Tuesday 15 November 2011

పోలీసు కటింగ్ తో నేను ఇంటికెళ్ళినపుడు!

ట్రైనింగ్ మొదలైన కొద్దిరోజులకు మా డిగ్రీ ఫైనలియర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. దేవుడి దయ వల్ల నేను ఫెయిలవుతానని భయపడిన పేపర్ కూడా పాస్ అయ్యి, మొత్తమ్మీద మొదటి తరగతిలో ఉత్తీర్ణున్నయ్యాను. తర్వాత కొద్దిరోజులకు మాకు దసరా సెలవులకు ఇంటికి పంపించారు. నాకు ఇంటికి వెళ్తున్నానన్న ఆనందం ఒకవైపు ఉన్నా మరో ప్రక్క నా పోలీసు కటింగ్ తో వెళ్ళాలంటే కొంత సిగ్గుగానే అనిపించేది. ట్రైనింగ్ సెంటర్లో మంగలి వాళ్ళు తక్కువమంది ఉండటం, ట్రైనీలు వందల సంఖ్యలో ఉండటం వల్ల ఒక్కో మంగలి దాదాపు వందమంది వరకు కటింగ్ చేయాల్సి వచ్చేది. అందుకని మేము తల అతని చేతిలో పెట్టటమే ఆలశ్యం అన్నట్లు బరబరా జుట్టు క్రింది భాగం నుండి పై వరకు రెండు అంగుళాల వెడల్పుతో మిషన్ తో అంట కత్తెర వేసేవాడు. మాకు ట్రైనింగుకు వచ్చిన కొత్తలో పోలీసు కటింగుతో బయటికి వెళ్ళాలంటే సిగ్గు అనిపించినా క్రమంగా అలవాటు అయిపోయింది. కానీ మొదటిసారి ఊరికి వెళ్ళాలంటే కొంచెం బిడియంగానే ఉండేది. అయితే నా కటింగ్ నాకు ఏమీ అనిపించకపోయినా కొంతమంది ఇతర ట్రైనీల కటింగ్ చూస్తే వింతగా ఉండి తమాషాగా అనిపించేది.
    
                 నేను హైదరాబాదులో బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. పొద్దున్నే లేచి ఇంట్లోంచి బయటికి వచ్చేసరికి మా వీధిలో వాళ్ళు "ఎపుడొచ్చినావు ____ (నా పేరు)? బాగా బక్కగా అయినావే" అంటూ పలకరిస్తున్నా వాళ్ళ చూపులు నా తలవేపే ఉండటం మాత్రం నేను గమనిస్తూనే ఉన్నా. కొంతమంది ఆడవాళ్ళు నా తలవేపు చూసి పక్కకు తిరిగి నవ్వుకోవటం, పిల్లలు నా వేపు చూస్తూ నవ్వటం చూసి కొంత సిగ్గు అనిపించింది. రెండు మూడు రోజుల వరకు నేను కొంత సిగ్గు పడినా క్రమంగా నాకు మరియు మా ఊరివాళ్ళకు కూడా నా పోలీసు కటింగ్ అలవాటైపోయింది. ట్రైనింగ్ లో ఒకసారి లాంగ్ రన్ నిమిత్తం మమ్మల్ని బయటికి దిల్ సుఖ్ నగర్ వైపు తీస్కేళ్లినపుడు నా డిగ్రీ క్లాస్ మేట్ ఒకమ్మాయి కనపడితే ఆమెకు కనపడకుండా తప్పించుకున్న విషయం కూడా గుర్తుంది.

             ట్రైనింగ్ కు వచ్చిన కొత్తలో పోలీసు కటింగ్ తో తెలిసిన వారికి కనిపించాలంటే  కొంత సిగ్గు పడినా, ప్రస్తుతం ఏ మాత్రం కొంచెం జుట్టు పెరిగినా వెంటనే అంట కత్తెర వేయించుకునే విధంగా మారిపోయాను. పొద్దున్న నుండి రాత్రి వరకు తలలోంచి చెమటలు కారేలా కష్టపడే ట్రైనింగులో నిజంగా జుట్టు ఆ విధంగా కత్తిరించక పోతే చాలా చిరాకుగా ఉంటుంది. తలంతా చెమటలు పట్టినా జుట్టు తక్కువగా ఉండటం వల్ల చల్లగా ఉండేది. కాబట్టే ట్రైనింగులో జుట్టు అంట కత్తెర వేయిస్తారు. ఇపుడు డ్యూటీలో కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు తలపై టోపీ పెట్టుకుని ఉండాలంటే జుట్టు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పోలీసు కటింగ్ అనేది యువతకు కూడా ఫ్యాషన్ అయిపోయిందనుకోండి.

(పోలీసు అధికారులు కూడా ఒక్కోసారి తప్పుచేయకున్నా ఇబ్బందులు పడవచ్చు, సహృదయంతో అర్థం చేస్కోండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

5 comments:

  1. హ హ బావున్నాయి మీ కటింగ్ కష్టాలు ! ఇప్పుడు నాకర్ధం అయ్యింది మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో :)))

    ReplyDelete
  2. అంబర్ పేట. అంతేనా శ్రావ్యగారూ!

    ReplyDelete
  3. మీ అనుభవాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. బావుందండీ ...

    ReplyDelete
  4. తేజస్వని గారు ఎస్సో :))) అప్పానేమో అని ఒక ఐదు శాతం డౌట్ ఉండే ఇదివరకు, వంద శాతం క్లియర్, నో డౌట్ అంబర్ పేటనే :)))

    ReplyDelete