Sunday 13 November 2011

నా మొదటి ఫైరింగ్ ప్రాక్టీసు అనుభవాలు

తుపాకీ చేతిలో ఉంటే ఆయుధం. ఒక్కోసారి అదే శత్రువు కూడా కావచ్చు
మాకు ఆర్మ్స్డ్ డ్రిల్ నేర్పిస్తూనే మరో ప్రక్క మాకు తుపాకీని భాగాలుగా విడదీయటం మరియు బిగించటంను నేర్పిస్తుండేవారు. తుపాకీలో ఏ భాగాన్ని ఏమని పిలుస్తారు, ఏ భాగం ఏ పని చేస్తుంది మరియు తుపాకీని ఏ విధంగా ఉపయోగిస్తారు మొదలైన విషయాలు వివరించేవారు. తుపాకీని ఎంత తక్కువ సమయంలో భాగాలుగా విడదీసి, మళ్ళీ బిగిస్తారో అని ట్రైనీల మధ్య పోటీ పెట్టేవారు. తుపాకీని ఉపయోగించేటపుడు అది ఏ ఏ కారణాల వల్ల మొరాయిస్తుంది, తిరిగి ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలి అనేది కూడా నేర్పేవారు. ఫైరింగ్ ఎలా చేయాలో చాలా కఠినమైన ప్రాక్టీసు చేపించేవారు. ఎందుకంటే ఫైరింగ్ లో భాగంగా గుండు(రౌండ్ or బుల్లెట్) అనుకున్న చోట మనం ఫైర్ చేయగలగాలంటే అకుంఠితమైన ఏకాగ్రత, దీక్ష మరియు చాలా ఓపిక అవసరం. అందుకే ఏకాగ్రత మరియు ఓపిక పెరగటం కోసం తీవ్రమైన ప్రాక్టీసు ఉండేది. 

              బయట గ్రౌండ్ లోనే కాకుండా సిమ్యులేటర్ రూము నందు కూడా ఫైరింగ్ ప్రాక్టీసు చేపించేవారు. శారీరఖంగా మంచి బలిస్టుడైనంత  మాత్రాన అతను మంచి ఫైరర్ కానవసరం లేదు. ఎందుకంటే తుపాకీని అనుకున్న చోట కాల్చాలంటే పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉండాలి. అయితే మాకు శిక్షణలో చెప్పిన దాని ప్రకారం తుపాకీ ఫైరింగులో ప్రాథమిక సూత్రం ఏమిటంటే "తుపాకీకి మిత్రులు, నీవాళ్ళు లేదా నావాళ్ళు అని ఉండదు, ఏ మాత్రం పొరబాటు చేసినా నీ తుపాకీనే నీప్రాణం తీయొచ్చు".

                 కొద్దిరోజులకు మాకు ఫైరింగ్ ప్రాక్టీసు చేసే గ్రౌండ్ కు తీసుకు వెళ్ళారు. అది చుట్టూ కొండలు ఉండి, ఒక వేళ ప్రమాదవశాత్తూ  ఎవరైనా ప్రజలు ఆ పరిసరాల్లోకి వచ్చినా ప్రమాదం కలుగకుండా ఉంది. ఒకవేళ ప్రజలు ఎవరైనా వచ్చినా ముందే గుర్తించి హెచ్చరించేలా కొంతమందిని చుట్టుపక్కల కాపలాగా ఉంచారు. మొదటిసారి కాబట్టి మాకు తుపాకీలలో క్రింది తరగతికి చెందిన దానితో ఫైరింగ్ చేపించారు. ప్రతి ఒక్క ట్రైనీకి ఐదు రౌండ్లు కాల్చటానికి అనుమతి ఇచ్చారు. నా ముందు వాళ్ళు వెళ్లి ఫైరింగ్ చేస్తుంటే నా వంతు ఎపుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసాను. అయితే మాకు ట్రైనింగ్ లో "మీరు తుపాకీని భుజంపై ఆశ్రద్దగా పట్టుకుంటే ఫైర్ చేసిన తర్వాత అది వెనక్కి వచ్చి మీ కాలర్ బోన్ ను గుద్దుకొని ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉందని" హెచ్చరించారు. అందువల్ల ఫైరింగ్ చేయాలంటే కొంచెం భయంగా కూడా ఉండేది. అయితే మాకు ముందుగా 50 మీ. దూరం నుండి చెక్కతో తయారు చేసిన 4/4 మీ. లక్ష్యం మీద ప్రాక్టీసు చేపించారు. నా వంతు వచ్చినపుడు వెళ్లి నేలపై పడుకొని తుపాకీని భుజంపై తీసుకోగానే చాలా ఆందోళనగా అనిపించింది. కానీ అది క్రింది తరగతి తుపాకీ అయినందున కాల్చిన తర్వాత పెద్దగా భుజం పై వత్తిడి కలిగించలేదు మరియు పెద్దగా శబ్ధం కూడా చేయలేదు.
                
