Tuesday 1 November 2011

నేనెందుకు ఎదురు తిరిగానంటే?

ట్రైనింగ్ మొదట్లో మొదలైన వంటి నొప్పులు క్రమంగా తగ్గుముఖం పట్టి శరీరం శారీరఖ కష్టానికి అలవాటైపోయింది. మాకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు 10:00 గంటలకు బయటికి వదిలేవారు. ఆ రోజు బయట ఏదయినా పని ఉన్నా, కొనుక్కోవాలన్నా, సినిమాలు చూడాలన్నా వెళ్ళేవాళ్ళం. నేను మాత్రం తప్పకుండా సినిమా చూసేవాడ్ని, ఎందుకంటే 5 వ తరగతి నుండి నేను దాదాపు ప్రతి మంచి సినిమా చూసేవాడ్ని, అంత ఇష్టం నాకు సినిమాలంటే. మాకు వచ్చే స్టైఫండ్ లో ఎక్కువ మొత్తం మెస్ చార్జీలకే పోతుండేది, కానీ భోజనం ఏమాత్రం బావుండేది కాదు. అయినా ఎవరూ ఏమీ అనే వాళ్ళు కాదు, ఎందుకంటే ఒకటి రెండు సార్లు మా ప్రిన్సిపాల్ (SP రాంక్ అధికారి), మా ప్రాబ్లమ్స్ గురించి అడిగితే మేము మెస్ గురించి చెప్పినా ఏమీ మారలేదు. అయితే నాకు మాత్రం చదువుకునే రోజుల్లో మా హాస్టల్ లో భోజనం బాగాలేకపోతే మేము ఎదురు తిరిగి, మంచిగా పెట్టేలా చేసిన గొడవ గుర్తుకొస్తుండేది.  

          ఒకరోజు మాకు బ్రేక్ఫాస్ట్ కు "ఉప్మా" పెట్టారు, అది ఏమీ బాగాలేకపోవటంతో  నేను అక్కడ ఉండే మెస్సులోని వ్యక్తితో గొడవపడ్డాను. అతను  మా మెస్సుకు ఇంచార్జ్ అయిన CI స్థాయి అధికారికి ఫిర్యాదు చేసాడు . మేము టిఫిన్ చేస్తుండగా ఆ అధికారి మెస్ దగ్గరకు వచ్చాడు. ఆయన బహు కోపిష్టి, నన్ను చూస్తూ "ఏమి ఎవరికీ లేని ఇబ్బంది నీకే వచ్చిందా?, పెట్టింది తిని బుద్దిగా ట్రైనింగ్ చేస్కోవచుగా?, తిన్నది అరగటం లేదా?" అని కోప్పడ్డాడు. దాంతో నాలో స్వతహాగా ఉన్న ఎదిరించే తత్త్వం బయటికి వచ్చింది. నేను వెంటనే "మా స్టైఫండ్ మొత్తం కట్ చేస్తున్నారు, భోజనం సరిగా ఎందుకు పెట్టరు, నేను పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను" అని అన్నాను. దాంతో ఆయనకీ ఇంకా బి.పి. పెరిగిపోయి, " నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోపో, నాకే ఎదురు మాట్లాడతావా?, రేపు ఈపాటికి నువ్వు ఇంట్లో ఉంటావు, అపుడు తెలుస్తుందిలే నేనేమిటో" అని వెళ్ళిపోయాడు. అది తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ "ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకున్నావు, అనవసరంగా ఇబ్బంది పడతావు" అన్నారు. నేను వాళ్ళతో "నేనేం తప్పు మాట్లాడాను, ఎవరో ఒకరు అడగకపోతే వీళ్ళు మారరు" అని చెప్పాను. కొద్దిసేపటికే నన్ను ప్రిన్సిపాల్ గారు పిలిపించి, ఎందుకు మెస్ ఆఫీసర్ కు ఎదురు తిరిగావు? అని అడిగారు. నేను జరిగిన విషయం అంతా చెప్పాను. అపుడు ఆయన "సరే మెస్ విషయం నేను చూస్కుంటాగానీ, మళ్ళీ ఎపుడైనా ఇలా ఆఫీసర్ లతో గొడవ పడితే నిన్ను ఇంటికి పంపిస్తాను" అని అన్నాడు. నేను సరే సర్ అని చెప్పి బయటికి వచ్చాను. 

          తర్వాత మా ట్రైనర్ నాతో " ఏదో 9 నెలలు ట్రైనింగ్ ను నువ్వు ఇక్కడ ఉన్నావా? లేవా? అన్నట్టు చేస్కోవాలిగానీ, ఇలా ఆఫీసర్ లతో గొడవ పడతారా?, పోలీసులో ఏదైనా సహిస్తారేమో గానీ, పై అధికారులకు ఎదురుతిరిగితే సహించరు, ఇది క్రమశిక్షణ ఉండాల్సిన ఉద్యోగం, నీకు నచ్చకపోయినా మరి ఎప్పుడూ పై అధికారులకు ఎదురు తిరగకు" అని హితవు చెప్పారు. మా ట్రైనర్ కు నేను ట్రైనింగ్ లో బాగా నిజాయితీగా కష్టపడతానని నా మీద మంచి అభిప్రాయం ఉండబట్టే నాకు అలా చెప్పారు. దాంతో నేను కొంచెం నిరుత్సాహం చెందినా, ఆయన చెప్పిన మాటలు తర్వాత గానీ నాకు భోదపడలా.

(అసాంఘిక శక్తులు, నేరస్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించి , శాంతి భద్రతలు కాపాడటంలో సహకరించండి)
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
                                                                                      --కృతజ్ఞతలతో.

No comments:

Post a Comment