Monday 7 November 2011

పోలీసు ఉద్యోగం వరమా శాపమా?

పోలీసు ఉద్యోగం గురించి దాదాపు సమాజంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే పోలీసులు బాగా కరకుగా ఉంటారు, చెడ్డవాళ్ళు. అదే సమయంలో పోలీసు ఉద్యోగం చాలా కష్టమైన డ్యూటీ అని కూడా దాదాపు ప్రజలందిరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యోగం తెచ్చుకోవటమే కష్టమైతే, దాదాపు సంవత్సరం పాటు కఠినమైన శిక్షణ తీసుకోవాలి. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి, మన అభిప్రాయం చెప్పటానికి, అమలు పరచటానికి వీలు ఉండదు. ఎదురు మాట్లాడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎప్పుడు ఏ రూపంలో తీవ్రవాద, ఉగ్రవాద వంటి అసాంఘిక శక్తులు విరుచుకుపదతాయో, ప్రాణాలను బలిగొంటాయో తెలియదు. ఎప్పుడూ విధి నిర్వహణలో రాజకీయ, సామాజిక మరియు ఇతర రూపాల్లో తీవ్రమైన వత్తిళ్ళు. మిగిలిన ఉద్యోగాల్లా ఒక వేళా పాళా ఉండవు, 24 గంటలూ విధులు నిర్వహించాలి. పండుగలు, పెళ్ళిళ్ళు ఇంకా ఇతర శుభకార్యాల సమయంలో కూడా బందువుల ఇండ్లకు వెళ్ళటానికి వీలు దొరకదు. ఇంత కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నా చాలీ చాలని జీతాలు, సమాజంలో సరైన గుర్తింపు లేకపోవటం. ఇలాంటి పరిస్తితులలో పోలీసు ఉద్యోగికి పిల్లను ఇవ్వాలన్నాఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. మరి ఇంతటి తీవ్రమైన పరిస్తితులలో చేస్తున్న పోలీసు ఉద్యోగం వరమా ? శాపమా?...

             మాకు ట్రైనింగ్ లో ఏదో ఒక సందర్భంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పోలీసు ఉద్యోగం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అపుడు మా ట్రైనీ ఒకతను "పోయిన జన్మలో పాపాలు చేసిన వాళ్ళు, దానికి శిక్ష అనుభవించటానికి ఈ జన్మలో పోలీసుగా ఎంపికవుతారని" సరదాగా చెప్పాడు. అపుడు దైవభక్తి మెండుగా ఉన్న ఆయన మాతో  "పోలీసు ఉద్యోగం గురించి సమాజంలో చాలా దురభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం చేసే ఉద్యోగాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి, నీకు భ్రుతిని కల్పిస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించు" అని. అంతే కాకుండా "పోలీసు ఉద్యోగం చాలా పవిత్రమైన ఉద్యోగం, మనం దేవుని దూతలం" అని అన్నాడు. మాకు అర్థం కాలేదు, అపుడు ఆయన మళ్ళీ ఇలా చెప్పాడు. " మనిషికి కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అయితే ధర్మం అంతో ఇంతో ఉన్న కాలాల్లో దేవుడు ప్రత్యక్షంగా వచ్చి దీనార్తులను కాపాడేవాడు. కానీ పాపాలు పెరిగిపోయిన నేటి కలికాలంలో మనుషులు కష్ట కాలాల్లో ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్తిస్తుంటారు, అయితే దేవుడు ప్రత్యక్షమై వాళ్ళని కాపాడినట్టు మనం ఎపుడూ వినలేదు. దేవుడికి తాను వచ్చేందుకు ఇష్టం లేదు కనుక తన ప్రతినిధులుగా కష్టం వస్తే ప్రజలను ఆదుకోమని "పోలీసులను" నియమించాడు అని చెప్పాడు. 
                
         ఆ అధికారి చెప్పింది వాస్తవ దూరంగా ఉన్నా ప్రజలకు తాము కష్టాల్లో ఉన్నపుడు మొదట గుర్తుకు వచ్చేది మాత్రం పోలీసు అనేది నిజమే కదా. ఉదాహరణకు మనం చెన్నై కు ఏదో పని మీద వెళ్ళాం, అక్కడ మనకంటే  బలాడ్యుడైన ఒక వ్యక్తి అకారణంగా మనతో గొడవ పెట్టుకొని మనల్ని కొడుతున్నాడనుకోండి. అపుడు ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా  స్థానిక పోలీసు మనల్ని తప్పక ఆదుకుంటాడు అనేది వాస్తవం. కాబట్టి "ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఈ పోలీసు ఉద్యోగం నిజంగా  వరమే".

