Wednesday 16 November 2011

"వెనక బెంచీ బ్యాచ్" లో నేనెలా చేరానంటే!

ఇది మా క్లాసు కాదు లెండి.
ముందే చెప్పినట్టు నా ట్రైనింగ్ మొత్తమ్మీద కూడా మామగాడు నన్ను  చాలా విషయాల్లో ప్రభావితం చేసాడు. నాకు అంతకు ముందు పోలీసు వ్యవస్థ మీద ఎలాంటి అవగాహన లేకపోవటం, వాడికి NCC పూర్వ అనుభవం ఉండటం వల్ల నేను వాడి మాటలకు విలువ ఇచ్చేవాడిని. మా ట్రైనింగులో మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గోదావరి, అనంతపురం, మరియు కడప జిల్లాలకు చెందినా ట్రైనీలు ఉండేవారు. అయితే మామగాడు మా జిల్లావాసి కావటం, నా విభాగం లోనే ఉండటంతో నేను వాడి మాటలతో బాగా ప్రభావం అయ్యాను. వాడు ట్రైనింగ్ మొత్తమ్మీద ఒక్కరోజు కూడా తన పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది లేకపోగా, నన్ను కూడా ప్రతి క్షణం హెచ్చరిస్తుండే వాడు.

                   నా విద్యార్థి దశలో నేను ఎపుడూ వెనుక బెంచీలో కూర్చున్నది లేదు, క్లాసు ఫస్టు రావటంలో రాజీ పడింది లేదు. అలాంటి నేను మామగాడి మాటలతో ట్రైనింగులో క్లాసులకు వెళ్ళినపుడు వెనుక బెంచీలోనే కూర్చోవటానికి అలవాటు పడ్డాను. వెనుక బెంచీలో కూర్చొని, పాఠాలు చెప్పే లెక్చరర్ (SI or CI స్థాయి అధికారి లెండి) కనుసన్నలలో నుండి దూరమవటంతో క్రమంగా నేను పాఠాల మీద శ్రద్ధ తగ్గించుకోవటం మొదలైంది. అంతే కాకుండా పొద్దున్న విపరీతంగా అలసిన శరీరం అల్ఫాహారం తిని క్లాసులకు రాగానే వెనుక బెంచీలో ఉండటం వల్ల విశ్రాంతి కోరుకోవటంతో క్రమంగా క్లాసులలో నిద్రపోవటం అలవాటైంది. అయితే మేము నిద్రపోయేటపుడు మాత్రం, మాకు మా వెనక బెంచీలో కూర్చున్నా నిద్రపోని వ్యక్తిని లెక్చరర్ మా వైపు వస్తే లేపమని కాపలా ఉండమనేవాళ్ళం. ఎందుకంటే క్లాసులో నిద్రపోయామని లెక్చరర్ ఫిర్యాదు చేస్తే గ్రౌండ్లో తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది మరి.

                  మా లెక్చరర్ లలో ఒక చాదస్తపు ముసలాయన(SI  స్థాయి అధికారి) ఉండేవాడు. ఆయన క్లాసుకు వస్తేనే,  వెనక బెంచీలో కూర్చొనే వాళ్ళను ముందు బెంచీల్లోకి, ముందు బెంచీల్లో వాళ్ళని వెనక బెంచీల్లోకి కూర్చోమనేవాడు. దాంతో ఆయన క్లాసు ఉందంటే మేము మామగాడి  సలహాపై, ముందే లేచిపోయి మధ్య బెంచీల్లో కూర్చునేవాళ్ళం. మిగతా లెక్చరర్ల క్లాసుల్లో మాత్రం మేము వెనక బెంచీల్లోనే కూర్చోవటం వల్ల, మేము  మామగాడి ప్రభావంతో "వెనక బెంచీ బ్యాచ్" గానే గుర్తింపు పొందాము. అయితే నేను వెనక బెంచీల్లో కూర్చున్నా నాకు పోలీసు మాన్యువల్, చట్టాలు మరియు మాకు పాఠాలు చెప్పే పోలీసు అధికారుల అనుభవాలు కొత్తగా మరియు ఆసక్తిగానే ఉండి పడుకోకుండా ఉన్నపుడు మాత్రం పూర్తి శ్రద్దతోనే వినేవాడిని. ఎపుడూ వెనక బెంచీలో కూర్చొని నిద్రపోయే ట్రైనీ, ట్రైనింగులోనే వ్రాత మరియు ఓవరాల్ గా ఫస్టు వస్తే షాక్ కదూ... (వెయిట్ అండ్ రీడ్) 

(నేరం జరుగున్న విషయం తెలిసీ మనం నిర్లిప్తత ప్రదర్శిస్తే, ఒక్కోసారి దానికి మనం కూడా బలి కావచ్చు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ. 
                                                                                      --కృతజ్ఞతలతో.

7 comments:

  1. వావ్.. ఇన్నాళ్లూ మీ బ్లాగు చూడనే లేదు. అక్కడక్కడా కొన్ని భాగాలు చదివాను. పోలీస్ ట్రెయినీగా మీ అనుభవాలు బాగా చెప్పారు. మిగిలినవి కూడా తీరిక చూసుకుని చదువుతాను. మొత్తానికి మన బ్లాగర్లు పోలీసుల్లో కూడా ఉన్నారని గర్వ కారణంగా ఉంది:):) (అంటే మామూలుగా పోలీసులు బ్లాగుల్లో ఉన్నారు అని రాయాలి లెండి:))

    ReplyDelete
  2. బావుందండీ . మీరు నిజాయితీగా ఉన్నదున్నట్టూ చెప్పేస్తున్నారని నా ప్రగాఢ విశ్వాసం .
    పోస్టులు ఇలానే చిన్నవిగా రాస్తుంటే ఎప్పటికయ్యేను మీ పదేళ్ళ సర్వీసు కథ . ఇక్కడంతా ఎన్ కౌంటర్ ఎప్పుడవుతుందా అని ఆతృతగా చూస్తుంటే :)

    ReplyDelete
  3. mee back bench story bagundi sir..
    intakee mee friend "mama" ippudu em chestunnaro telusukovalani vundhi..

    ReplyDelete
  4. కొంచెం బిజీగా ఉంటున్నానండీ, సరే ఎక్కువ రాయటానికి ప్రయత్నిస్తాలెండి. ఎన్ కౌంటర్ కంటే ఇంటరెస్టింగ్ స్టోరీలే ఉండొచ్చేమో....

    ReplyDelete
  5. మామ ఇపడు కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడండీ

    ReplyDelete
  6. ఫ్రెండ్

    "బ్లాగిల్లు"లో రేపటి కోసం "నేటిబ్లాగు"కు మీ బ్లాగును ఎంచుకున్నాం.
    మీయొక్క మంచి పోస్టులతో మమ్మల్ని మరింత అలరించాలని...

    మా వెబ్ సైట్ ను దర్శించండి :మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సూచనలను తెలుపగలరు.


    http://blogillu.com/

    మీ

    శ్రీనివాస్
    http://blogillu.com/

    ReplyDelete