              అయిదు రౌండ్లు పది సెకన్లలోపలే అయిపోవటంతో కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం. అయితే ఉద్యోగంలో (జీవితంలో) మొదటిసారి ఫైరింగులో ఐదు రౌండ్లకు, 25 మార్కులకు గాను 20 మార్కులు తెచ్చుకోగలిగాను. మరియు మొదటిసారి నిజమైన తుపాకీని కాల్చిన అనుభవం చాలా సంతోషాన్ని కలిగించింది. 

(పోలీసులు శాంతిభద్రతలు కాపాడేటపుడు జరిగే పొరబాట్లతో డిపార్టుమెంటును అపార్థం చేస్కోకండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      

6 comments:

  1. ట్రైనింగ్ తరువాత , ఫైరింగ్ ఎప్పుడైనా చేసారా ? (మొట్ట మొదటి మారు చేసేటప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేది ? ) నాకైతే మరీ భయం వేస్తోంది ఈ రైఫాల్ చూస్తూంటేనే.

    ReplyDelete
  2. మొదటి ట్రైనింగ్ లోనే ఫైరింగ్ చాలా సార్లు చేసామండీ. మళ్ళీ ఈ పది సంవత్సరాలుగా చాలా ట్రైనింగులు చేసినపుడు కూడా లెక్కలేనన్ని సార్లు ఫైరింగ్ చేసాము. మొదటిసారి చేసినపుడు నాకు కూడా చాలా భయంగా, ఆందోళనగా ఉన్నా అంతే స్థాయిలో నిజమైన తుపాకీని కాలుస్తున్నానన్న ఆనందం కూడా మనసులో ఉండేది.

    ReplyDelete
  3. ఆ మొదటి సారి అలా వుంటుంది, మొదటి సారి యుద్ధ ట్యాంకులో కూచున్నప్పుడు నాకు అలా ఉద్వేగంగా వుండింది. పాకిస్థాన్ పకి నడిపేసి, పేల్చేసి.. ఏదేదో చేయాలని. :)

    ReplyDelete
  4. మీరు ఎప్పుడైనా, పబ్లిక్ లో జరిగిన (ఎదురు)కాల్పులు లో పాల్గొన్నారా?
    అయితే మీరు ఎలా ఫీల్ అయ్యారు?

    ReplyDelete
  5. ఎదురు కాల్పుల్లో పాల్గొన్నాలెండి, కానీ పబ్లిక్లో కాదు. పబ్లిక్లో ఎదురు కాల్పులు అంటే ముంబై తరహాలో మీరడిగేది. మనకంత సీన్ లేదు, మేము బ్లాక్ కాట్ కమెండోస్ కాదండీ సివిల్ పోలీసు సర్...

    ReplyDelete
  6. అది కాదు, సాధారణ అల్లర్లప్పుడు, మొదట లాఠిచార్గ్, అప్పటికి అదుపులోకి రాకపోతే గాలిలోకి బాష్పగోళాలు మరీ అదుపులోకి రాకపోతే మీబాస్ "చార్గ్" అన్నప్పుడు మీరు ( అల్లరి మూకల మీద?) కాల్పులు జరుపుతారు కదా?

    దాని గురించి అడిగింది

    ReplyDelete