(పోలీసు ప్రజలకు మిత్రుడు, పోలీసు వ్యవస్తను ప్రేమించండి, పోలీసుల సాధక, భాదకాలను అర్థం చేస్కొండి.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.      
 

4 comments:

  1. ఇది నిజంగా వరమే సద్వినియోగ పరుచుకుంటే...
    -www.pravasarajyam.com

    ReplyDelete
  2. పోలీసులు అనే వాళ్ళు ఎప్పుడూ గౌరవనీయులే. ప్రభుత్వొజ్యోగాలలో అత్యంత భాధ్యత కలిగిన ఉద్యగం ఇదే. కానీ, మన మీడీయా అంటే టివీలు, పత్రికలు, సినిమాలు మొదలైన వాటిలో పోలీసులను ఏదో విలన్ల క్రింద చిత్రీకరించటం వలన ప్రజలలో గౌరవం తగ్గింది. పరసనల్‌గా ఏ కోపం లేకపోయినా కేవలం ప్రజలకోసం అసాంఘిక వ్యక్తులతో తలపడేది పోలీసులే అనెది మనకు తెలియాలి. ఎదో కొద్దిమంది చేసే పనుల వలన అందరినీ ఒకే గాటన కట్టటం అన్యాయం. ఆ మాటకోస్తే ఈ మాత్రం చెడులేని డిపార్టుమెంట్స్ వున్నాయా? ఎలా వున్నా "ఎవరికి" ఆపద వచ్చినా మొదట గుర్తు వచ్చేది పోలీసే.

    ReplyDelete
  3. సమాజంలో ప్రస్తుతం అన్నిరకాల ఉద్యోగాలను సామాన్యజనం ఒకే గాటన కడుతున్నారు. ఉద్యోగం విలువ దానినుండి కలిగే లభ్ధిని బట్టే నిర్ణయిస్తున్నారు కాని, సమాజానికి ఆ ఉద్యోగం ద్వారా యెంత సేవ అందుతుందనే దానిని బట్టి కాదు. ఇది చాలా శోచనీయం. ఈ రోజున ఒక వ్యక్తి ప్రయోజకు డనిపించుకున్నాడంటే అతడు బాగా సంపాదిస్తున్నాడన్నమాట. ఉదాహరణకు ఇద్దరు అన్నదమ్ములున్నారని అనుకుందాం. అన్నగారు మెరిట్ విద్యార్ధి. ఒక పెద్ద సంస్ధలో ఉన్నతోద్యోగంలో ఉంటాడు. తమ్మడు చదువులో వెనకబడి రాజకీయాల్లో తిరిగి ఒకరకమైన పేరు సంపాదిస్తాడు. కొన్నాళ్ళకు తమ్ముడు అనూహ్యంగా ప్రయోజకుడైపోతాడు జనం దృష్టిలో. మేడలూ మిద్దెలూ గొప్ప పలుకుబడీను. ఇంకా అన్నగారైతే యిల్లు కట్టుకోవటానికి యే బ్యాంకువారు లోను యిస్తారా అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇదీ నేటి లోకం తీరు. విలువ విద్యకు సేవకు గాక సంపాదనకు పలుకుబడికే ఉన్న రోజుల్లో పోలీసులాంటి 'చాకిరీ' ఉద్యోగం చేసే 'మంచి వాడికి' సామాన్యుడు పిల్ల నివ్వటానికి సంకోచంచటం ఆశ్చర్యమేమీ కాదు. సమాజం విలువలను సరిగా గుర్తించ గలిగిన స్థితికి వచ్చేదాకా యలాంటి వ్యత్యాసాలను సజ్జనులు సహించక తప్పదు.

    ReplyDelete
  4. @Radhakrishna,

    Well Said. I too agree with you and I do not like to brand entire Police force as corrupt and rude. But rudeness is one weapon they have to use more frequently to control the people and quell unrest. This is a professional hazard they carry.

    ReplyDelete