిల్ పై వైద్యాలయానికి వస్తున్నామని చెప్పారు. నేను పరిశీలించి వారు చెప్పినట్టుగా ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తికి అనారోగ్యం అని నిర్ధారించుకున్నాక వెంటనే పంపించేసాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా మరీ గుడ్డిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు ఇబ్బందులు పడటమే కాక, పోలీసులకు మానవత్వం లేదని అనుకుంటారని నా అభిప్రాయం. 

(మాట కరకుగా ఉన్నంత మాత్రాన ప్రతి పోలీసు మానవత్వం లేకుండా ఏమీ ఉండడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

4 comments:

  1. నిజం .ఎవరి వృత్తిధర్మాన్నైనా విచక్షణాజ్ఞానం తో నిర్వహించాలి'

    ReplyDelete
  2. పోలీస్ జాబ్స్ సెలక్షన్లప్పుడు అంత పర్టిక్యులర్ గా శారీరిక కొలతలు, Body Fitness చూస్తారు కదండీ, మరి జాబ్ లో జాయిన్ అయిన తరువాత పోలీసులు అంత లావు బొజ్జలు ఎందుకు పెంచుతారు ???

    అంత లావు బొజ్జలున్న పోలీసులు దొంగలని ఎలా పట్టుకుంటారండీ ???

    జాబ్ వచ్చిన తరువాత Body Fitness అక్కరలేదా ???

    అంత మాత్రానికి ఉద్యోగం సంపాదించడానికి ఆ పరిగెత్తడాలూ, చుట్టుకొలతలూ చూడ్డం దేనికండీ ???

    ఇపుడూ.... తెలంగాణా , కాశ్మీర్ లను సాధించుకోవాలంటే Body Fitness ఉండాలన్న జ్జానం ఉండాలా అక్కరలేదా మీరే చెప్పండి !!!!

    ReplyDelete
  3. పోలీసు ఉద్యోగానికి కొన్ని శారీరఖ ప్రమాణాలు ఉండటం అత్యావశ్యకం. అయితే మీరు చెప్పినట్టు పోలీసులకు ట్రైనింగ్ తర్వాత సరైన మధ్యంతర శిక్షణలు లేకపోవటం, విపరీతమైన పని ఒత్తిడి, సమయానికి సరిగా భోజనం చేయక పోవటం, మానసిక వత్తిళ్ళు మొదలైన కారణాల వల్ల శారీరఖంగా ఊబకాయం ఎక్కువగా వస్తున్న మాట వాస్తవం. అయితే ఇపుడే పరిస్తితి కొంత మెరుగుగా ఉంది, అంతే కాక ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోలీసులు తమ యథాశక్తి పని చేస్తున్నారనేది కూడా అంతే వాస్తవం.

    ReplyDelete
  4. నీహారిక గారు,

    మంచి ప్రశ్నలే అడిగారు. కానీ వీటిగురించి మీరెప్పుడైనా ఆలోచించారా ?

    1. How many hours are given to a police per week for his time off ?

    2. How many breaks in the duty are available ?

    3. What sort of refreshments are provided to the police force ?

    everyone wants to see a smart and stiff looking police officer. But it needs a lot of physical comfort, breaks and refreshments for a police man not to droop his shoulders.

    4. Is the effort a police puts in his physical activity considered as part of his duty ?

    it is very easy to crack jokes and satires on big tummies etc. but understanding the issue and making improvements is very complex.

    ReplyDelete