Wednesday 2 November 2011

పులి పాలు తెమ్మన్నా తేవాలి మరి!

పోలీసు డిపార్టుమెంటులో ఉద్యోగికి క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోతే క్రింది ఉద్యోగులు పై అధికారుల మాట వినరు. దాంతో వ్యవస్థ నడవటం కష్టం అవుతుంది . అందుకే పోలీసులు, ఆర్మీ మరియు ఇతర సాయుధ బలగాలకు సామాన్య ప్రజలకు ఉన్నట్టు అన్ని ప్రాథమిక హక్కులు ఉండవు. ప్రతి పోలీసు ట్రైనింగ్ లోను దాదాపు క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత గురించి ఈ క్రింది చిన్న ఉదాహరణ తప్పక చెప్తుంటారు.  

     "ఒక పోలీసు ఉన్నతాధికారి తన క్రింద పని చేసే ఒక పోలీసు అధికారి మీద కోపంతో 'పులిపాలు' తెమ్మని చెప్పాడనుకోండి. వెంటనే ఆ క్రింది అధికారి మారు మాట్లాడకుండా, పులి అడవిలో ఉంటుంది కదా సార్!, అడవిలోకి వెళ్ళినా నాకు పులి కనపడుతుందా?, కనిపించినా పులి దగ్గరికి వెళితే నన్ను చంపదా? అయినా అది నా డ్యూటీ కాదు కదా? అని ఎదురు ప్రశ్నలు వేయకుండా, నేను తేను సార్ అని ఎదురు చెప్పకుండా, అక్కడే ఉన్న చెంబు తీస్కోని బయలుదేరాలంట". అపుడు ఆ ఉన్నతాధికారికే మళ్ళీ భయం వేసి, 'నేను ఏదో కోపంలో చెపితే ఇతను నిజంగానే చెంబు తీస్కుని పులి దగ్గరకు వెల్లేట్లున్నాడు!, పులి ఇతన్ని ఏమైనా చేస్తే నా పని ఏమి కాను?" అని    భయపడి ఆ అధికారిని వెనక్కు పిలవాలంట.
          
            కొంచెం అతిశయోక్తిగా ఉన్నా, పై ఉదాహరణలోని సారాంశం ఏమిటంటే "పోలీసు డిపార్టుమెంటులో క్రమశిక్షణ అనేది అత్యావశ్యకం. పోలీసులు, తమ పై అధికారుల ఆజ్ఞలను తు.చ.తప్పకుండా పాటించాలి, లేదంటే శాంతిభద్రతలను పరిరక్షించటం కష్టం అవుతుంది." కనుక పోలీసు డిపార్టుమెంటులో వ్యక్తిగత అభిప్రాయాల కన్నా, ఉన్నతాధికారుల ఆజ్ఞలను పాటించటమే పరమావధి. కాబట్టి మనసు ఉన్నవాళ్ళకు పోలీసు డిపార్టుమెంటులోకి వచ్చిన తర్వాత దాన్ని చంపుకొని డ్యూటీ చేయటం అలవాటు అవుతుంది, అది అవసరం కూడా. అయితే చట్టాల్ని గౌరవిస్తూ, మానవత్వాన్ని చూపిస్తూ విధులు నిర్వహించటం పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెస్తుందని నా అభిప్రాయం. 

(పోలీసు లేని వ్యవస్థను ఊహించలేము, పోలీసులకు తప్పకుండా సహకరించండి, వ్యతిరేఖించకండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.

1 comment: